చిట్టి చేతులు.. గట్టి చేతలు!

మూడేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు.. బుడిబుడి అడుగులు వేస్తారు. వచ్చీరాని బుజ్జిబుజ్జి మాటలతో అలరిస్తారు. కానీ ఓ చిన్నారి మాత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకూ ఎవరా చిన్నారి? ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

Published : 23 May 2022 01:03 IST

మూడేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు.. బుడిబుడి అడుగులు వేస్తారు. వచ్చీరాని బుజ్జిబుజ్జి మాటలతో అలరిస్తారు. కానీ ఓ చిన్నారి మాత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకూ ఎవరా చిన్నారి? ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన హిమబిందు, అమరనాథ్‌ దంపతుల కుమార్తె వేద ఇవాంజిల్‌(3). అయిదు నెలల వయసు నుంచే చాలా చురుగ్గా ఉండేది! పండ్లు, కూరగాయలు, పువ్వులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులతో పాటు సముద్రజీవులు, మానవ శరీర భాగాల ఫ్లాష్‌కార్డులతో చిన్నారికి వీరు శిక్షణ ఇచ్చారు.

తేలిగ్గా నేర్చుకుంది..

పద్నాలుగునెలల వయసు వచ్చేసరికి ఆ బాలిక అన్నింటినీ ఎంతో సులువుగా గుర్తించేయగలిగింది. అంతే కాకుండా వాటి పేర్లనూ చెప్పగలిగింది. అలా అన్నింటినీ గుర్తించడం ద్వారా 2021 అక్టోబరు నెలలో ‘ఇండియాస్‌ యంగెస్ట్‌ టాలెంటెడ్‌ గర్ల్‌’గా గుర్తింపు పొందింది. ‘ఓఎంజీ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ప్రశంసాపత్రంతో పాటు పతకం ఇచ్చారు.

రెండేళ్లలోనే....

రెండేళ్ల వయసులో కంప్యూటర్‌, శరీర భాగాలు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, వివిధ దేశాల జాతీయ జెండాలను గుర్తించడం మొదలు పెట్టింది. ఇంకా 25 దేశాల జెండాలు, గ్రహాలు, చిన్న కీటకాలనూ గుర్తించేది. వీటన్నింటినీ చిన్నారి తల్లిదండ్రులు ‘కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థకు లైవ్‌ వీడియో పంపారు. వారు వేద ప్రతిభను గుర్తించి 2021 నవంబరులో ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు.

బొమ్మలూ గీస్తుంది...

అంతేకాదండోయ్‌... ఈ పాపకు డ్రాయింగ్‌, పెయింటింగ్‌ అంటే చాలా ఆసక్తి. గ్రీటింగ్‌ కార్డులు తయారు చేయడంలో కూడా దిట్ట. ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా బాలిక ప్రతిభ పరీక్షించడానికి తల్లిదండ్రులు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’కు దరఖాస్తు చేశారు. జాతీయ పతాకాలు, పక్షుల పేర్లను గుర్తించడంతో పాటు వారు అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పేసింది. చిరుధాన్యాలతో జాతీయ పతాకం, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను ఇసుకతో తయారు చేసింది. కూరగాయల పెయింటింగ్‌ వేయడంతో నిర్వాహకులు ఈనెల 16న ప్రశంసాపత్రాన్ని అందించారు. మూడేళ్లకే ఇలా అవార్డులు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతూ.. అభినందిస్తున్నారు. మన వేద భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని మీరూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి మరి.

- కె.ఎస్‌.మణి, న్యూస్‌టుడే, పలమనేరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని