13 ఏళ్ల రచయిత్రి

మనమేదన్నా చిన్న కవితనో, కథనో రాస్తే అమ్మానాన్న ఎంతగా మురిసిపోతారో కదా! అయితే ఓ నేస్తం ఏకంగా అయిదు పుస్తకాలు రాసేసింది. తన పుస్తకాలతో ఎంతో మందిలో స్ఫూర్తి రగిలిస్తుంది.

Published : 04 Dec 2021 00:57 IST

మనమేదన్నా చిన్న కవితనో, కథనో రాస్తే అమ్మానాన్న ఎంతగా మురిసిపోతారో కదా! అయితే ఓ నేస్తం ఏకంగా అయిదు పుస్తకాలు రాసేసింది. తన పుస్తకాలతో ఎంతో మందిలో స్ఫూర్తి రగిలిస్తుంది. ఇంతకీ అవేంటి? తనెవరు? ఆ వివరాలన్నీ తెలుసుకునేందుకు చదివేయండి.

నేస్తం అనంతీ మిశ్రా, వయసు 13 ఏళ్లు. ఉండేది దిల్లీలో.

ఆసక్తి వల్లనే..!

అనంతీ చదువులో చురుగ్గా ఉండేది. అంతేకాకుండా ఖాళీ సమయం దొరికితే పేపర్‌ తీసుకుని కవితలు రాస్తూ ఉండేది. తనేది రాసినా.. పెద్ద సాహితీవేత్తలు రాసినట్లు ఉండేది. అది చూసిన అమ్మానాన్న ఆశ్చర్యపోయేవారు. అంతేకాదు తాను చదువుకోవడానికి కథల పుస్తకాలు అడిగేది. తన ఆసక్తి చూసిన వాళ్ల నాన్న తను అడిగిన పుస్తకమల్లా కొనిచ్చేవారు. అలా తను స్కూల్‌నుంచి రాగానే పుస్తకాలు చదవడంలోనే నిమగ్నమయ్యేది.

చదువుల అనంతీ..

అలా చదివీచదివీ కథలు రాయడం మొదలుపెట్టింది. తను రాసిన కథలు  మరుగున పడిపోవడం ఇష్టం లేని అమ్మానాన్న.. వాటిని పుస్తక రూపంలో తెద్దాం అనుకున్నారు. అనంతీ ఆ పుస్తకానికి ‘ట్రెజర్‌ ఆఫ్‌ షార్ట్‌ స్టోరిస్‌’ అనే పేరు పెట్టింది. దాన్ని మార్కెట్‌లోకి విడుదల చెయ్యగా బెస్ట్‌ సెల్లింగ్‌ చిల్డ్రన్‌ బుక్‌గా ర్యాంకు పొందింది. ఇంకేముంది ఇక అనంతీ ఆనందానికి అవధులు లేవు. అదే ఉత్సాహంతో ఆ పుస్తకాన్ని హిందీలో కూడా విడుదల చేసింది. తర్వాత ఇక తన కలాన్ని ఆపలేదు. చదువుకుంటూనే కథలు, కవితలు రాస్తూ నాలుగు పుస్తకాలు విడుదల చేసింది. ఇక తన అయిదో పుస్తకం ‘అమల్గం’ను బాలల దినోత్సవం రోజున విడుదల చేసి అందరితో ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా ‘బుల్లి రచయిత్రి’గా ఎన్నో అవార్డులూ అందుకుంది. తన ఆసక్తి, పట్టుదల, ప్రతిభ చూసినవారంతా అనంతీని శభాష్‌ అంటున్నారు. మరి ఇంత చిన్న వయసులో గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకోవడం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని