భవనాలకు అద్దాలు.. మాకు హానికరం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘అద్దంలో దాని ప్రతిబింబం చూసుకుంటున్న ఈ పక్షి మన పేజీలోకి ఎందుకొచ్చింది?’ అని ఆలోచిస్తున్నారా! చిన్నారులు, మూగజీవాలు స్నేహితులు కాబట్టి పక్షి జాతి బాధలు చెప్పుకొందామని ఇక్కడికి వచ్చింది. ఇంతకీ వాటికొచ్చిన ఇబ్బందేంటో దాని మాటల్లోనే తెలుసుకుందాం..!!

Published : 17 Feb 2021 01:33 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘అద్దంలో దాని ప్రతిబింబం చూసుకుంటున్న ఈ పక్షి మన పేజీలోకి ఎందుకొచ్చింది?’ అని ఆలోచిస్తున్నారా! చిన్నారులు, మూగజీవాలు స్నేహితులు కాబట్టి పక్షి జాతి బాధలు చెప్పుకొందామని ఇక్కడికి వచ్చింది. ఇంతకీ వాటికొచ్చిన ఇబ్బందేంటో దాని మాటల్లోనే తెలుసుకుందాం..!!

ప్రపంచంలో ఎక్కడ చూసినా.. ఏదో ఒక నిర్మాణ పని సాగుతూనే ఉంటుంది. వ్యవసాయ భూములను కూడా ప్లాట్లుగా మారుస్తూ ఆకాశాన్ని అంటేలా పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు కదా! కడితే కట్టుకోండి.. మీ డబ్బు మీ ఇష్టం కానీ.. ఆ భవనాలకు అద్దాలు ఎక్కువ లేకుండా చూసుకుంటే, మా పక్షి జాతికి మేలు చేసిన వారవుతారు. ఎందుకంటే.. ఒకవైపు మాత్రమే కనిపించే అద్దాల్లో పక్షులు వాటి ప్రతిబింబాలు చూసుకుంటూ.. తమలాంటి వాళ్లే ఇంకొకరు ఉన్నారని, దాన్ని శత్రువులా భావిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా వాటి ముక్కు, తలతో అద్దంలో కనిపించే బొమ్మపై దాడికి దిగుతున్నాయి. దాంతో తీవ్రంగా గాయపడుతూ చనిపోతున్నాయి పాపం..

విదేశాల్లో మరీనూ..
మన దేశంలో ప్రస్తుతానికి పరిస్థితి కొంత నయంగా ఉంది. కానీ, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాకు బతకడమే కష్టంగా మారింది. 2014లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం..  ఇలాంటి అద్దాల వల్ల అమెరికాలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక బిలియన్‌ పక్షులు చనిపోతున్నాయట. మన లెక్కలో వంద కోట్లన్నమాట. 

పల్లెల కన్నా పట్టణాల్లోనే..
పల్లెల్లో ఎక్కువగా కనిపించే పావురాలు, కాకులకు భవనాలకుండే అద్దాల వల్ల పెద్ద ప్రమాదం లేదు. పట్టణాలకు సమీపంలోని అడవుల్లో ఉండే పక్షులే అద్దంలో తమ ప్రతిబింబాన్ని వేరే పక్షిగా భావించి దాడికి పాల్పడుతున్నాయి. అలా అని మాలో అన్ని రకాలూ.. అలాగే చేయడం లేదు. పక్షుల ప్రవర్తన ఆధారంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ మధ్య మన దేశ రాజధాని దిల్లీలోనూ ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మాట నేను అనడం లేదండీ.. అక్కడ పనిచేసే వెటర్నరీ వైద్యులే వెల్లడించారు. అంతేకాదండోయ్‌.. మా తలకు దెబ్బతగిలితే ఇక చనిపోవటమేనని కూడా చెబుతున్నారు. మేం ఆహారం కోసమో, ఇంకో పనికో ఊళ్లలోకి వెళ్తుంటే.. అక్కడి భవనాల అద్దాల వల్ల ప్రాణాలనే కోల్పోవాల్సి వస్తోంది. ఇవండీ మా బాధలు. మీరు పెద్దయి.. బాగా డబ్బు సంపాదించిన తర్వాత కట్టించే ఇంటికో, ఆఫీసుకో అద్దాలు తక్కువగా ఉండేలా చూసుకోండే.. ఉంటా మరి.. బై బై..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని