రామయ్య మంచితనం

అవంతీపుర రాజ్యానికి రాజు మహేంద్రుడు. బాటసారులకు రాజ్యంలో సత్రాలు కట్టించి వారి ఆకలి తీర్చి, వసతి ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఇందుకు

Published : 26 Sep 2020 00:40 IST

అవంతీపుర రాజ్యానికి రాజు మహేంద్రుడు. బాటసారులకు రాజ్యంలో సత్రాలు కట్టించి వారి ఆకలి తీర్చి, వసతి ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఇందుకు ధనవంతులు, వ్యాపారులు, సామాన్యుల సాయం తీసుకోవాలని భావించాడు. స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాజ్యంలో చాటింపు వేయించాడు రాజు.

రాజ్యానికి చెందిన రామయ్య తన కూతురి వివాహం కోసం మంగళసూత్రం తయారు చేసి ఇవ్వమని వ్యాపారి భూమయ్యకు సొమ్ము చెల్లించాడు. రెండు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్లమని అతడు చెప్పాడు. ఇంతలో మహేంద్రుడి చాటింపు విషయం రామయ్య చెవిన పడింది. ‘అమ్మాయి పెళ్లి వచ్చే సంవత్సరం చేద్దాం. మహారాజు మంచి పని చేయాలనుకుంటున్నారు. మన దగ్గర ఉన్న సొమ్ము మంగళసూత్రం కోసం ఇచ్చాం కదా. మనవంతు సాయంగా దాన్నే ఇచ్చేద్దాం’ అని రామయ్య తన భార్యను ఒప్పించాడు.

అనుకోకుండా వ్యాపారి భూమయ్య పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. తన దగ్గర పనిచేసే రంగయ్యకు మంగళసూత్రాన్ని ఇచ్ఛి. రామయ్యకు అందించమని చెప్పి వెళ్లాడు. దాన్ని ఇచ్చేందుకు వెళ్లిన రంగయ్య.. ఇంటి బయట నుంచి రామయ్య సంభాషణ విన్నాడు. మంగళసూత్రం ఇవ్వకుండానే తిరిగి దుకాణానికి వెళ్లిపోయాడు. రంగయ్యను రామయ్య పెంపుడు చిలుక చూసి వెంబడించింది. మరుసటి రోజు మంగళసూత్రం తెచ్చి రామయ్యకు అప్పగించాడు పనివాడు.

రాజు ఆదేశం మేరకు కోటలోని ఒక గదిలో మంత్రి పెద్ద పాత్ర ఏర్పాటు చేయించాడు. ధనం, విలువైన వస్తువులు తెచ్చిన వారు ఒక వస్త్రంలో చుట్టి.. దానిపై పేరు, చిరునామా రాసి అందులో వేయాలని వివరించాడు. రామయ్య అలాగే చేశాడు. రెండు రోజుల తర్వాత కోట నుంచి రామయ్యకు పిలుపు రావడంతో తన పెంపుడు చిలుకతో సహా వెళ్లాడు. ‘ఈ మంగళసూత్రం కానుకగా వేసింది నువ్వే కదా?’ అడిగాడు మంత్రి. అవును అన్నాడు రామయ్య. ‘ఇది నకిలీ బంగారంతో చేసింది. నువ్వు సహాయం చేయకున్నా ఫర్వాలేదు. కానీ ఇలాంటిది ఇచ్చి ఎందుకు మోసం చేశావు’ అని ప్రశ్నించాడు మహారాజు.

‘రాజా.. నేను వ్యాపారి భూమయ్యతో దీన్ని చేయించాను. పనివాడు రంగయ్య వచ్చి ఇచ్చి వెళ్లాడు’ అని సమాధానం ఇస్తుండగా.. చిలుక ఎగురుకుంటూ వెళ్లి మహారాజు చెవిలో ఏదో చెప్పింది. వెంటనే వ్యాపారిని పిలిపించాలని మంత్రిని ఆదేశించాడు రాజు. అతడు వచ్చి జరిగింది వివరించాడు. నిజం తేలేవరకు రామయ్య, భూమయ్యను చెరసాలలో వేయాలని ఆజ్ఞాపించాడు రాజు. విషయం తెలుసుకున్న రంగయ్య పరారవుతుండగా.. భటులు బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. అతని సంచిలో వెదికితే అసలు మంగళసూత్రం దొరికింది. చేసేది లేక తానే తప్పు చేశానని రంగయ్య ఒప్పుకొన్నాడు. ‘మూర్ఖుడా.. ఆ పక్షికున్న విశ్వాసం నీకు లేదు.. అందరినీ మోసం చేశావు. తక్షణం ఈ దొంగను కారాగారంలో వేయండి’ అని రాజు ఆదేశించాడు.

‘కూతురు వివాహం వాయిదా వేసుకొని మరీ రాజ్యం మీద అభిమానంతో మంగళసూత్రాన్ని కానుకగా ఇవ్వాలనుకున్న రామయ్యను, దొంగను పట్టించిన చిలుకను మహారాజు ఘనంగా సన్మానించాడు. అంతేకాకుండా రామయ్య కూతురు వివాహాన్ని తన సొంత ఖర్చులతో అంగరంగ వైభవంగా జరిపించాడు.

- యు.విజయశేఖర రెడ్డి, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని