ఒక ఊరు.. రెండు భాషలు!

‘అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రెండు భాషలు...’ ‘ఏంటీ... ఒక గ్రామంలో రెండు భాషలు ఉండటం కూడా గొప్పేనా..! కొన్ని ఊళ్లలో అయితే అయిదారు భాషలు కూడా మాట్లాడే వాళ్లుంటారు. అంతెందుకు నగరాల్లో ఇంకా ఎక్కువ భాషలే మాట్లాడే జనాలూ ఉంటారు.

Updated : 25 Nov 2021 01:09 IST

‘అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రెండు భాషలు...’ ‘ఏంటీ... ఒక గ్రామంలో రెండు భాషలు ఉండటం కూడా గొప్పేనా..! కొన్ని ఊళ్లలో అయితే అయిదారు భాషలు కూడా మాట్లాడే వాళ్లుంటారు. అంతెందుకు నగరాల్లో ఇంకా ఎక్కువ భాషలే మాట్లాడే జనాలూ ఉంటారు. ఇందులో వింతేముంది?’ అని మీరు తేలిగ్గా తీసేస్తారేమో..! కానీ ఆ ఊళ్లో మగవాళ్లకు ఓ భాష. ఆడవాళ్లకు మరో భాష ఉంటాయి మరి!

‘మతాలు, తెగలు, ప్రాంతాల పరంగా భాషల్లో తేడాలుంటాయి కానీ... ఆడ, మగవాళ్లకు కూడా వేరు వేరు భాషలుంటాయా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా ఉండదు కానీ.. ఆఫ్రికా ఖండంలో ఉన్న నైజీరియా దేశంలోని ఉబాంగ్‌ గ్రామంలో మాత్రం ఆడవారికి ఓ భాష. మగవారికి మరో భాష ఉంటుంది.

తెగ పేరే ఊరు పేరు..  

ఈ ఊర్లో ఉబాంగ్‌ తెగవాళ్లే ఎక్కువగా ఉంటారు. అందుకే వీళ్ల పేరు మీదే ఈ గ్రామానికి ఉబాంగ్‌ అనే పేరు వచ్చింది. ‘అది సరే.. మరి ఆడ, మగ మాట్లాడుకోవాలనుకుంటే ఎలా?’ అనేగా మీ అనుమానం. ఏముంది.. ఆడవాళ్లు.. ఆడవాళ్ల భాషలోనే మాట్లాడతారు. మగవారు.. మగవాళ్ల భాషలోనే మాట్లాడతారు.

పిల్లలకు మినహాయింపు!

ఆడవారికి.. ఆడవాళ్ల భాషతో పాటు, మగవారి భాష కూడా వస్తుంది. అలాగే మగవారికి... మగవాళ్ల భాషతో పాటు ఆడవాళ్ల భాష కూడా వస్తుంది. దీంతో ఒకరు మాట్లాడేది మరొకరు.. చక్కగా అర్థం చేసుకోగలరు. కానీ ఎవరి భాష వారే మాట్లాడతారు. ‘మరి పిల్లల పరిస్థితి ఏంటబ్బా?’ అని మీకు ఇప్పటికే మరో సందేహం వచ్చి ఉండాలే..! ఇక్కడ పిల్లలకు ఆ నిబంధనలు ఏమీ లేవు. ఎవరు ఏ భాషైనా మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ ఓ చిన్న మెలిక ఉంది. అదేంటంటే... పదేళ్లలోపు వారికే ఈ మినహాయింపు. పదేళ్లు నిండగానే.. ఆడపిల్లలు.. ఆడవాళ్ల భాష, మగపిల్లలు.. మగవాళ్ల భాష మాట్లాడాల్సిందే.. తప్పదు. మొత్తానికి ఉబాంగ్‌ సంగతులు భలే తమాషాగా ఉన్నాయి కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని