వినయమే అసలైన విజేత!

శాలినీ రాజ్యాన్ని సుదర్శనుడు పాలిస్తున్నాడు. ఏటా దసరా ఉత్సవాలు జరిపి కవులు, పండితులను సత్కరించేవాడు. ఎప్పటిలానే ఆ సంవత్సరం కూడా వారిని సన్మానించాలనుకున్నాడు. ఆ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి అనేకమంది కవి పండితులు వచ్చారు.

Published : 20 Jul 2021 01:43 IST

శాలినీ రాజ్యాన్ని సుదర్శనుడు పాలిస్తున్నాడు. ఏటా దసరా ఉత్సవాలు జరిపి కవులు, పండితులను సత్కరించేవాడు. ఎప్పటిలానే ఆ సంవత్సరం కూడా వారిని సన్మానించాలనుకున్నాడు. ఆ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి అనేకమంది కవి పండితులు వచ్చారు. అందరినీ సన్మానించిన రాజు తన మనసులోని మాటలను ఇలా చెప్పాడు. ‘పండితులారా! మీరందరూ అగ్రగణ్యులే. కానీ ఈ సంవత్సరం మీలో ఒక ఉత్తముడైన పండితుణ్ని ప్రత్యేకంగా సన్మానిద్దామని అనుకుంటున్నాను. మీలో ఎవరు ఉత్తమమైన వారో మీరే తెలపండి. వారి పేరు మీరే సూచించండి. వారినే సత్కరిస్తాము’ అన్నాడు. పండితులందరూ మౌనం వహించారు.
అప్పుడు మంత్రి కల్పించుకుని ‘మహారాజా! మీలో ఎవరు గొప్పవారో చెప్పమంటే వారు ఎలా చెబుతారు. ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి’ అన్నాడు. అప్పుడు రాజు నవ్వుతూ.. ‘మనకు వారి పాండిత్యాన్ని అంచనా వేసే సామర్థ్యం లేదే! అయినా వారు ఎవరి పేరు చెబితే వారినే సన్మానిద్దాం’ అన్నాడు. అప్పుడు కూడా పండితులు ఎవరూ మాట్లాడలేదు.

అప్పుడు రుద్రభట్టు అనే పండితుడు లేచి ‘మహారాజా! ఇక్కడ దిగ్గజాల్లాంటి పండితులున్నారు. వారు సాక్షాత్తూ సరస్వతి రూపులే. అందువల్ల మీరే నిర్ణయం తీసుకోండి. మీ మాటే మాకు శాసనం’ అని అన్నాడు. అందుకు పండితులందరూ ఆమోదం తెలిపారు. రాజు రహస్యంగా పండితులందరినీ ఒక్కొక్కరిని కలుసుకుని వారిని అడిగి ప్రాథమికంగా ముగ్గురిని ఎంపిక చేశాడు. వారి నుంచి ఒక పండితుడికి సన్మానం చేయాల్సి ఉంటుందని మంత్రికి తెలిపాడు.

ఆ ముగ్గురూ సూర్య దీప్తి, చంద్రభాను, రుద్రభట్టు. వారిలో సూర్యదీప్తిని రాజు పిలిపించి అతడి గొప్పతనాన్ని చెప్పమన్నాడు. అప్పుడు అతడు ‘మహారాజా! ఈ పండితులందరిలో నేనే గొప్పవాడిని. మీరు విచారణ చేయిస్తే వీరందరూ మొదట నా పేరే చెబుతారు’ అన్నాడు. ఆ తర్వాత చంద్రభానును ఇదే ప్రశ్న అడిగాడు రాజు. అతను.. ‘మహారాజా..! మీకు నా పాండిత్యంపై నమ్మకం ఉంటే నన్ను సత్కరించండి. మీరు పండితులందరినీ నా గురించి మరోసారి అడగండి’ అన్నాడు. రాజు చివరన రుద్రభట్టును పిలిచి ఇదే ప్రశ్న వేశాడు. అతడు ‘మహారాజా! మీరు వీరిలో ఎవరికైనా సన్మానం చేయండి. పాండిత్యంలో నేను వారికన్నా గొప్పవాడిని కాదనిపిస్తోంది’ అన్నాడు. రాజుకు ఏమీ పాలుపోక ఈ బాధ్యతను మంత్రికి అప్పగించాడు.

మంత్రి పండితులందరినీ రహస్యంగా కలిసి వారి అభిప్రాయం ప్రకారం రుద్రభట్టునే ఈ సత్కారానికి ఎంపిక చేశాడు. అప్పుడు మిగతా ఇద్దరూ అభ్యంతరం తెలిపారు.

వెంటనే మంత్రి ‘మీ పాండిత్యాన్ని అంచనా వేసే శక్తి నిజానికి నాకు లేదు. కానీ మీ గురించి కొన్ని వివరాలు సేకరించాను. సూర్యదీప్తికి అహంకారం ఎక్కువ. చంద్రభానుకు పెద్దగా అహంకారం లేదు కానీ తనకు ఇష్టమైన వారితోనే మాట్లాడతాడు. మిగతా వారిని అస్సలు పట్టించుకోడు. ఇక రుద్రభట్టు చాలా వినయం కలవాడు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. పైగా గొప్ప ప్రజ్ఞావంతుడు. అయినా తానేమీ పెద్ద జ్ఞానవంతుణ్ని కాదని, మిగతా వారే తనకన్నా గొప్పవాళ్లని వినయంగా చెబుతాడు. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న పండితులు నాకు రహస్యంగా వివరించారు. వినయం, విజ్ఞానం రెండూ ఉన్న రుద్రభట్టే ఈ సన్మానానికి అర్హుడని నాకు సూచించారు’ అని మంత్రి అన్నాడు.

ఆ మాటలకు పండితులందరూ జయజయధ్వానాలు చేశారు. రుద్రభట్టును రాజు సన్మానించాడు. తనకు జరిగిన సత్కారం నిజానికి తనది కాదని, పండితులందరిది అని,  దాన్ని వినయంగా అందరికీ అంకితమిచ్చాడు. మరోసారి సభ చప్పట్లతో మారుమోగింది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని