తగ్గేదేలే... దూసుకెళ్తా!

వయసు పదకొండు నెలలు.. నడక కూడా సరిగా రాదు.. కానీ ఏకంగా స్నోబోర్డింగ్‌ చేసేస్తోంది... ఈ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా బుజ్జి బుడత.. తను ఎక్కడ ఉంటుంది.. ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఉందా...!

Published : 23 Nov 2021 00:46 IST

వయసు పదకొండు నెలలు.. నడక కూడా సరిగా రాదు.. కానీ ఏకంగా స్నోబోర్డింగ్‌ చేసేస్తోంది... ఈ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా బుజ్జి బుడత.. తను ఎక్కడ ఉంటుంది.. ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఉందా...!
స్నోబోర్డ్‌ మీద రయ్‌..రయ్‌..మంటూ దూసుకుపోతూ వైరల్‌ అయిన బుజ్జాయి పేరు వాంగ్‌ యుజి. ఆ చిన్నారి తల్లిదండ్రులది చైనా. వాళ్లకు క్రీడలంటే చాలా ఇష్టం. అందుకే తమ కూతురుని ఇంత చిన్న వయసు నుంచే స్నోబోర్డింగ్‌ క్రీడలో ప్రోత్సహిస్తున్నారు. చోంగ్లీ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో ఉండే స్నోట్రాక్స్‌ మీద ఈ బుడత షూ, గ్లౌజులు, హెల్మెట్‌, కూలింగ్‌ గ్లాసెస్‌, స్వెట్టర్‌ వేసుకుని దర్జాగా స్నో బోర్డింగ్‌ చేసింది. అమ్మానాన్న చిటికెన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేయాల్సిన వయసులోనే ఏకంగా స్నోబోర్డింగ్‌ చేస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. యుజి.. స్నోబోర్డింగ్‌ చేస్తున్నప్పుడు తండ్రి సహాయం చేయగా.. తల్లి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది.
పడి పడి లేస్తూ..  
ఇలా స్నోబోర్డింగ్‌ చేస్తున్నప్పుడు, యుజి కొన్ని సార్లు కిందపడ్డా.. అసలు ఏడవ లేదు. కాస్త కూడా భయపడలేదు. మళ్లీ వాళ్ల నాన్న వచ్చి నిలబెట్టగానే వెంటనే స్నోబోర్డింగ్‌కు సిద్ధమైపోయింది. ఇలా ఈ బుజ్జి బుడత స్నోబోర్డింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేస్తోంది. ఇంత చిన్న వయసులోనే అంత గొప్పగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ స్నోబోర్డింగ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు కదా! ఎంతైనా వాంగ్‌ యుజి గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని