ఊరంతా ఉరిమే ఉత్సాహం!

ఏ పల్లె చూసినా.. పిల్లలు, యువత అనే తేడా లేకుండా బ్యాటూ బాలూ పట్టుకుని క్రికెట్‌ ఆడుతుంటారు... కానీ ఓ గ్రామంలో మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపిస్తారు. అదీ ఏదో కాలక్షేపానికి కాదు. అచ్చం తలపండిన ప్రొఫెషనల్‌ ప్లేయర్లలా తలపడుతుంటారు.

Published : 02 Nov 2021 03:14 IST

ఏ పల్లె చూసినా.. పిల్లలు, యువత అనే తేడా లేకుండా బ్యాటూ బాలూ పట్టుకుని క్రికెట్‌ ఆడుతుంటారు... కానీ ఓ గ్రామంలో మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపిస్తారు. అదీ ఏదో కాలక్షేపానికి కాదు. అచ్చం తలపండిన ప్రొఫెషనల్‌ ప్లేయర్లలా తలపడుతుంటారు. ఇంతకీ అది ఏ ఊరో, ఇంకా విశేషాలేంటో తెలుసుకుందామా!

పంజాబ్‌లోని రూర్కాకలాన్‌ గ్రామం పేరు చెప్పగానే వెంటనే ఫుట్‌బాల్‌ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇది అన్ని గ్రామాల్లా మామూలు ఊరు కాదు. దీనికి భారతదేశపు ఫుట్‌బాల్‌ గ్రామం అని పేరు. ఈ ఊళ్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక ఫుట్‌బాల్‌ ఆటగాడు ఉంటాడు. ఈ గ్రామానికీ ఫుట్‌బాల్‌కూ మధ్య అనుబంధం 1965 నుంచి ప్రారంభమైంది. అప్పట్లో గ్రామంలో స్కూలు భవనం కోసం జనాలు కొంత మొత్తం నగదు పోగేశారు. వాటితోనే ఫుట్‌బాల్‌ మైదానమూ నిర్మించుకున్నారు.

అంతర్జాతీయ హంగులతో...

ప్రస్తుతం ఈ మైదానం ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంతర్జాతీయ హంగులు సమకూర్చుకుంది. ఇక్కడ పిల్లలు, యువతకు శిక్షణ ఇవ్వడానికి అంతర్జాతీయ కోచ్‌లను సైతం పిలిపిస్తుంటారు. కేవలం బాలురే కాదు.. బాలికలు కూడా ఫుట్‌బాల్‌లో తమ సత్తా చాటుతున్నారు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ‘స్ట్రీట్‌ చైల్డ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’లోనూ ఈ గ్రామం నుంచి వెళ్లిన క్రీడాకారులు సత్తా చాటారు. స్థానికంగా జరిగిన పోటీల్లో అయితే విజయాలకు లెక్కేలేదు. ఈ ఊరి వారు పోటీ పడటానికి వస్తున్నారు అంటే.. మిగతావారు ‘ఇంకెందుకు పోటీ.. కప్పు వాళ్లదే..’ అని ఫిక్సైపోతారంట. నేస్తాలూ.. ఇవీ ఫుట్‌బాల్‌ గ్రామం విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని