తన్వీ.. ఓ ‘టెక్‌’ కేర్‌టేకర్‌!

తన్వీ.. వృద్ధులకు సాయం చేస్తోంది. తను ఓ ‘టెక్‌’ కేర్‌టేకర్‌గా సేవలు అందిస్తోంది. అంటే సీనియర్‌ సిటిజన్లకు టెక్నాలజీని పరిచయం చేస్తోంది. వాళ్ల పనులు వాళ్లు చేసుకునేలా శిక్షణ ఇస్తోంది. దీని కోసం స్టార్టప్‌ని ప్రారంభించింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

Published : 15 May 2022 02:13 IST

తన్వీ.. వృద్ధులకు సాయం చేస్తోంది. తను ఓ ‘టెక్‌’ కేర్‌టేకర్‌గా సేవలు అందిస్తోంది. అంటే సీనియర్‌ సిటిజన్లకు టెక్నాలజీని పరిచయం చేస్తోంది. వాళ్ల పనులు వాళ్లు చేసుకునేలా శిక్షణ ఇస్తోంది. దీని కోసం స్టార్టప్‌ని ప్రారంభించింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

ఇప్పుడంతా టెక్నాలజీమయం. మునివేళ్లతోనే పనులన్నీ జరిగిపోతున్నాయి. యువత, మధ్య వయస్కులు టెక్నాలజీలో దూసుకుపోతున్నారు. కానీ పాపం.. కొందరు వృద్ధులే ఎలా ఉపయోగించాలో తెలియక సతమతమవుతున్నారు. దీంతో వాళ్లు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయడం, ఆన్‌లైన్‌లో వస్తువులు, ఆహార పదార్థాలు ఆర్డర్‌ ఇవ్వడం, కరెంట్‌, గ్యాస్‌ బిల్లులు కట్టడంలాంటివి చేయలేకపోతున్నారు. ఉరుకులు, పరుగుల ప్రపంచంలో వారికి ఓపిగ్గా నేర్పించే వారూ కరవవుతున్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపింది చెన్నైలో తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల తన్వి అరవింద్‌.

2019లోనే ప్రారంభం..

ఈ చిన్నారి 2019లోనేTechEdEn  అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. దీనికి ప్రేరణ తన్వి వాళ్ల తాతాఅవ్వే. వాళ్లిద్దరూ బెంగళూరులో ఉంటారు. అక్కడికి వెళ్లినప్పుడల్లా వాళ్లు టెక్నాలజీని ఉపయోగించలేక ఇబ్బందులు పడడం చూసింది. వారికి రెండు స్మార్ట్‌ ఫోన్లు, రెండు ఐప్యాడ్‌లు, ఒక ల్యాప్‌టాప్‌ ఉన్నాయి. తన్వి వాళ్లకు ప్రతిసారి కొత్త విషయాలను నేర్పేది. నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. నేడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ సేవల ప్రాధాన్యం పెరిగింది. తన్వి వల్ల వాళ్లు  టెక్నాలజీ పరిజ్ఞానం సొంతం చేసుకున్నారు.

ఒక్క ఆలోచన మార్చేసింది...

తన తాత, అవ్వల్లానే చాలా మంది ఉపయోగించడం ఎలాగో తెలియక టెక్నాలజీకి దూరంగా ఉన్నారని తెలుసుకుంది. వాళ్లకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలనుకుంది. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే... TechEdEn అనే స్టార్టప్‌. ఆన్‌లైన్‌లో క్యాబ్‌ బుక్‌ చేయడం, ఆహారం ఆర్డర్‌ పెట్టుకోవడం, రైలు, బస్సు, విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకోవడం, గూగుల్‌ మ్యాప్స్‌ ఉపయోగించడం, ఇన్‌స్టా, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను వాడటం, ప్రింట్‌ తీయడం, ఇంటర్‌నెట్‌ వాడటం, యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం వంటి ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇస్తోంది. ఇందుకు గాను ఒక గంట శిక్షణకు 500 రూపాయలు తీసుకుంటోంది తన్వి. బృందంగా వస్తే నలుగురికి 300 రూపాయలు తీసుకుంటోంది. తన్వి తన సోదరి, స్నేహితుడి సాయంతో మొదటి ఏడాదిలోనే రూ.28,400 సంపాదించింది.

ఓ వీడియో చూసి.. 

తన్వి ఓసారి 13ఏళ్లలోనే డెట్రాయిడ్‌ ప్రాంతానికి చెందిన విజయవంతమైన వ్యాపారవేత్త వీడియోను చూసింది. ఆ బాలుణ్ని ఆదర్శంగా తీసుకున్న తన్వికి వ్యాపారం చేయాలనే ఆలోచన తట్టింది. అలా ముందుగా 20 వారాలు యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అకాడమీ (వైఈఏ) ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ వ్యాపారానికి సంబంధించి పలు అంశాలు నేర్చుకుంది. ఆ తర్వాతే సీనియర్‌ సిటిజన్ల కోసంTechEdEn అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఎంతైనా మన తన్వి గ్రేట్‌ కదూ!

- న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని