అయ్య బాబోయ్‌.. అందాల రాక్షసి!

రంగు రంగుల, విచ్చుకున్న ఈకల్లాంటి వాటితో చూడముచ్చటగా ఉంటుంది అది. దాని పేరు లయన్‌ ఫిష్‌. ఇది సముద్రజలాల్లో కనిపించే ఓ అందమైన జీవి. ఇది విషపూరితం కాదు. కానీ ఇప్పుడిది ఇతర చేపల పాలిట రాకాసిగా మారింది. ఎందుకంటే...

Published : 01 Dec 2021 00:41 IST

రంగు రంగుల, విచ్చుకున్న ఈకల్లాంటి వాటితో చూడముచ్చటగా ఉంటుంది అది. దాని పేరు లయన్‌ ఫిష్‌. ఇది సముద్రజలాల్లో కనిపించే ఓ అందమైన జీవి. ఇది విషపూరితం కాదు. కానీ ఇప్పుడిది ఇతర చేపల పాలిట రాకాసిగా మారింది. ఎందుకంటే...

లయన్‌ ఫిష్‌ దాదాపు అన్ని సముద్రాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసియా పరిసర ప్రాంతాలు వీటి సహజ నివాస ప్రాంతాలు. వీటికి ఆకలి చాలా ఎక్కువే. తక్కువ సమయంలోనే చాలా చేపల్ని ఇది అమాంతం హాంఁఫట్‌ చేసేస్తుంది. విచ్చుకున్న ఈకల్లాంటి నిర్మాణాల వల్ల దీనికి సహజ శత్రువులు కూడా తక్కువ. అందుకే ప్రస్తుతం వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ఇవి మరింతగా పెరిగితే.. ఇతర చేపలు చాలా వరకు వీటికి ఆహారంగా మారతాయి. ముఖ్యంగా చిన్న చేపల సంగతి సరేసరి. కొన్ని అరుదైన జాతులవి అయితే పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందట.

ఇప్పటికే లక్షల్లో...  
కొన్ని లక్షల లయన్‌ఫిష్‌ చేపలు కరేబియన్‌, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో తిష్ట వేశాయి. కరేబియన్‌ జలాల్లో ఈ చేపలను వేటాడి తినే జీవులు అసలు లేవు. దీనికి తోడు ఇవి పెద్ద ఎత్తున సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎంతలా అంటే ఇవి ప్రతి నాలుగు రోజులకు ఏకంగా 30 వేల నుంచి 40 వేల వరకు గుడ్లు పెడతాయి. వీటి నుంచి భారీగా పిల్లలు బయటకు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడి సముద్ర జలాల్లో ఎక్కడ చూసినా ఈ చేపలే కనిపించే పరిస్థితులు దాపురించాయి.

చక్కటి పరిష్కారం..
వెనిజులాలో ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం కనిపెట్టారు. అది ఏంటో కాదు. వాటిని వేటాడమే.. అవును వాటిని వేటాడి, వాటి మాంసాన్ని ‘సవీచి’ అనే వంటకంలో వాడుతున్నారు. రుచి కూడా అద్భుతంగా ఉండటంతో జనాలు దీని మాంసం కోసం ఎగబడుతున్నారు. సముద్రంలో జీవవైవిధ్యం దెబ్బతినకుండా ఉండటానికి, అరుదైన చేపజాతులు అంతరించిపోకుండా ఉండటానికి.. ప్రస్తుతానికి ఇదే చక్కటి మార్గమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. నేస్తాలూ...! ఇప్పటికైతే ఇవీ అందాల రాక్షసి చేప సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని