నేను సముద్రానికే పోలీస్‌!

మిమ్మల్ని దొంగల నుంచి రక్షించడానికి పోలీసులున్నారు. సముద్రాల్లో అయితే మెరైన్‌ పోలీసులుంటారు. నిజమే.. కానీ వారు అన్ని వేళల్లో అన్ని ప్రాంతాలకూ వెళ్లలేరు. అందుకే వారికి నేను సాయం చేసిపెడుతున్నా.. సముద్ర దొంగలు, అక్రమ వేటగాళ్ల ఆచూకీ కనిపెట్టి సమాచారం అందిస్తా.

Published : 23 Sep 2020 01:43 IST

మిమ్మల్ని దొంగల నుంచి రక్షించడానికి పోలీసులున్నారు. సముద్రాల్లో అయితే మెరైన్‌ పోలీసులుంటారు. నిజమే.. కానీ వారు అన్ని వేళల్లో అన్ని ప్రాంతాలకూ వెళ్లలేరు. అందుకే వారికి నేను సాయం చేసిపెడుతున్నా.. సముద్ర దొంగలు, అక్రమ వేటగాళ్ల ఆచూకీ కనిపెట్టి సమాచారం అందిస్తా. అంటే ఓ రకంగా నేనూ సముద్ర పోలీసునే అన్నమాట.

ఇంతకీ మీకు నా పేరు చెప్పనే లేదు కదూ! నన్ను ఆల్బట్రాస్‌ అంటారు. నేను ఓ సముద్రపక్షిని అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.

నెలరోజుల్లో..

భూమి మీద కాలు మోపకుండా నెల రోజుల్లో దాదాపు పది వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలను. ఈ సమయంలో ఆకలేస్తే సముద్రం నీటిపై బాతులా ఈదుతూ చిన్న చిన్న చేపల్ని తింటూ కడుపునింపుకొంటా. నేను శక్తిని చాలా పొదుపుగా వాడతా. ఎక్కువ రెక్కలు కొట్టకుండానే గ్లైడ్‌ చేస్తున్నట్లు చాలా దూరం ఎగరగలను. నా జీవిత కాలంలో మొత్తంగా దాదాపు 85 లక్షల కిలోమీటర్ల దూరం చుట్టేస్తా. ఇది భూమి నుంచి చంద్రుని మీదకు 10 సార్లు వెళ్లిరావడంతో సమానమంట.

రెక్క విప్పితే...

మూడు మీటర్ల పొడవుండే నా రెక్కలే నా బలం. మేం 50 ఏళ్ల వరకు బతుకుతాం. సముద్రంలో వేటాడేందుకు వలలు విసురుతుంటారు కదా! వాటిలో చేపలతో పాటు పక్షులు, అనేక సముద్రపు జీవులూ చిక్కుకొని మరణిస్తుంటాయి. ఇలా అనుమతులు లేకుండా వేటాడుతున్న వారిని, ఎవరైనా శత్రువులు మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిన వారిని పట్టుకునేందుకు నిఘా నౌకల్లో సిబ్బంది గస్తీ తిరుగుతుంటారు. కానీ అంటార్కిటికా ఖండం దగ్గర సముద్రం లోపలకు అన్ని వేళల్లో వారు వెళ్లలేరు కదా! అందుకే మా సహాయం తీసుకుంటున్నారు.

ఎలా అంటే..

మా శరీరం మీద ప్రత్యేక పరికరాల(డేటా లాగర్‌)ను అమరుస్తున్నారు. అక్రమంగా వేటకు వచ్చే నౌకల నుంచి వచ్చే సంకేతాలను లాగర్‌ గ్రహించి.. సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తుందన్నమాట. మీతో ఇలా కబుర్లు చెప్పుకొంటూ ఉంటే.. అక్కడ సముద్రంలో దొంగలు పడిపోతారేమో!..

ఇక ఉంటా మరి.. బై బై..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని