బం.. బం.. బంబూకా!

బంబూకా.. ఇది నా పేరు. అవును ఇది నాపేరు... ఇంతకీ నేనెవరంటే... ఓ కొత్త సైకిల్‌ను.. ఆగాండాగండి! ఓస్‌.. ఇంతేనా అని పేజీ తిప్పేయకండి.. ఎందుకంటే నేను మామూలు సైకిల్‌ను కాదు. వెదురు సైకిల్‌ను.. నా ప్రత్యేకతలు ఏంటంటే...

Published : 20 Nov 2021 00:35 IST

బంబూకా.. ఇది నా పేరు. అవును ఇది నాపేరు... ఇంతకీ నేనెవరంటే... ఓ కొత్త సైకిల్‌ను.. ఆగాండాగండి! ఓస్‌.. ఇంతేనా అని పేజీ తిప్పేయకండి.. ఎందుకంటే నేను మామూలు సైకిల్‌ను కాదు. వెదురు సైకిల్‌ను.. నా ప్రత్యేకతలు ఏంటంటే...

చిన్నారులైన మీకు.. సైకిల్‌నైన నాకు చాలా అనుబంధం ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బర్త్‌డే గిఫ్ట్‌గా మీ దగ్గరకొచ్చి.. మిమ్మల్ని బడికి, మైదానానికి, ఇంకా చిన్న చిన్న దూరాలకు మోసుకుపోతుంటాను. ఓ రకంగా నేనూ మీ ప్రియ నేస్తాన్నే. సరే.. ఇప్పుడిక అసలు విషయంలోకి వస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో తయారైన పర్యావరణ హిత సైకిల్‌ను నేను. నన్ను వెదురుతో తయారు చేశారు. అంటే మొత్తం వెదురుతోనే కాదు... తప్పనిసరిగా ఉపయోగించాల్సిన చోట.. ఇనుము, రబ్బరు, ప్లాస్టిక్‌ కూడా వాడారు ఫ్రెండ్స్‌.

నా గొప్ప ఏంటంటే..

‘ఆ.. ఏముందిలే, వెదురు సైకిల్‌వు నువ్వు’ అని నన్ను తేలిగ్గా తీసిపారేయకండి. నేను మామూలు సైకిళ్ల కన్నా దృఢంగా ఉంటాను. పైగా నేను షాక్‌ ప్రూఫ్‌. నన్ను మీరు చాలా తేలిగ్గా తొక్కగలరు. ముఖ్యంగా నేను తుప్పు పట్టను!

చాలా తేలిక...  

నేను మిగతా సైకిళ్లతో పోల్చుకుంటే.. తక్కువ బరువుంటాను. కేవలం 8.2 కిలోలు ఉంటానంతే. పైగా నన్ను తొక్కడం చాలా తేలిక. నిజానికి మన దేశంలో నేనే మొదటి వెదురు సైకిల్‌ను కాదు. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మొదటి దాన్ని. మన దేశంలో నాకంటే ముందే మరో మూడు సైకిళ్లు, వెదురుతో తయారయ్యాయట!

ఈ మధ్యే పుట్టాను

నాకు ‘బంబూకా’ అనే పేరు పెట్టి ‘నేషనల్‌ ట్రైబల్‌ ఫెస్టివల్‌ అండ్‌ రాజ్యోత్సవ-2021’ కార్యక్రమంలో ఇటీవలే లాంచ్‌ చేశారు. ఇంతకీ నా ధర ఎంతో చెప్పనేలేదు కదూ! ‘ఏముందిలే... వెదురుతోనే తయారైంది కదా... చాలా తక్కువ ఉంటుంది లే!’ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నా ధర ఏకంగా 50,000 రూపాయలు. ఇవీ నేస్తాలూ.. నా విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని