నా ముక్కే... ఆ ముక్క చెబుతుంది!

‘ముక్కు.. ఏంటి? చెప్పడం.. ఏంటి?’ అని సందేహిస్తున్నారు కదూ! అవును ముక్కు చెబుతుంది. నా వయసెంతో నా ముక్కే చెబుతుంది. ఇంతకీ నేనెవర్నో చెప్పనేలేదు కదూ! నేను నేస్తాలూ..!

Updated : 11 Nov 2021 03:53 IST

‘ముక్కు.. ఏంటి? చెప్పడం.. ఏంటి?’ అని సందేహిస్తున్నారు కదూ! అవును ముక్కు చెబుతుంది. నా వయసెంతో నా ముక్కే చెబుతుంది. ఇంతకీ నేనెవర్నో చెప్పనేలేదు కదూ! నేను నేస్తాలూ..! మీ సింహాన్ని. సరే ఇప్పుడు ముక్కు దగ్గరకు వద్దాం. ‘మీ వయసెంత?’ అని ఏ అంకులో, ఆంటీనో మిమ్మల్ని అడిగితే మీరు నోటితో టక్కున చెబుతారు. కానీ నాకది సాధ్యం కాదు కదా.. అందుకే నా ముక్కే ఆ ముక్క చెబుతుంది. అది ఎలా అంటే...

మేం పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు మా ముక్కు రంగులో మార్పులు వస్తాయి. మూడు నెలల వయసు వరకు ముక్కు గులాబీ రంగులోకి మారుతుంది. ఆ తర్వాత నుంచి గులాబీ రంగులో ఉండే ముక్కు క్రమక్రమంగా నలుపు రంగుకు మారుతుంది.

మూడేళ్ల నుంచి..

మూడేళ్ల వరకు కేవలం రంగులో మాత్రమే మార్పు వస్తుంది. కానీ ఆ తర్వాత ముక్కు మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు వస్తాయి. ఇవి క్రమంగా పెరుగుతాయి. ఈ మార్పు ప్రతి సంవత్సరమూ స్పష్టంగా తెలుస్తుంది. ఓ చెట్టు వయసును దాని కాండం లోపల వలయాలను బట్టి ఎలా అయితే చెప్పేయొచ్చో మా వయసును కూడా మా ముక్కు రంగు, ముక్కుపై ఉండే మచ్చలను చూసి దాదాపుగా చెప్పవచ్చు అన్నమాట.

ఎనిమిదేళ్ల వయసులో..

ఇలా క్రమక్రమంగా రంగు మారుతూ వచ్చిన మా ముక్కు.. మేం ఎనిమిదో సంవత్సరంలో అడుగుపెట్టే సరికి పూర్తిగా నలుపు రంగులోకి మారిపోతుంది. ‘అయినా.. ఓ సింహమా.. నీ ముక్కు రంగు మారితే మాకేంటి? మారకపోతే మాకేంటి?’ అని మీరంటారేమో! కానీ దీని వల్ల చాలా ఉపయోగముంది తెలుసా! అడవుల్లో ఉన్న సింహాల సంఖ్యను లెక్కించే సమయంలో ఏ వయసువి ఎన్ని ఉన్నాయో గుర్తించడం తేలికవుతుంది. శరీర పరిమాణాన్ని బట్టి అంచనా వేసేకంటే.. మా ముక్కురంగును బట్టి మా వయసు ఎంతో చెప్పేయడం తేలిక. కాస్త కచ్చితంగా కూడా ఉంటుంది. నేస్తాలూ.. మీకిది ఇంతకు ముందెన్నడూ తెలియని కొత్తవిషయమనే అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంతే నా ముక్కు సంగతులు. ఇక ఉంటామరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని