చేతిరాతతో మ్యాజిక్‌ చేసింది!

ఓ అక్క చేతిరాతతో రికార్డు సృష్టించింది. సరికొత్తగా కాలిగ్రఫీ ఫాంట్లను ఉపయోగించి, తనకంటూ ప్రత్యేక శైలితో అందర్నీ...

Published : 30 Oct 2021 02:06 IST

ఓ అక్క చేతిరాతతో రికార్డు సృష్టించింది. సరికొత్తగా కాలిగ్రఫీ ఫాంట్లను ఉపయోగించి, తనకంటూ ప్రత్యేక శైలితో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ సాధనే ఇప్పుడు తనకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇంతకీ తనెవరో.. ఏం చేస్తుంటుందో ఆ వివరాలన్నీ మీకోసం..

న్‌ మరియా బిజు. వయసు 16 ఏళ్లు. పుట్టింది కేరళలోని కన్నూర్‌. ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. నాన్న చంద్రాన్‌ కున్నెల్‌ బిజు జోస్‌, టీవీ మెకానిక్‌. అమ్మ స్వప్న, గృహిణి.

అలా మొదలైంది..
మరియాకు చిన్ననాటినుంచే చేతిరాత మీద ఇష్టం ఉండేది. దాంతో గుండ్రంగా రాయడం సాధన చేసి, అందరికీ చూపించేది. తను చదివే స్కూల్లో చేతి రాత పోటీలు పెడితే తనే ముందుండేది. క్రమంగా చేతిరాతపై ఆసక్తి పెరిగి, వాటిమీద ఎన్నో ప్రయోగాలు చేసింది. అందుకు లాక్‌డౌన్‌ సమయాన్ని చక్కగా వినియోగించుకుంది. గూగుల్‌, యూట్యూబ్‌లలో కాలిగ్రఫీ రైటింగ్‌ గురించి శోధించి, తనకు తానుగా మెలకువలు నేర్చుకుంది. రకరకాల పెన్నులను వాడి, కాలిగ్రఫీలో దాదాపు 10 ఫాంట్ల మీద మంచి పట్టు సాధించింది.

విజేతగా నిలిచింది..
న్యూయార్క్‌ ఆన్‌లైన్‌ వేదికగా జూన్‌ నెలలో ‘వరల్డ్‌ హ్యాండ్‌రైటింగ్‌ ఫర్‌ హ్యూమానిటీ(ప్రపంచ చేతిరాత పోటీ- 2021)’ పోటీలు జరిగాయి. అందులో ఆన్‌ మరియా కూడా పాల్గొంది. 13- 19 ఏళ్ల కేటగిరిలో, సృజనాత్మక విభాగంలో విజేతగా నిలిచింది. దీంతో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అంతేకాదు తన కాలిగ్రఫీ నైపుణ్యాలను, మెలకువలను తెలియజేయడానికి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను కొన్ని నెలల కిందట ప్రారంభించింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తన చేతిరాత వీడియోలను పంచుకుని ప్రశంసలు అందుకుంటోంది. మరియా ఇంకా బొమ్మలు వేస్తుంది.. కవితలు కూడా రాస్తుంటుంది. చదువుని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో తన అభిరుచిని కొనసాగిస్తూ, డాక్టర్‌ అవుతా అంటోంది. మరి అక్కకి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా!

- పొట్టబత్తిని రాజ్యలక్ష్మి, ఈనాడు డిజిటల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని