నడి ఎడారిలో బడి!

చుట్టూ ఇసుక కుప్పలు. నడినెత్తిన భగ్గుమనే సూర్యుడు. కనుచూపు మేర కనిపించని నీరు. అక్కడక్కడ ఒయాసిస్సులు! ఏ ఎడారిలోనైనా దాదాపు ఇదే పరిస్థితి. కానీ థార్‌ ఎడారిలో మాత్రం ఒయాసిస్సులతో పాటు ఆశీస్సులిచ్చే ఉషస్సు కూడా ఉంది! అదే...

Updated : 18 Apr 2022 05:56 IST

చుట్టూ ఇసుక కుప్పలు. నడినెత్తిన భగ్గుమనే సూర్యుడు. కనుచూపు మేర కనిపించని నీరు. అక్కడక్కడ ఒయాసిస్సులు! ఏ ఎడారిలోనైనా దాదాపు ఇదే పరిస్థితి. కానీ థార్‌ ఎడారిలో మాత్రం ఒయాసిస్సులతో పాటు ఆశీస్సులిచ్చే ఉషస్సు కూడా ఉంది! అదే ఓ బడి..!

‘ఏంటి.. థార్‌ ఎడారి మధ్యలో బడి ఉందా? అయ్యబాబోయ్‌.. ఇంకా ఏమైనా ఉందా? ఆ ఎండ వేడికి విద్యార్థులు ఎలా తట్టుకుంటున్నారు. మొత్తం స్కూలంతా ఏసీ పెట్టి ఉంటారులే’ అనుకుంటున్నారు కదూ! ఆ భవనం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఏసీ కూడా లేదు. నిజానికి ఫ్యాన్లూ సరిగా వాడరు అక్కడ. అయినా ఆ బడి భవనం చల్లగా ఉంటుంది. ఎలా అంటే..

ఉష్ణోగ్రత జీ 50 డిగ్రీలు

రాజస్థాన్‌ రాష్ట్రంలో జైసల్మేర్‌కు సమీపంలోనే కనోయ్‌ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎడారి మధ్యలో ‘రాజ్‌కుమారి రత్నావతి గర్ల్స్‌’ స్కూలు ఉంది. నిజానికి ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ దాదాపు 50 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. ఇక్కడ ఆడపిల్లల్లో అక్షరాస్యత పెంచడం కోసం మైఖేల్‌ డాబ్‌ అనే సామాజిక కార్యకర్త ఈ స్కూలు నిర్మాణానికి ముందుకు వచ్చారు. అమెరికాకు చెందిన రూపశిల్పి (ఆర్కిటెక్ట్‌) డానియా కెలోగ్‌ ఈ స్కూలును డిజైన్‌ చేశాడు.

కోడి గుడ్డు ఆకారంలో...

ఎడారిలో ఎండవేడిమి ప్రభావాన్ని తగ్గించాలంటే నిర్మాణమూ ప్రత్యేకంగా ఉండాలి. అందుకే ఈ స్కూలును కోడిగుడ్డు ఆకారంలో ఎల్లో శాండ్‌ స్టోన్‌తో నిర్మించారు. గాలి ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు ఉండటంతో అసలు ఏసీల అవసరమే లేదు. తరగతి గదుల్లోనే కాదు. బడి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోనూ చల్లగా ఉండేలా డిజైన్‌ చేశారు. పై నుంచి వేడి కిందున్న తరగతి గదుల్లోకి వెళ్లకుండా పై కప్పు మీద టైల్స్‌ ముక్కలతో గచ్చు వేశారు. దీని వల్ల బయట ఎంత ఎండ మండుతున్నా.. ఈ బడిలో మాత్రం వాతావరణం చల్లగానే ఉంటుంది.  

400 మంది విద్యార్థినులు..

ఈ బడిలో దాదాపు 400 మంది విద్యార్థినులు కిండర్‌ గార్టెన్‌ నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. ఇంకా ఈ స్కూలు ఆవరణలో టెక్ట్స్‌టైల్‌ మ్యూజియం కూడా ఉంది. అన్నట్లు ఈ బడికి కరెంటుబిల్లు కూడా రాదు నేస్తాలూ. ఎందుకంటే భవనం మీద సౌరఫలకాలు కూడా అమర్చారు. ఫ్రెండ్స్‌.. ఇవీ ‘నడి ఎడారిలో బడి’ విశేషాలు. మొత్తానికి అది భలే బడి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు