నేతాజీ కీర్తి.. చాటాలని ఆ స్ఫూర్తి..

హాయ్‌ నేస్తాలూ.. స్వాతంత్య్ర సమరయోధుల గురించి పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. టీవీల్లోనూ చాలానే చూసే ఉంటారు. వారి జయంతులు, వర్ధంతుల సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక

Published : 25 May 2022 00:04 IST

హాయ్‌ నేస్తాలూ.. స్వాతంత్య్ర సమరయోధుల గురించి పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. టీవీల్లోనూ చాలానే చూసే ఉంటారు. వారి జయంతులు, వర్ధంతుల సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరై.. అతిథుల ప్రసంగాలను శ్రద్ధగా వినే ఉంటారు. అందుకు భిన్నంగా, ఓ బాలుడు నేతాజీ స్ఫూర్తిని దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనుకున్నాడు. అందుకు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి మరి.

దిల్లీకి చెందిన ఆరవ్‌ భరద్వాజ్‌కు ప్రస్తుతం పదేళ్లు. ఆరో తరగతి చదువుతున్న అతడికి స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంటే చాలా అభిమానం. దేశం కోసం ఆయన చేసిన సేవలకు నివాళిగా.. ఆ స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకు దాదాపు 2600 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రను ఇటీవలే పూర్తి చేశాడు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా గత ఏప్రిల్‌ 14న ప్రారంభించిన యాత్ర.. నెల రోజుల పాటు దాదాపు ఎనిమిది రాష్ట్రాల మీదుగా సాగించాడీ నేస్తం. దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించేందుకు మణిపూర్‌లో నేతాజీ ప్రారంభించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ) వేదిక వద్దే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ బాలుడి సైకిల్‌ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు.

తాతయ్య చెప్పిన కథలే..
రెండేళ్ల వయసు నుంచే తన తాతయ్య.. ప్రతిరోజూ స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఆరవ్‌కు చెప్పేవారట. అంతేకాదు.. బ్రిటిష్‌ పాలకుల నుంచి భారతీయుల విముక్తి కోసం సాగిన పోరుకు సంబంధించిన బోలెడు పుస్తకాలూ, పత్రికలూ కూడా ఇచ్చారట. అవి చదివిన తర్వాత.. దేశం కోసం తన వంతుగా ఏదైనా చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడట. అన్నింటికన్నా ప్రజల కోసం నేతాజీ చేసిన వీరోచిత పోరాటం తనలో స్ఫూర్తిని కలిగించిందని ఆరవ్‌ చెబుతున్నాడు.

ఆర్మీలో చేరాలని..
తన సైకిల్‌ యాత్ర గురించి వృత్తిరీత్యా వైద్యులైన తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ సరేనన్నారట. కొడుకుతోపాటు తండ్రి కూడా పాల్గొన్న ఈ యాత్ర.. ఇటీవల దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద ముగిసింది. భవిష్యత్తులో ఆర్మీలో చేరి, దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. ఇప్పటి పిల్లలంతా సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటుంటే.. ఆరవ్‌ మాత్రం పోరాట యోధుల స్ఫూర్తిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నిజంగానే ఈ నేస్తం గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని