ఆట.. పతకాల వేట..!

మనలో ప్రతిభ ఉండాలే కానీ దానికి వయసుతో ప్రమేయం లేదని నిరూపిస్తోంది ఓ నేస్తం. చిన్నతనం నుంచి షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతూ..

Published : 29 Jan 2022 00:46 IST

మనలో ప్రతిభ ఉండాలే కానీ దానికి వయసుతో ప్రమేయం లేదని నిరూపిస్తోంది ఓ నేస్తం. చిన్నతనం నుంచి షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతూ.. ఆ మార్గాన్ని తన జీవన గమ్యంగా ఎంచుకుంది. ఆటలో ఎదుగుతూ ఎన్నో పతకాలు సాధిస్తోంది. తాజాగా అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. తనెవరో ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి..

నేస్తం ఎవరో కాదు... రాజమహేంద్ర వరానికి చెందిన దుర్గా ఇషా. వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. అమ్మ రాధ, నాన్న రాజారెడ్డి.  

ఇషాకు చిన్న తనం నుంచే షటిల్‌ బ్యాట్మింటన్‌ అంటే చాలా ఇష్టమట. ఏడేళ్లున్నప్పటి నుంచే అన్నయ్య జయసమీర్‌తో పాటు ఆటడం మొదలు పెట్టింది. ఇషా ఆటతీరు చూసిన నాన్న.. ఇషాను  ప్రోత్సహించారు. ఇషా కూడా చక్కగా నేర్చుకుని నైపుణ్యం సాధించి, జిల్లా స్థాయిలో  విజేతగా నిలిచేది. దాంతో ఇషా తండ్రి, తనకు మంచి తర్ఫీదు ఇప్పించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2018లో పుల్లెల గోపిచంద్‌ అకాడమీలో చేర్పించారు.

అంతర్జాతీయ స్థాయికి..
గోపిచంద్‌ శిక్షణలో మెరుగులు దిద్దుకుంటూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనటం మొదలు పెట్టింది ఇషా. 2019లో అండర్‌ 13 విభాగంలో రాష్ట్రస్థాయిలో ఫైనల్‌ వరకూ వచ్చినా త్రుటిలో స్వర్ణం కోల్పోయి రజతం సాధించింది. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో అదే ఏడాది అండర్‌ 13 విభాగంలో రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచి స్వర్ణం సాధించింది. అంతేకాకుండా పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ జాతీయ స్థాయి బ్యాండ్మింటన్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించింది.

2022 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకూ హరియాణాలో జరిగిన అండర్‌-15 డబుల్స్‌ పోటీల్లో రజతం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం సాధించింది. ఈ విజయాలతో ఇషా త్వరలో డచ్‌, జర్మనీలో జరగనున్న అంతర్జాతీయ బ్యాట్మింటన్‌ పోటీలకు అర్హత సాధించింది. అంతేనా! ఈ విభాగంలో జాతీయ స్థాయిలో రెండోస్థానంలో నిలిచింది. ఇలా ఇప్పటి వరకూ అన్ని విభాగాల్లో 50 వరకూ పతకాలు సాధించింది.  

చదువులోనూ మేటి!
ఆటతో పాటూ చదువునూ అశ్రద్ధ చేయలేదు. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తుంది. ఉదయం అంతా సాధన చేస్తుంది. తర్వాత ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతుంది. మళ్లీ సాయంత్రం సాధన చేస్తుంది. ఇలా రోజులో ఆరు నుంచి ఏడు గంటల సమయం సాధన కోసం కేటాయిస్తుంది. మిగిలిన సమయం చదువుకుంటుంది. ఇప్పటి వరకూ అన్ని పరీక్షల్లో ఏ గ్రేడ్‌ సాధిస్తోంది. ‘ఆటపై ఏకాగ్రత ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి, పాఠాలన్నీ ఒక్కసారి చదివితే చాలు గుర్తుండిపోతాయి. రానున్న అంతర్జాతీయ పోటీల్లో గెలిచి.. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని విజేతగా నిలవడమే నా లక్ష్యం’ అని దుర్గా ఇషా చెబుతోంది. మరి మన నేస్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!  

-ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని