ఆరేళ్లకే ‘రౌడీ’!

బుడి బుడి అడుగుల వయసులోనే మోడలింగ్‌ చేశాడు. తడబడే అడుగులనే ర్యాంప్‌వాక్‌గా మార్చుకున్నాడు. రైజింగ్‌ స్టార్‌గా గుర్తింపు, ‘రౌడీ మోడల్‌’గా పేరూ వచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం..

Published : 02 Dec 2021 01:29 IST

బుడి బుడి అడుగుల వయసులోనే మోడలింగ్‌ చేశాడు. తడబడే అడుగులనే ర్యాంప్‌వాక్‌గా మార్చుకున్నాడు. రైజింగ్‌ స్టార్‌గా గుర్తింపు, ‘రౌడీ మోడల్‌’గా పేరూ వచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం.. ఆరేళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇంతకీ ఎవరీ బుడత.. ఇతని ఘనత ఏంటో తెలుసుకుందామా!

మిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన రానా. వయసు ఆరేళ్లు. తను మూడేళ్ల వయసు నుంచే మోడలింగ్‌ చేస్తున్నాడు. నిజానికి మోడలింగ్‌ అనేది ఓ రంగుల లోకం. అందులో రాణిస్తే తిరుగుండదు. కానీ అది అనుకున్నంత తేలిక కాదు. చాలా సవాళ్లతో కూడుకున్నది. అంత కష్టమైన రంగాన్ని ఎంచుకుని రానా అద్భుతంగా రాణిస్తున్నాడు.

మూడేళ్లక్రితం..

రానా తండ్రి శివకుమార్‌ ఓ టెక్స్‌టైల్‌ వ్యాపారి. తల్లి గోమతి ఓ బ్యూటీ సెలూన్‌ యజమాని. మూడేళ్ల క్రితం వీళ్ల బ్యూటీ సెలూన్‌కు ఓ ఫ్యాషన్‌ ఏజెంట్‌ వచ్చాడు. అక్కడ రానాను చూసి ఆ ఏజెంట్‌ ఫిదా అయిపోయాడు. రానాది ఫొటోజెనిక్‌ ఫేస్‌ అని గుర్తించాడు. వాళ్లు నిర్వహించే మోడలింగ్‌ షోకు రానాను పంపమని కోరాడు. బుడతడి తల్లిదండ్రులు ముందు కాస్త ఆలోచించారు. ఒకసారి ప్రయత్నిద్దాంలే అని తీసుకెళ్లారు. కానీ అదే నేడు మన రానాను సెలెబ్రిటీని చేసింది.

అవార్డులే అవార్డులు..

కోయంబత్తూర్‌లో నిర్వహించిన మోడలింగ్‌ షోలో తొలిసారిగా పాల్గొన్న రానా.. అక్కడి నుంచి అస్సలు వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు మోడలింగ్‌లో 14 అవార్డులు, ఓ మెడల్‌ను దక్కించుకున్నాడు. జాతీయస్థాయిలో ‘రైజింగ్‌ స్టార్‌’ అనే ట్యాగ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తన లుక్స్‌తో ‘రౌడీ మోడల్‌’గానూ పేరు తెచ్చుకున్నాడు.

చదువుల్లోనూ..

రానా విజయం వెనక అతని తండ్రి ప్రోత్సాహం చాలా ఉంది. ర్యాంప్‌వాక్‌ దగ్గర నుంచి, మోడలింగ్‌ వరకు తనకు తెలిసినవన్నీ ఇంట్లోనే రానాకు నేర్పించాడు. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ జూనియర్‌ ఫ్యాషన్‌ షో’లోనూ ఈ బుడతడు పాల్గొన్నాడు. మోడలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ చదువును అశ్రద్ధ చేయలేదు. కర్రసాము(సిలంబం)లోనూ మన రానాకు ప్రావీణ్యం ఉంది. భవిష్యత్తులో మాత్రం తాను నేవీలో పనిచేస్తా అని చెబుతున్నాడు ఈ బుడత. మరి మన రానాకు మనసారా మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని