బుడతడి జ్ఞాపకశక్తి భళా!

మహాభారతంలో కౌరవులు ఎంతమంది అంటే.. టక్కున ‘100 మంది’ అని చెప్పేస్తాం కదా! కానీ వాళ్ల పేర్లు చెప్పమంటే కష్టమే! అలాంటిది వాళ్ల పేర్లను ఆంగ్లంలో స్పెల్లింగ్‌తో సహా గడగడా చెప్పేశాడీ బుడతడు. ఇదే కాదు..

Published : 21 Nov 2021 00:16 IST

మహాభారతంలో కౌరవులు ఎంతమంది అంటే.. టక్కున ‘100 మంది’ అని చెప్పేస్తాం కదా! కానీ వాళ్ల పేర్లు చెప్పమంటే కష్టమే! అలాంటిది వాళ్ల పేర్లను ఆంగ్లంలో స్పెల్లింగ్‌తో సహా గడగడా చెప్పేశాడీ బుడతడు. ఇదే కాదు.. తన జ్ఞాపకశక్తితో ఎన్నో బహుమతులు గెలుచుకుంటున్నాడు. ఎవరీ చిన్నారి. తెలుసుకునేందుకు చదివేయండి..
తిరువనంతపురానికి చెందిన ఈ చిన్నారి పేరు తాత్విక్‌, వయసు ఆరేళ్లు. తాత్విక్‌ వాళ్ల ఇంట్లో రోజూ ఇంగ్లిష్‌ పేపర్‌ వేయించుకుంటారు. అది వాళ్ల తాతయ్య చదువుతుంటే తాత్విక్‌ ఆసక్తిగా చూసేవాడట. వాళ్లమ్మ శ్రీతు శ్యామ్‌, ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. ఆమె.. తాత్విక్‌ ఆసక్తిని గమనించి చిన్న చిన్న ఇంగ్లిష్‌ పదాలు నేర్పేవారట. అలాగే జనరల్‌ నాలెడ్జ్‌ బిట్స్‌ కూడా చెబుతూ ఉండేవారట. తాత్విక్‌ కూడా అవన్నీ చక్కగా నేర్చుకుంటూ తిరిగి చెప్పేవాడు. తన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోతూ తనకి మరిన్ని విషయాలు చెప్పేవారు అమ్మ, తాతయ్య. ఇంకేముంది దేశాలు, వాటి రాజధానులు, కేరళలోని ముఖ్యమైన జలపాతాలు, పక్షుల పేర్లు ఇలా అన్నింటిని గుర్తుపెట్టుకుని చెప్పేవాడు.

అబాకస్‌లోనూ ప్రతిభ..
తన ప్రతిభకు మరింత సానబెట్టేందుకు మహాభారతంలోని 100 మంది కౌరవులు, దృతరాష్ట్రుడితో కలిపి 101 మంది పేర్లను ఆంగ్లంలో స్పెల్లింగ్‌తో సహా నేర్పారు. తను నేర్చుకున్న వెంటనే రికార్డు సెలెక్షన్‌ కమిటీ వాళ్లకి తెలియజేశారు. అంతే ఒక్కనిమిషం 14 సెకన్లలో 101 పేర్లను స్పెల్లింగ్‌తోపాటు చెప్పేసి ‘ఔరా’ అనిపించాడు. దాంతో ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇలా పలు రికార్డుల్లో తాత్విక్‌ పేరును నమోదు చేశారు నిర్వాహకులు. అంతేకాదు.. తాత్విక్‌ అబాకస్‌లో కూడా ప్రతిభ చూపుతాడు. అన్నట్టు తన జ్ఞాపకశక్తిని రాజకీయవేత్త శశిథరూర్‌ కూడా మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అలా మన తాత్విక్‌ అన్నింటా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అదన్నమాట సంగతి. మరి మన నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని