Published : 23 Dec 2020 01:08 IST

ఉడత తపస్సు

దారిన పోతూ దోర జామకాయను చూసి నోరూరి చెట్టుమీద వాలింది చిలుక. దానికి అక్కడ కళ్లు మూసుకుని తలకిందులుగా ఉడత కనిపించింది. ‘ఏం చేస్తున్నావు’ అని దాన్ని అడిగింది. ‘తపస్సు చేస్తున్నా’ అంది ఉడత. ‘తపస్సా? దేనికి?’ అనడిగింది చిలుక. ‘నాకు నీలా ఎగరడం రాక ఈ చెట్టే ప్రపంచమైపోయింది. పైగా ఎప్పుడూ జామపండ్లే. రైతేమో ఒకటే తిట్లు! ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తూ ఉంటాను కదా. అదే నీలా ఎగిరాననుకో.. రకరకాల పళ్లు తినొచ్చు’ అని తన మనసులో మాట చెప్పింది. అంతలోనే మళ్లీ.. ‘చప్పుడు చెయ్యకుండా తినేసి వెళ్లిపో. నా తపస్సుకు భంగం కలుగుతోంది’ అంది ఉడత.
అది విని మనసులో నవ్వుకున్న చిలుక.. ఉడతకు జ్ఞానోదయం కలిగించాలనుకుంది. దాంతో.. ‘చాలా మంచి ఆలోచన. నీ తపస్సు ఫలించి రేపట్నుంచి నువ్వూ ఎగురుతావు కదా నాలాగా. అప్పుడు ఏ ఏ పండ్ల చెట్లు ఎక్కడ ఉంటాయో నీకు తెలియదు కదా! మళ్లీ నేను ఎప్పుడు ఇటు వస్తానో ఏమో. కాబట్టి ఒక పని చేస్తావా?’ అంది ఉడతతో.

‘చెప్పు అదేంటో’ అంది గర్వంగా ఉడత. ‘నా వీపు మీద కూర్చో.. ఆ చెట్లన్నీ నీకు చూపిస్తా’ అంది చిలుక. ‘సరేలే.. ముందే తెలిసి ఉంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు’ అని చిలుక సలహాకు ఆనందపడిపోతూ దాని వీపు మీద ఎక్కి కూర్చుంది ఉడత.
రివ్వున గాల్లో ఎగిరి కొంత దూరం వెళ్లి సీతాఫలం చెట్టు మీద వాలింది చిలుక. ‘ఇవి సీతాఫలాలు.. తిను’ అంది చిలుక ఆయాసపడుతూ.. ‘భలే.. భలే..’ అనుకుంటూ ఎదురుగా కనిపించిన సీతాఫలాన్ని కొరకబోయింది ఉడత. ఇంతలో చిలుక మీద హఠాత్తుగా దాడిచేసి పట్టుకోబోయింది అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న పాము. దాన్నుంచి తప్పించుకుని ఎగిరి మరో కొమ్మ మీద వాలింది చిలుక. పరుగు పరుగున చిలుక వాలిన కొమ్మ మీదకు పరుగెత్తి దాని వీపు మీద ఎక్కి కూర్చుని, దాన్ని గట్టిగా పట్టుకుంటూ.. ‘పద.. పద వెళ్లిపోదాం’ అని కంగారు పెట్టింది ఉడత.
దాంతో పైకి ఎగిరిన చిలుక కొంతదూరం వెళ్లేసరికి దానికి అరటి చెట్టు కనిపించి దాని మీద వాలింది. ‘ఉడతా.. నీకు తెలుసు కదా.. ఇవి అరటి పండ్లు.. తిను’ అంది చిలుక తానూ తినబోతూ.. ‘చిలుకా నువ్వు తింటూ ఉండు. నీ వీపు మీద కూర్చుని కూర్చుని నాకు కాళ్లు పట్టేశాయి. ఒకసారి అరటి చెట్టంతా తిరిగేసి వస్తాను.’ అని పైకీ కిందకూ తిరిగి కాసేపటికి అరటిగెల దగ్గరకు వచ్చింది. అప్పటికే గెల చుట్టూ వేసిన వలలో కాళ్లు చిక్కుకు పోయి గిలగిలలాడుతూ కనిపించింది చిలుక.
‘అయ్యో..!’ అంటూ ఉడత గబగబా వలను కొరికి చిలుకను వదిలించి ‘పద వెళ్లిపోదాం’ అంది భయంగా.. చుట్టూ చూస్తూ. ‘ఎక్కడికి?’ అంది చిలుక ఉడత దగ్గరికంటా వచ్చి అది తన వీపు మీద ఎక్కడానికి వీలుగా కూర్చుంటూ. ‘జామ చెట్టు మీదకు’ అంది ఉడత దాని వీపుపై ఎక్కుతూ. ‘ఏమైంది.. అప్పుడేనా.. ఇంకా చాలా రకాల పండ్ల చెట్లున్నాయి. అవన్నీ చూడవా?’ అంది చిలుక. ‘లేదు.. చూడను.. నాకు నా చెట్టే నచ్చింది. ఎగిరితే ఎన్నో రకాల పండ్లు అనుకున్నా కానీ.. ఎదురయ్యే ప్రమాదాలు ఊహించలేదు’ అంది ఉడత చిలుక వీపు పైకి ఎక్కి గట్టిగా పట్టుకుంటూ..!
‘ఇప్పుడు నీకు అర్థమైందా? మన సుఖం మనకు తెలియదు. ఎదుటి వాళ్లు మాత్రం ఎప్పుడూ మనకు సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారు. వాళ్లకుండే కష్టాలు వాళ్లకుంటాయి’ అంది చిలుక. ‘అవును’ అని ఒప్పుకొంది ఉడత. చిలుక రివ్వున గాల్లోకి ఎగిరింది. కాసేపటికి అవి రెండూ జామ చెట్టును చేరాయి.

- కన్నెగంటి అనసూయ


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని