మజులీ అనే నేను!

నా పేరు మజులీ.. నేను ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దీవిని. ‘అదేంటి.. అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌ కదా.. మరి మజులీ అంటారేంటి?’ అనే అనుమానం మీకు మొదటి వాక్యం చదవగానే వచ్చి ఉంటుంది కదూ నేస్తాలూ!

Updated : 09 Nov 2021 00:37 IST

నా పేరు మజులీ.. నేను ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దీవిని. ‘అదేంటి.. అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌ కదా.. మరి మజులీ అంటారేంటి?’ అనే అనుమానం మీకు మొదటి వాక్యం చదవగానే వచ్చి ఉంటుంది కదూ నేస్తాలూ! కానీ నేను నదిలో ఏర్పడ్డ దీవిని. నేను నదీదీవుల్లో విస్తీర్ణం పరంగా పెద్దదాన్ని. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా.. ఎక్కడో.. అక్కడెక్కడో విదేశాల్లో కాదు.. నేనుంది మన దేశంలోనే...!

స్సాంలోని బ్రహ్మపుత్ర, దిహింగ్‌ నదుల మధ్యలో ఉన్నాను నేను. 2016లో నాకు ప్రపంచంలో అతిపెద్ద నదీదీవిగా గుర్తింపు దక్కింది. 20వ శతాబ్దం మొదట్లో నేను దాదాపు 880 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదాన్ని. కానీ 2014 నాటికి నేను 553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పరిమితమయ్యాను. మిగతా భాగం కోతకు గురైంది. అయినా ఇప్పటికీ నేనే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నదీదీవిని.

వందల ఏళ్ల క్రితమే...

కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాలు, వరదల వల్ల నేను ఏర్పడ్డానట. ప్రస్తుతం నాలో 144 గ్రామాలున్నాయి. దాదాపు 1,50,000 మంది జనాభా నివసిస్తున్నారు. నాలో చాలా సారవంతమైన నేలలున్నాయి. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. నా అందాలను, నా దగ్గర సేదతీరే పక్షులను వీక్షించడానికి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

తప్పని గుండె‘కోత’

నేను 1949 నుంచి 2004 మధ్య 206.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కోల్పోయాను. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తెలిసింది. దీనికి ప్రధాన కారణం బ్రహ్మపుత్ర నది. అవును.. ఆ నదికి వచ్చే పెద్ద.. పెద్ద వరదలు క్రమక్రమంగా నన్ను కరిగిపోయేలా చేస్తున్నాయి. ఇలా రోజు రోజుకూ కోతకు గురవుతున్న అరుదైన దీవినైన నన్ను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏకంగా 233.54 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రస్తుతం నా పరిరక్షణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నేస్తాలూ..! ఇవీ నా విశేషాలు.. ఇక ఉంటామరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని