అన్నింటా నేనుంటా..!

రూబిక్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేయడం అంత సులువేం కాదు. అలానే హూలా హూప్స్‌ తిరగడం కూడా ఓ కళ. వాటితో పాటు జ్ఞాపకశక్తిలో కూడా ఔరా అనిపిస్తోంది ఓ నేస్తం. మూడు కళల్లోనూ ఒకేసారి తన ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సాధించింది..

Published : 13 Nov 2021 00:27 IST

రూబిక్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేయడం అంత సులువేం కాదు. అలానే హూలా హూప్స్‌ తిరగడం కూడా ఓ కళ. వాటితో పాటు జ్ఞాపకశక్తిలో కూడా ఔరా అనిపిస్తోంది ఓ నేస్తం. మూడు కళల్లోనూ ఒకేసారి తన ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సాధించింది.. తనెవరో ఏంటో తెలుసుకుందాం రండి..

నేస్తం పేరు హన్నా రచెల్‌ రానిష్‌. వయసు ఏడేళ్ల్లు. స్వస్థలం కేరళ. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది.

చదువులోనూ చురుకే!

హన్నా చిన్నప్పట్నుంచీ చురుకే! ఏది చెప్పినా ఇట్టే నేర్చుకునేది. చదువులో కూడా ఫస్ట్‌ ర్యాంకరే! హన్నాకి రూబిక్‌ క్యూబ్‌ ఎలా సాధన చేయాలో నేర్పించారు వాళ్ల నాన్న. అయితే ఒక్కసారి చూపించగానే తనే సాల్వ్‌ చేసేసేది. తనకున్న జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయారు అమ్మానాన్న. ఇక అప్పట్నుంచి రకరకాల రూబిక్‌ క్యూబ్‌లను ఇచ్చి సాధన చేయించేవారు. సరదాగా హూలా హూప్స్‌ కూడా బాగా ఆడేది హన్నా. అందుకని ఖాళీ సమయాల్లో రెండూ ఒకేసారి ఆడేలా ఇంట్లోనే శిక్షణ ఇచ్చారు.

జ్ఞాపకశక్తి మెండు..

హన్నా కూడా మరింత చురుగ్గా క్యూబ్‌ సాల్వ్‌ చేస్తూనే హూలా హూప్స్‌ ఆడేది. సాధన చేయిస్తూ పోటీలకు వెళ్లేది. ఏ చిన్న పోటీ జరిగినా తనే ముందుండేది. అలా ఈ మధ్య దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటు రూబిక్‌ క్యూబ్‌ సాధన చేస్తూ.. ఇటు హూలా హూప్స్‌ ఆడుతూ.. మనదేశ రాష్ట్రాల రాజధానులన్నిటిని 1 నిమిషం 34 సెకన్లలో గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. మూడింటా తన ప్రతిభను చూసి, తనకు ‘వరల్డ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో చోటు కల్పించారు. నిజంగా హన్నా గ్రేట్‌ కదూ! మరింకేం హన్నాకు అభినందనలు తెలిపేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని