Published : 06 Jul 2022 00:53 IST

ప్రధాని మెచ్చిన ప్రథమేశ్‌!

ఏకంగా ప్రధానినే మెప్పించాడు. ఆయనతో అభినందనలూ అందుకున్నాడు. ఇంతా చేస్తే ఆ బుడతడి వయసు కేవలం పదకొండు సంవత్సరాలు. పుట్టుకతోనే అంధుడు! తన లోపాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. మరి ఆ బాలుడి గురించి తెలుసుకుందామా...!

పుణెకు చెందిన ప్రథమేశ్‌ సిన్హాకు పుట్టుకతోనే కళ్లు కనిపించవు. ఈ నేస్తం ‘థింకర్‌ ల్యాబ్స్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య ఆ సంస్థ తరఫున ప్రముఖ రియాలిటీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లో పాల్గొన్నాడు. ఈ షోలో పాల్గొన్న వారిలో ప్రథమేశే అత్యంత పిన్న వయస్కుడు. అక్కడ ‘యాన్నీ’ అనే ఓ గాడ్జెట్‌ గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చాడు. ఇది ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది.

ప్రపంచంలోనే మొదటిది..
ఈ ‘యాన్నీ’ ప్రపంచంలోనే మొట్టమొదటి బ్రెయిలీ సెల్ఫ్‌ లెర్నింగ్‌ డివైజ్‌. ఇది భారతదేశంలో ఉన్న దాదాపు 20 లక్షల మంది అంధులకు విద్యనేర్పే సాధనం కానుంది. ఈ గాడ్జెట్‌ గురించి ఇచ్చిన ప్రజెంటేషనే ప్రథమేశ్‌ను ప్రస్తుతం సెలబ్రిటీని చేసింది. ఇన్‌స్టాలో 57 వేలకు పైగా ఫాలోయర్లనూ సంపాదించి పెట్టింది.

ప్రశంసలే ప్రశంసలు!
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రస్తుతం ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాలు జరుగుతున్నాయి. వీటిని సోమవారం ప్రారంభించిన ప్రధాని మోదీ... మన ప్రథమేశ్‌తో మాట్లాడారు. దివ్యాంగుడైన ఈ చిన్నారిలోని ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడయ్యారు. ‘యాన్నీ’ గురించి ఇచ్చిన ప్రజెంటేషన్‌కు కూడా ఫిదా అయిపోయారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోనూ ప్రధాని మోదీ, ప్రథమేశ్‌ గురించి మాట్లాడారు.

ఎన్నెన్నో హాబీలు..
మన ప్రథమేశ్‌కు మంచి మంచి హాబీలూ ఉన్నాయి. చక్కగా పాడతాడు.. కవితలూ చదువుతాడు.. కరెంట్‌ అఫైర్స్‌ మీద కూడా మంచి పట్టుంది.. శ్లోకాలూ వచ్చు.. ఇంకా హార్మోనియమూ ప్లే చేయగలడు. చక్కగా చదువుకుని భవిష్యత్తులో కలెక్టర్‌ అవుతానంటున్నాడు. మరి మనమంతా ప్రథమేశ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని