కుంచె పడితే.. కాసుల వర్షమే!

‘ఆఁ.. ఏముందిలే.. చేయి తిరిగిన కళాకారుడు ఎవరు కుంచెపట్టినా.. ఆ చిత్రాలకు మంచి ధరే పలుకుతుంది’ అని తేలిగ్గా తీసిపారేయకండి ఫ్రెండ్స్‌. ఎందుకంటే ఇక్కడ చిత్రాలు వేసేది మనలాంటి మనిషి

Published : 28 Jan 2022 00:54 IST

‘ఆఁ.. ఏముందిలే.. చేయి తిరిగిన కళాకారుడు ఎవరు కుంచెపట్టినా.. ఆ చిత్రాలకు మంచి ధరే పలుకుతుంది’ అని తేలిగ్గా తీసిపారేయకండి ఫ్రెండ్స్‌. ఎందుకంటే ఇక్కడ చిత్రాలు వేసేది మనలాంటి మనిషి కాదు.. ఓ పంది! అది చిత్రాలు గీయడమే విచిత్రం అనుకుంటే.. వాటికి ఏకంగా లక్షలరూపాయల్లో ధర పలుకుతోంది. మరి విశేషాలేంటో తెలుసుకుందామా!

నుగులు, చింపాజీల వంటి జంతువులు గతంలో పెయింటింగ్‌ వేసినట్లు మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్‌! కానీ ఇప్పుడు పిగ్‌కాసో అనే పంది బ్రష్‌తో హల్‌చల్‌ చేస్తోంది. అదీ మామూలుగా కాదు. అది గీసిన చిత్రాలు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి.

2016లో ఏం జరిగిందంటే..

దక్షిణాఫ్రికాలో 2016 ప్రాంతంలో ఈ పిగ్‌కాసో ప్రమాదంలో ఉంటే దీన్ని జాన్నే లెఫ్‌సన్‌ అనే ఆవిడ కాపాడారు. అప్పుడు తనను కాపాడినందుకు.. ఇప్పుడు అది తన యజమాని రుణం తీర్చుకుంటోంది! తన పెయింటింగ్స్‌ ద్వారా ఆమెకు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ పంది గీసిన చిత్రాలను అమ్మడానికి ఏకంగా సొంత వెబ్‌సైటే ఉంది. ఇలా వచ్చిన దాంట్లో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకూ, ముఖ్యంగా జంతు సంరక్షణకూ ఉపయోగిస్తున్నారు.  

అలా మొదలైంది..    

ఈ పందిని కాపాడి తీసుకొచ్చాక.. ఇది ఆడుకునేందుకు ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, పెయింటింగ్‌ బ్రష్‌లను లెఫ్‌సన్‌ ఇచ్చారు. ఈ పిగ్‌కాసో.. వాటన్నింటినీ పాడు చేసేది.. కానీ బ్రష్‌లను మాత్రం జాగ్రత్తగా చూసుకునేది. అప్పుడు సరదాగా దీని యజమాని దీనికి పెయింటింగ్‌ వేయడం ఎలాగో చెప్పింది. ఇక అంతే.. అప్పటి నుంచి చిత్రాలు గీస్తూనే ఉంది. కేవలం చిత్రాలు గీయడమే కాదు నేస్తాలూ.. చివర్లో మూలన ఏకంగా తన సంతకం కూడా పెడుతోంది ఈ పంది.

అయిదేళ్లుగా...

ఈ పిగ్‌కాసో గత అయిదేళ్ల కాలంలో ఏకంగా 400 వరకు చిత్రాలను వేసిందట. వీటిలో ఓ చిత్రం ఇటీవల ఓ రికార్డునూ సొంతం చేసుకుంది. ఏకంగా 20,17,530 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇంతకు ముందు వరకు ఈ రికార్డు కాంగో అనే చింపాజీకి ఉండేది. అది గీసిన చిత్రం గతంలో 14,10,969 రూపాయలకు అమ్ముడుపోయింది. నేస్తాలూ.. ప్రస్తుతానికి ఇవీ ఈ పిగ్‌కాసో విశేషాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని