మన మీనాక్షే నంబర్‌ వన్‌!

ఆ చిట్టి చేతులకు చదరంగం అంటే ప్రాణం. ఆ చిన్ని వేళ్లకు పావులు కదపడం అంటే ఇష్టం. ఆ చిన్నారి ఎత్తు వేస్తే అవతలవాళ్లు చిత్తు కావాల్సిందే! పతకం వరించాల్సిందే! అందుకే అండర్‌-11 విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Published : 22 May 2022 01:35 IST

ఆ చిట్టి చేతులకు చదరంగం అంటే ప్రాణం. ఆ చిన్ని వేళ్లకు పావులు కదపడం అంటే ఇష్టం. ఆ చిన్నారి ఎత్తు వేస్తే అవతలవాళ్లు చిత్తు కావాల్సిందే! పతకం వరించాల్సిందే! అందుకే అండర్‌-11 విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. మనదేశ కీర్తిని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే..

చిచ్చరపిడుగే... విశాఖపట్నానికి చెందిన కోలగట్ల అలనమీనాక్షి. ఇటీవల ఫిడే విడుదల చేసిన ర్యాంకింగ్‌లో అండర్‌- 11 విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. మీనాక్షి అయిదేళ్ల ప్రాయంలో విపరీతమైన అల్లరి చేసేది. చిన్నారిని నియంత్రించేందుకు తల్లి చదరంగం వైపు నడిపించింది. తొలుత బీచ్‌ రోడ్డులో వేసవి శిక్షణ శిబిరానికి పంపింది. అక్కడ చిన్నారి ఆటతీరును గమనించిన కోచ్‌ చెస్‌లో మీనాక్షి చక్కగా రాణించగలదని చెప్పారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు అపర్ణ-మధు.. చిన్నారిపై మరింత దృష్టి పెట్టారు. లోపాలను సరిచేస్తూ.. దేశ, విదేశాల్లో ఎక్కడ టోర్నీలు జరిగినా తీసుకెళ్తూ.. ప్రోత్సహించారు. వారి చేయూతే ప్రస్తుతం మీనాక్షి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించేందుకు దోహదపడింది.

అంతర్జాతీయ ఖ్యాతి

2019లో ఔరంగాబాద్‌లో జరిగిన అండర్‌-8 స్కూల్‌ నేషనల్స్‌లో రజత పతకం గెలుపొందింది. అదే ఏడాది డిసెంబరులో డబ్ల్యూసీఏం (విమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌) నార్మ్‌ సాధించింది. 2018లో శ్రీలంకలో జరిగిన ఏషియన్‌ స్కూల్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో, 2019లో ఏషియన్‌ యూత్‌ పోటీల్లో ర్యాపిడ్‌లో, 2021లో ఆన్‌లైన్‌ అండర్‌-10 జాతీయస్థాయి చదరంగం పోటీల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. అదే ఏడాది చైనాలో జరిగిన వరల్డ్‌ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో 15వ స్థానంలో నిలిచింది. దిల్లీలో జరిగిన వెస్ట్రన్‌ ఏషియా ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-8లో బ్లిట్జ్‌, ర్యాపిడ్‌ విభాగాల్లో రెండు స్వర్ణాలు, క్లాసిక్‌ విభాగంలో కాంస్యం గెలుపొందింది. భవిష్యత్తులో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సాధించి ప్రపంచస్థాయి పోటీల్లో మన దేశానికి స్వర్ణ పతకం అందించడమే తన ఆశయం అని చెబుతోంది. మరి మన మీనాక్షికి మనందరం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

- లెంక వెంకటరమణ, న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని