భలే చిరుత.. ఈ బుడత!
అయిదేళ్ల బుడతడు అన్ని విద్యల్లో ఆరితేరాడు. తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎన్నో బహుమతులూ పురస్కారాలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ బుడతడెవరు? ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం రండి..
ఆ నేస్తం పేరు జై ఆనందపద్మనాభన్. వయసు అయిదేళ్లు. స్వస్థలం తమిళనాడులోని శివగంగ.
అన్నీ ముందే తెలుసుకుంటాడు..!
నేస్తం చాలా చురుకు. చిరుతలా అన్నింటిలో చురుగ్గా ఉంటూ తనకంటూ గుర్తింపు సాధించేశాడు. సాధారణంగా ఈ వయసుకు పార్క్‌కు తీసుకువెళితే ఏం చేస్తారు. జంతువులను చూసి, ఆనందిస్తూ కేరింతలు కొడతారు. లేదా భయపడి దాక్కుంటారు. కదా! కానీ ఈ బుడతడిని కదిపితే ఓ పాఠం చెప్పేస్తాడు. అర్థం కాలేదా? పిల్లల పార్క్‌కు తీసుకువెళితే.. పార్క్ గురించి, అక్కడ పనిచేసే సహాయకుల గురించి చెబుతాడు. తను అలా చెబుతుంటే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే! ఎందుకంటే ఎక్కడకైనా తీసుకు వెళ్లేముందు దాని గురించి పూర్తి వివరాలు అడిగి, అవగాహన వచ్చాకే బయలుదేరతాడట. అలా అన్ని విషయాలు ముందుగానే తెలుసుకుంటాడు.
కథలంటే ఇష్టం..
మనకు కంప్యూటర్ ఇస్తే ఆడుకోవడమో.. లేదా బొమ్మలు చూడ్డమో చేస్తాం. కానీ ఈ నేస్తం మాత్రం అందులోని కీబోర్డ్ షార్ట్కట్లు తనకు తానుగా తెలుసుకుంటాడు. వాటిని గుర్తుపెట్టుకుని మరీ చెబుతాడు. ఖాళీ సమయం దొరికితే చాలు కథల పుస్తకాలు ముందేసుకుని చదువుతాడు. అంతేకాదండోయ్ ఫోన్లో పియానో కూడా వాయిస్తాడు. ఇలా ప్రతి దాంట్లోనూ ప్రతిభను కనబరుస్తున్నాడని ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కూడా తన పేరును నమోదు చేశారు. నిజంగా గ్రేట్ కదూ! మరింకేం మన నేస్తాన్ని మీరూ అభినందించేయండి.
Advertisement