ప్రకృతికి ప్రేమతో...

అది 2018వ సంవత్సరం.. అప్పుడు ఆదిత్య ముఖర్జీకి 13 సంవత్సరాలు. పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసు. కానీ మన ఆదిత్యకు ప్రకృతిపై ప్రేమ, దాన్ని పాడు చేస్తున్న ప్లాస్టిక్‌పై ద్వేషం పుట్టింది. ముఖ్యంగా రీసైక్లింగ్‌కు పనికి

Updated : 20 Jan 2022 00:45 IST

అది 2018వ సంవత్సరం.. అప్పుడు ఆదిత్య ముఖర్జీకి 13 సంవత్సరాలు. పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసు. కానీ మన ఆదిత్యకు ప్రకృతిపై ప్రేమ, దాన్ని పాడు చేస్తున్న ప్లాస్టిక్‌పై ద్వేషం పుట్టింది. ముఖ్యంగా రీసైక్లింగ్‌కు పనికి రాని ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలుగుతున్న కీడు మరింత కలిచివేసింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రేరేపించింది.

గురుగావ్‌కు చెందిన ఆదిత్యముఖర్జీ కొన్నాళ్ల క్రితం టీవీ చూస్తున్నాడు. అప్పుడు ముక్కులో స్ట్రా ఇరుకున్న తాబేలు కనిపించింది. అతికష్టం మీద ఓ వ్యక్తి ఆ స్ట్రాను బయటకు తీశాడు. అప్పుడు ఆ తాబేలుకు ప్రాణాపాయం తప్పినా.. దాని ముక్కు నుంచి చాలా రక్తం వచ్చింది. టీవీలో చూసిన ఆ దృశ్యాలు ఆదిత్యను కలచివేశాయి. అప్పటికప్పుడు ప్లాస్టిక్‌కు.. ముఖ్యంగా రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరాడాలనుకున్నాడు.

స్ట్రాలు ఎక్‌స్ట్రానే! 

మనిషి కనిపెట్టిన వాటిలో స్ట్రాలు అత్యంత చెత్త ఆవిష్కరణ అంటాడు మన ఆదిత్య. వీటివల్ల మనుషులకు సౌకర్యంగా ఉంటుందేమో కానీ.. ప్రకృతికి మాత్రం తీరని నష్టం జరుగుతుందంటాడు. అందుకే 2018 నుంచి ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు.

ఇంటి ఇంటికి వెళ్లి..

ఆదిత్య ముందు తన పోరాటాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాడు. ఇంటింటికీ తిరిగాడు. ప్రతి ఇంటి తలుపూ తట్టాడు. ప్రజలందరికీ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పు గురించి అవగాహన కల్పించాడు. తర్వాత స్వచ్ఛంద సంస్థలు తోడయ్యాయి. పెద్దపెద్ద హోటళ్లవారికీ అవగాహన కల్పించాడు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ వాడకం తగ్గించమని సూచించాడు. ప్రత్యామ్నాయ మార్గాలూ చెప్పాడు. వాళ్లూ చేయూతనిచ్చారు. ఇలా రెండు సంవత్సరాల్లో కొన్ని లక్షల ప్లాస్టిక్‌ వస్తువులు వ్యర్థాలుగా మారకుండా అడ్డుకున్నాడు.

గుర్తింపు దక్కింది...

2019లో జరిగిన ‘యూఎన్‌ యూత్‌ క్లైమేట్‌ సమ్మిట్‌’లో ఆదిత్య పాల్గొన్నాడు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడానికి ఉన్న పలు మార్గాలు సూచించాడు. అమెరికా వేదికగా నడుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ పర్యావరణంపై ఆదిత్య పడుతున్న తపనను గుర్తించి సన్మానించింది. భవిష్యత్తులో తాను మరింతగా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని, ప్రజల్లో మరింత అవగాహన కలిగిస్తానని ఆదిత్య ముఖర్జీ చెబుతున్నాడు. మరి ఈ అన్నయ్య ఆశయం నెరవేరాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని