Published : 24 Jun 2022 00:29 IST

తిన్నామంటే.. సుర్రుమంటది!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరూ’ - పుష్ప సినిమాలోని ఈ డైలాగ్‌ అందరూ వినే ఉంటారు కదూ! ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐస్‌క్రీమ్‌ గురించి వింటే.. ‘ఐస్‌క్రీమ్‌ అంటే స్వీటు అనుకుంటివా.. హాటూ’ అని అనేస్తారు. కూల్‌గా, రకరకాల ఫ్లేవర్లలో ఉండే ఐస్‌క్రీములను మనం టేస్ట్‌ చేసి ఉంటాం. కానీ, దీన్ని మాత్రం ఇప్పటివరకూ ఎవరూ పూర్తిగా తినలేకపోయారట. ఆ వివరాలే ఇవీ..

పాన్‌లోని ఫుకుషిమా ప్రాంతంలో హిరాటా అనే ఓ చిన్న పల్లెటూరు ఉంది. మొన్నటివరకూ అక్కడి వారికి తప్ప ఎవరికీ తెలియని ఆ ఊరు.. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ‘అల్ట్రా స్పైసీ హబనెరో-లేస్డ్‌’ ఐస్‌క్రీమే అందుకు కారణం. ఘాటుగా ఉండే ఆ హిమక్రీముని రుచి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులకు హిరాటా గ్రామానికి వెళ్తున్నారట.

సునామీ రావడంతో..

సమీపంలోని అన్ని ఊళ్లలోని ప్రజల మాదిరే హిరాటా వాసులకు వ్యవసాయమే జీవనాధారం. కానీ, 2011లో వచ్చిన సునామీ అక్కడి ప్రజల ఆస్తులనూ, ఇళ్లనూ తుడిచిపెట్టేసింది. దాంతో అప్పటివరకూ కూరగాయలు అమ్ముకుంటూ బతికిన ప్రజలు.. కొత్త ఉపాధి మార్గాల కోసం వెతకసాగారు. ఓ ముగ్గురు రైతులు మాత్రం ‘హబనెరో’ రకానికి చెందిన మిరియాలను పండించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే సాగు చేశారు. అంతా బాగానే ఉన్నా.. అవి విపరీతమైన కారం ఉండటంతో జపాన్‌ ప్రజలు అస్సలు తినలేకపోయారట. తమ పంట అమ్ముడుపోకపోవడంతో ఆ రైతులకు దిక్కుతోచలేదు. కొత్తగా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. ఐస్‌క్రీమ్‌ ఆలోచన తట్టిందట. అలా 2015లో ఆ మిరియాల పొడిని కోన్‌ ఐస్‌క్రీమ్‌పైన ఫ్లేవర్‌గా చల్లి విక్రయించడం మొదలుపెట్టారు. ఆ కొత్త ఐస్‌క్రీమ్‌ గురించి తెలుసుకున్న వారంతా హిరాటా గ్రామానికి వెళ్లి మరీ.. దాన్ని టేస్ట్‌ చేయసాగారు. కానీ, ఠారెత్తించే ఆ ఘాటుకు ఎవరూ దాన్ని పూర్తిగా తినలేకపోయేవారు.  

తయారీలో జాగ్రత్తలు

ఈ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసేవారు కచ్చితంగా గ్లవ్స్‌, మాస్కు, కళ్లద్దాలు ధరించాల్సిందే. లేకపోతే ఆ మిరియాల ఘాటును ఏమాత్రం తట్టుకోలేరట. అంతేకాదు.. దాన్ని తినాలనుకున్న వారు ముందుగా ఆ దుకాణదారు దగ్గరుండే హామీ పత్రాన్ని నింపాలట. అంటే.. ఇష్టపూర్వకంగానే తింటున్నట్లు అందులో పేర్కొంటారట. పూర్తిగా తింటే డబ్బులు కూడా చెల్లించక్కర్లేదు. ఇటీవల అక్కడి ప్రముఖ రియాలిటీ షో ప్రతినిధి ఒకరు ఈ ఐస్‌క్రీమ్‌ని టేస్ట్‌ చేసేందుకు వెళ్లాడట. నాలుకతో పైనున్న మిరియాల ఫ్లేవర్‌ను తాకగానే, మంట పుట్టి అక్కడే ఏడ్చేశాడట. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నేస్తాలూ.. ఇవీ ‘అల్ట్రా స్పైసీ హబనెరో-లేస్డ్‌’ ఐస్‌క్రీమ్‌ విశేషాలు. మనం మాత్రం అలాంటి సాహసాల జోలికి వెళ్లకుండా.. ఇక్కడ దొరికే చల్లచల్లని, తియతియ్యని హిమక్రీములనే ఎంచక్కా తిందాం!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts