మన‘శారా’ చేయూత!

మనకు ఏ కళలోనైనా ప్రావీణ్యం ఉంటే ఏం చేస్తాం? అందులో గొప్ప పేరు తెచ్చుకునేందుకు పాటుపడతాం. మనకోసం మనం శ్రమిస్తాం.. కదా! కానీ ఓ నేస్తం ఇతరుల కోసం కృషి చేస్తోంది. తన ప్రతిభతో ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆ నేస్తమెవరో ఏం చేస్తుందో తెలుసుకుందామా!

Updated : 25 Jan 2022 02:16 IST

మనకు ఏ కళలోనైనా ప్రావీణ్యం ఉంటే ఏం చేస్తాం? అందులో గొప్ప పేరు తెచ్చుకునేందుకు పాటుపడతాం. మనకోసం మనం శ్రమిస్తాం.. కదా! కానీ ఓ నేస్తం ఇతరుల కోసం కృషి చేస్తోంది. తన ప్రతిభతో ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆ నేస్తమెవరో ఏం చేస్తుందో తెలుసుకుందామా!

నేస్తం పేరు శారా పరిగెల. వయసు పదిహేడేళ్లు. కాలిఫోర్నియాకు చెందిన భారతీయ అమెరికన్‌ హైస్కూల్‌ విద్యార్థి. శారాకు సంగీతమంటే చాలా ఇష్టం. తన ఆసక్తిని గ్రహించిన అమ్మానాన్న సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అలా చిన్నప్పట్నుంచే వయోలిన్‌, పియానోలో శిక్షణ తీసుకుంది. అందులో ప్రావీణ్యం సంపాదించి ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ.. బహుమతులూ, ప్రశంసలూ అందుకుంటోంది.

చలించిపోయింది..

కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో శారా చాలామంది సమస్యలను కళ్లారా చూసింది. అమెరికాలో తన చుట్టూ ఉన్న నిరుపేద కుటుంబాల వారు పడే కష్టాలను చూసి చలించిపోయింది. వాళ్లకోసం ఏదైనా సాయం చేయాలనుకుంది. అయితే డబ్బు రూపేణా ఇస్తే ఆ రోజుతో అయిపోతుంది. మరి మిగిలిన రోజులు ఎలా గడుస్తాయి? ఇదే ఆలోచించింది శారా.

ఆలోచనే.. ఆచరణగా..

బాగా ఆలోచించిన శారాకు మెరుపులాంటి ఓ ఉపాయం తట్టింది. నిరుపేద పిల్లలకు ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా తన స్నేహితురాలితో కలిసి ‘స్ట్రైక్‌ ఎ కార్డ్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఇందుకు అమ్మానాన్న, ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం అందించారు. అనాథ శరణాలయాలు, నిరాశ్రయుల ఆశ్రమాలు, నిధులు లేని పాఠశాలల్ని సంప్రదించి, అన్నయ్య సామ్‌తో కలిసి అక్కడ సంగీత ప్రదర్శనలు ఇస్తుంది. వాళ్లలో ఆసక్తిని రేకెత్తించి.. ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుంది. చిన్న వయసులోనే శారా చేస్తున్న సేవకు మెచ్చి.. చాలామంది దాతలు ఉచితంగా సంగీత వాయిద్యాలను అందించేందుకు ముందుకొచ్చారు. అలా అనాథ పిల్లల్లో, నిరుపేద పిల్లల్లో ఆనందాన్ని నింపుతోంది శారా. ఇంత చిన్నవయసులో ఎంత గొప్ప పనిచేస్తుందో కదా! నిజంగా శారా గ్రేట్‌ కదూ నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని