Published : 05 Jul 2022 00:33 IST

సకలకళా ‘తపస్వి’!

కరాటే, చిత్రలేఖనం, ఉపన్యాసం, అభినయం.. ఇలా పలు రంగాల్లో తన ప్రతిభ చాటుతున్నాడు ఓ బుడత. చిరుప్రాయంలోనే ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సాధించాడు. తనతోటి వారికి ఆదర్శంగానూ నిలుస్తున్నాడు. మరి ఆ చిన్నారి గురించి తెలుసుకుందామా... అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఎనిమిదేళ్ల స్థిత ప్రజ్ఞ తపస్వీరెడ్డి, ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. పలురంగాల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నాడు. నాన్న శ్రీనివాసరెడ్డి, తల్లి విజయలక్ష్మి, తపస్విలో చిన్నతనం నుంచే ఉన్న చురుకుతనాన్ని పసిగట్టారు. చూసిన పనిని, చెప్పిన మాటను వెంటనే గ్రహించటం, బెరుకు లేకుండా చెప్పటం చూసి రెండేళ్ల ప్రాయం నుంచే కరాటేలో శిక్షణ ఇప్పించారు. చిత్రలేఖనం, వక్తృత్వం, ఏకపాత్రాభినయం తదితర పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు.

అందరూ అవాక్కయ్యేలా...

చిన్నతనం నుంచే కరాటే సాధన చేస్తూ తపస్వి మెలకువలు నేర్చుకున్నాడు. 2018, 2020లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ రెండు విభాగాల్లో (కుమిటే, కటా) నాలుగు స్వర్ణ పతకాలు సాధించాడు. 2019లో జరిగిన ఏపీ స్టేట్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌, ఏపీ స్టేట్‌ కరాటే టోర్నమెంట్‌లో నాలుగు బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. సౌత్‌ ఇండియా గోజోరియో ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌-2019, 2021లో రెండు విభాగాల్లో మొత్తం నాలుగు పసిడి పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా కరాటేలో అన్నీ కలిపి 30 వరకూ బంగారు పతకాలు సాధించాడు. ఆరేళ్లకే బ్లాక్‌బెల్ట్‌ సాధించి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.

బహు బహుమతులు!

నెల రోజుల క్రితం ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థ ప్రతినిధుల సమక్షంలో 100 జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు ఎప్పుడు జరుపుకొంటారో చెప్పడంతో పాటు వాటి గురించి తపస్వి వివరించాడు. దీంతో ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు. 2022లో స్పేస్‌ ఫౌండేషన్‌ వారి ఆర్ట్‌ కాంటెస్ట్‌- 2022లో పాల్గొని ప్రశంసాపత్రం పొందాడు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వక్తృత్వ పోటీల్లో మొదటి బహుమతి పొందాడు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం-2021 పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పోటీల్లో ప్రథమ బహుమతి పొందాడు. 2021లో ఇస్రో వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్‌ డే-2019లో జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో మొదటి బహుమతి పొందాడు. సిరిమువ్వ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ 2019లో నిర్వహించిన జానపద నృత్య పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. పాఠశాలలో అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, గాంధీజీ, సుభాష్‌ చంద్రబోస్‌ తదితర మహానుభావుల పాత్రల్లో నటించి, మెప్పించి పలు బహుమతులు అందుకున్నాడు.

యూట్యూబ్‌ చూసి చిత్రలేఖనం...

గురువెవ్వరూ లేకుండానే యూట్యూబ్‌ ద్వారానే మెలకువలు నేర్చుకుని చిత్రలేఖనం నేర్చుకున్నాడు. తానే స్వయంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌నూ నిర్వహిస్తున్నాడు. ఇందులో చిన్నారులకు సంబంధించిన అనేక విషయాల గురించి చెబుతున్నాడు. ఇలా పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్న తపస్వి, తాను భవిష్యత్తులో కలెక్టర్‌ అవుతా అంటున్నాడు. మరి ఈ బుజ్జి ఆల్‌ రౌండర్‌కు మనం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని