సేవకు సై అంటోన్న చిన్నారి..

చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి పేదలకు సాయం చేస్తుంది. ఇంతకీ ఎవరీ నేస్తం. తన మాటల్లోనే తెలుసుకుందాం రండి.

Published : 01 Nov 2021 00:14 IST

చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి పేదలకు సాయం చేస్తుంది. ఇంతకీ ఎవరీ నేస్తం. తన మాటల్లోనే తెలుసుకుందాం రండి.

నాపేరు ఆరాధిత్త గోయెంకా. వయసు 14 ఏళ్లు. ప్రస్తుతం బాంబే ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అమ్మా నాన్న అమిత్‌ గోయెంకా, నవ్యతా గోయెంకా.

గతేడాది మా నాన్న నాకు ‘డేనియల్‌’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అది చదివి ప్రేరణ పొందాను. సమాజానికి తనకు చేతనైనంత సాయం చేసిన యువతి కథ అది. దాన్ని చదివాక నాకు కూడా సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలనిపించింది.. అది అమ్మానాన్నకు చెప్పాను. వాళ్లూ నన్ను ప్రోత్సహించారు.

ఆలోచన వచ్చిందిలా!

పేదలకు సాయం చేయాలి. మరి ఎలా స్టార్ట్‌ చేయాలి? ఏం చేయాలి? అని నాకు నేనుగా ఆలోచించాను. విరాళాలు సేకరించి పేదలకు ఇవ్వడం నాకు నచ్చలేదు. నాకు నేనుగా సొంతంగా ఏదైనా చేయాలి అనుకున్నాను. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. నాకు బేకింగ్‌ చేయడమంటే భలే ఇష్టం. అయితే బేక్‌ చేసిన పదార్థాల్లో రాబడి కోసం అవీ ఇవీ కలుపుతారు. కాబట్టి వాటివల్ల చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఆరోగ్యకరమైన వాటితో బేకింగ్‌ పదార్థాలు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అందులోనూ మా అమ్మమ్మ చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. పంచదారకు బదులుగా బెల్లం, శుద్ధిచేసిన పిండికి బదులుగా బాదం పిండి, శుద్ధి చేసిన నూనెలకు బదులుగా కొబ్బరినూనె వాడాలని చెప్పేది. కాబట్టి నేను అనారోగ్య కరమైన పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన పదార్థాలను వాడాలని నిర్ణయించుకున్నాను.

‘మిరాకిల్‌’చేశాను..

నేను మొదలుపెట్టిన ప్రాజెక్టుకు ‘మిరాకిల్‌’ అని పేరు పెట్టాను. నేను కుకీలు తయారుచేసి అమ్మగా వచ్చిన డబ్బును క్యాన్సర్‌ రోగులకు, అనాథలైన చిన్నారులకు అందేలా ట్రస్ట్‌లను సంప్రదించాను. వాళ్లతో మమేకమై నా వంతుగా సాయం చేశాను. ఇలా చేయడం నా మనసుకు తృప్తిగా అనిపిస్తోంది. అటు చదువుకుంటూనే ఇటు వీళ్లకు సాయం చేయడం వెనుక అమ్మానాన్న, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది. నాతో పాటు కొంతమంది ఎన్‌జీవోల సాయం తీసుకుని ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేస్తున్నాను. ఇంకా మరిన్ని ప్రాజెక్టులు చేసి పేదలకు సాయం చేయడమే నా ఆశయం. అంతకు మించిన ఆనందం ఏముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని