యోగా.. మనకూ మంచిదేగా!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా... యోగా చేస్తే ఇంకా బాగుంటారు తెలుసా! ఇప్పుడీ యోగా గురించి ఎందుకంటే.. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

Updated : 21 Jun 2022 00:33 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా... యోగా చేస్తే ఇంకా బాగుంటారు తెలుసా! ఇప్పుడీ యోగా గురించి ఎందుకంటే.. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసమూ అలవడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనలో ఎక్కువగా కనిపించే యాంగ్జైటీని తగ్గిస్తుంది. పరీక్షల వల్ల వచ్చే ఒత్తిడిని నియంత్రణలో ఉంచుతుంది. మన శరీరంలో హార్మోన్ల సమతౌల్యం బాగుంటుంది.

మానసిక ప్రశాంతతనిస్తుంది...

క్రమం తప్పకుండా చేసే యోగా భావోద్వేగాలను నియంత్రించుకునేలా చేస్తుంది. కోపం, ఆందోళన, ఒత్తిడి, చికాకు, గందరగోళాన్ని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం..

యోగా చేసేవాళ్లు తక్కువగా జబ్బు పడతారు. వారిలో వ్యాధినిరోధక శక్తి ఉత్తేజితమై ఉంటుంది. దగ్గులు, జలుబులు, జ్వరాలు, తలనొప్పులు ఇలా మనల్ని తరుచుగా వేధించే జబ్బులు అంత తేలిగ్గా మన దరికి చేరవు. నాడీ వ్యవస్థ కూడా చురుగ్గా పని చేస్తుంది.

క్రమశిక్షణ నేర్పిస్తుంది..

యోగా వల్ల కేవలం శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా.. మనలో క్రమశిక్షణ కూడా అలవడుతుంది. సూర్యోదయానికి ముందే మేల్కోవడం, యోగా చేయడం దినచర్యలో భాగమై పోతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్చుకుంటే... ఆసనాలు వేయడం సులువవుతుంది. ఇలా యోగా వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కానీ యోగా సొంతంగా చేసేకంటే గురువు సమక్షంలో చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

ఈ రోజే ఎందుకంటే..

2015 జూన్‌ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనికి కారణమేంటో తెలుసా... 2014 సెప్టెంబర్‌ 27న మన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జూన్‌ 21న జరుపుకోవాలని ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 177 మంది ఐరాస ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. విస్తృతమైన చర్చల తర్వాత ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అలా 2015 జూన్‌ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. జూన్‌ 21వ తేదీనే జరుపుకోవడం ఎందుకంటే.. దీని వెనక కూడా ఆసక్తికర విషయం ఉంది. అది ఏంటంటే.. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. అందుకే ఇదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటే బాగుంటుందని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు. నేస్తాలూ! మరి మీరూ ఎంచక్కా రోజూ యోగా చేస్తారు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని