యమునలో చకచకా ఈదేశాడు!

హలో నేస్తాలూ.. నీళ్లన్నా, బావిలో ఈత కొట్టడమన్నా కొంతమందికి భలే సరదా.. మరికొందరికి మాత్రం భయం. అలాగే, చెరువులోకి దిగేందుకు కొందరు వెనకడుగేస్తే.. ఇంకొందరు చాలా ఉత్సాహం

Published : 30 Jun 2022 01:03 IST

హలో నేస్తాలూ.. నీళ్లన్నా, బావిలో ఈత కొట్టడమన్నా కొంతమందికి భలే సరదా.. మరికొందరికి మాత్రం భయం. అలాగే, చెరువులోకి దిగేందుకు కొందరు వెనకడుగేస్తే.. ఇంకొందరు చాలా ఉత్సాహం చూపుతారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడతడు మాత్రం ఏకంగా నదిలోనే ఈదేశాడు. అందరితో ‘ఔరా’ అనిపించాడు. అతడెవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శివాన్ష్‌ మోహిల్‌.. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎనిమిదేళ్ల ఈ బాబు ఇటీవల యమునా నదిలో ఈదేశాడు. 250 మీటర్ల వెడల్పుతో ప్రవహించే యమునా నది ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు కేవలం 18 నిమిషాల్లోనే ఈది అందరితో శెభాష్‌ అనిపించుకున్నాడు. అయితే, ఈ బాలుడే నదిని ఈదిన మొట్టమొదటి వ్యక్తి కాదట. అంతకుముందు వారమే అంటే జూన్‌ 16న శివాన్ష్‌కు కాస్త అటూఇటూ వయసున్న ఆరాధ్య శ్రీవాస్తవ అనే అబ్బాయి ఇదే రికార్డును 22 నిమిషాల్లో పూర్తి చేశాడు.

వంద మందిలో ఒకడు..
శివాన్ష్‌ ప్రస్తుతం ఓ ట్రయినర్‌ దగ్గర ఈత కొట్టడంలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నేస్తంతోపాటు మరో 100 మంది వరకూ శిబిరంలో ఉన్నారు. వారందరిలో మన శివాన్షే యమునా నదిని అతి తక్కువ సమయంలో ఈది తల్లిదండ్రులతోపాటు శిక్షకుడినీ గర్వపడేలా చేశాడు. ఈ బుడతడు ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఈదే సమయంలో నదిలో అతడి వెంట అయిదు పడవలతో రక్షణగా వెళ్లారట. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే సహాయం అందించేందుకే ఈ ఏర్పాటు చేశారు. చిన్న వయసులోనే పెద్ద రికార్డు సాధించిన ఈ నేస్తాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారట. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించేలా.. ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని