ఉడుతా ఉడుతా ఊచ్‌.. ఇది నా ఫ్రెండోచ్‌!

‘ఉడుతలు ఎక్కడుంటాయి..?’ ఇదేం పిచ్చి ప్రశ్న? ఎంచక్కా చెట్ల మీద ఉంటాయి. వేగంగా దూకుతూ.. పరిగెడుతూ కనిపిస్తుంటాయి... అని సమాధానం చెబుతారేమో.. ఈ ఉడుత మాత్రం ఓ

Published : 31 Oct 2021 00:43 IST

‘ఉడుతలు ఎక్కడుంటాయి..?’ ఇదేం పిచ్చి ప్రశ్న? ఎంచక్కా చెట్ల మీద ఉంటాయి. వేగంగా దూకుతూ.. పరిగెడుతూ కనిపిస్తుంటాయి... అని సమాధానం చెబుతారేమో.. ఈ ఉడుత మాత్రం ఓ కుటుంబ సభ్యుల భుజాల మీద సందడి చేస్తోంది. ఒక్కోసారి దాన్ని పెంచుతున్న చిన్నారి చొక్కా జేబులోకీ దూరి తల బయటకు పెట్టి తొంగి చూస్తోంది. ఇదంతా ఫన్నీగా అనిపిస్తున్నా.. దీని వెనక ‘అయ్యో.. పాపం’ అనే నేపథ్యమూ ఉంది. అదేంటో తెలుసుకుందామా!

సూర్యాపేటకు చెందిన అస్లాం ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఓ మూడునెలల కిందట ఫోన్లో ఆన్లైన్‌ తరగతులు వింటున్నాడు. ఇంటి దగ్గర్లో కాకులు అదేపనిగా అరవడం అస్లాం విన్నాడు. ఏంటబ్బా... అని అక్కడికి వెళ్లి చూడగా.. చెట్టుపై గూటిలో ఉన్న ఉడుత పిల్లను కాకులు తమ పదునైన ముక్కులతో పొడుస్తున్నాయి. అతను వెంటనే వాటిపై రాయిని విసరడంతో అవి ఎగిరిపోయాయి. గాయాలతో ఉన్న ఉడుత పిల్ల కింద పడింది.

చూస్తే బాధేసి..

కళ్లు కూడా తెరవని ఆ పసిగుడ్డును చూసి పిల్లాడికి చాలా బాధేసింది. దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని అమ్మానాన్న దగ్గరకు తీసుకెళ్లాడు. ముందు అది బతకదు అని వాళ్లు చెప్పారు. కానీ అస్లాం చిన్నబుచ్చుకోవడంతో వాళ్లు దాని గాయాలకు మందు రాశారు. తర్వాత పాలు పట్టించారు. అదృష్టవశాత్తు కొన్ని రోజుల్లోనే ఆ ఉడుత పిల్ల పూర్తిగా కోలుకుంది. అప్పటి నుంచి అది వీరితోనే, వీళ్లింట్లోనే కుటుంబ సభ్యుడిలా ఉంటోంది. దీని కోసం ఓ చిన్న పెట్టెను కూడా మన అస్లాం తయారు చేశాడు. దానిలో కొన్ని మెత్తటి వస్త్రాలూ పరిచాడు. ఆ ఉడుత ఆడుకొని.. ఆడుకొని.. అలసిపోయినప్పుడు ఎంచక్కా ఆ పెట్టెలోకి వెళ్లి హాయిగా నిద్రపోతోంది. దానికి పాలు, పండ్లు పెడుతూ.. దాన్ని అస్లాం కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు. చుట్టుపక్కలవాళ్లు, స్నేహితులు, జనగాం జంక్షన్లో వీళ్లు నడుపుతున్న టీ కొట్టుకొచ్చేవారు ఉడుత విన్యాసాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఆ బుజ్జి ఉడుతను రక్షించి, సంరక్షిస్తున్న మన అస్లాం మనసు నిజంగా వెన్న కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని