నేనో తెల్ల జిరాఫీని!

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి అలా చూస్తున్నారు. నేను కాస్త విచిత్రంగా కనిపిస్తున్నా కదూ! అవును నేనో తెల్ల జిరాఫీని. మీకు తెల్ల ఏనుగు, తెల్ల సింహం...

Published : 16 Nov 2021 01:19 IST

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి అలా చూస్తున్నారు. నేను కాస్త విచిత్రంగా కనిపిస్తున్నా కదూ! అవును నేనో తెల్ల జిరాఫీని. మీకు తెల్ల ఏనుగు, తెల్ల సింహం, తెల్ల పులి, తెల్ల నెమలి.. ఇలా కొన్ని జీవుల గురించి తెలిసి ఉంటుంది కదా! కానీ తెల్ల జిరాఫీ విషయం తెలిసి ఉండదు కదూ..! అందుకే నా విశేషాలు చెప్పి పోదామని ఇదిగో ఇలా వచ్చాను.

నేను కెన్యాలో ఉంటాను. నేనో మగ జిరాఫీని. ప్రపంచంలో జీవించి ఉన్న ఏకైక తెల్ల జిరాఫీని నేనే. అందుకే నా గురించి అక్కడి యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. 2020 మార్చిలోనే వేటగాళ్లు నా భార్యాబిడ్డల్ని చంపేశారు. అప్పటి నుంచి అధికారులు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అడవిలో ఎప్పటికప్పుడు నా ఉనికిని తెలుసుకునేందుకు నాకు జీపీఎస్‌ యంత్రం కూడా అమర్చారు. గంట గంటకు ఇది వారికి సందేశం పంపుతోంది. ఈ ఏర్పాటు నాకు చాలా రక్షణ కల్పిస్తోంది.  

తెల్లగానే ఎందుకంటే...
నా జన్యువుల్లో కొన్ని మార్పుల వల్ల నేను ఇలా తెల్లగా ఉన్నాను. నా చర్మం పిగ్మెంటేషన్‌ను కోల్పోవడం వల్ల నేను ఇలా తెలుపురంగులో ఉన్నానన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం కూడా కొన్ని తెల ్లజిరాఫీలను పరిశోధకులు గుర్తించారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం అవి జీవించి లేవు. మొదటగా 2016లో కెన్యాలో, తర్వాత టాంజానియాలో వాటిని కనుగొన్నారు. కానీ వేటగాళ్ల దాడిలో అవి ప్రాణాలు కోల్పోయాయి.

మా చర్మం, మాంసం కోసం...
వేటగాళ్లు మా చర్మం, మాంసం కోసం మమ్మల్ని వేటాడుతుండడం వల్ల మాకు ఈ దుస్థితి వస్తోంది. గత 30 సంవత్సరాల్లోనే ఏకంగా 40 శాతం వరకు జిరాఫీల సంఖ్య తగ్గింది. దీనికి వేటే ప్రధానకారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 68,293 జిరాఫీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదృష్టవశాత్తు నేను తెల్లగా పుట్టడం వల్ల, ప్రపంచంలో నేనొక్కదాన్నే తెల్ల జిరాఫీని అవడం వల్ల అధికారులు నా రక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో నా కథ ముగిసిపోయి ఉండేది. అధికారులు కాస్త ముందే మేల్కొని ఉంటే.. నా భార్యాబిడ్డా కూడా ప్రాణాలతోనే ఉండేవి. ఇవీ నేస్తాలూ.. నా సంగతులు. ఇక ఉంటామరి బై.. బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని