మౌనంగానే బతకమని... జిరాఫీ నీకు చెబుతుంది!

‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది..’ ‘ఇది కదా.. పాట..! మేం చాలాసార్లు ఈ పాటే పాడి స్కూల్లో బహుమతులూ గెలుచుకున్నాం..

Published : 08 Oct 2021 00:23 IST

‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది..’ ‘ఇది కదా.. పాట..! మేం చాలాసార్లు ఈ పాటే పాడి స్కూల్లో బహుమతులూ గెలుచుకున్నాం.. మాకు తెలుసు.. ఈ పాటలోకి అసలు జిరాఫీ ఎందుకు వచ్చింది’ అని మీలో కొంతమంది ఈపాటికే అనుకుంటున్నారు కదూ! మొక్కైతే ఎలా మౌనంగా ఎదిగి చెట్టు అవుతుందో.. అలాగే చెట్టంత జిరాఫీ కూడా దాదాపు మౌనంగానే ఉంటుంది. నమ్మబుద్ధి కావడం లేదు కదూ! అయితే ఈ కథనం చదివేయండి  ఫ్రెండ్స్‌.. మీకే తెలుస్తుంది.

‘ఏనుగు ఘీంకరిస్తుంది... సింహం గర్జిస్తుంది... పులి గాండ్రిస్తుంది.. గాడిద ఓండ్రపెడుతుంది... కుక్క భౌ..భౌ..అని మొరుగుతుంది.. పిల్లి మ్యావ్‌.. మ్యావ్‌.. అంటుంది. అంతెందుకు అన్ని జంతువులు, పక్షులు కనీసం ఏదో ఒక శబ్దం చేస్తాయి. మరి జిరాఫీ ఎలాంటి శబ్దం చేస్తుంది. దానికి అసలు శబ్దాలు చేయడం వస్తుందా? రాదా? స్వరపేటిక ఉంటుందా? ఉండదా?..’ అనే అనుమానం మీకీపాటికే వచ్చి ఉంటుంది. నిజానికి జిరాఫీకి స్వరపేటిక ఉంటుంది. శబ్దాలు చేయడమూ వచ్చు.. కానీ అది దాదాపు మౌనంగానే ఉండిపోతుంది!

రాత్రిపూట లో- ఫ్రీక్వెన్సీలో...

చాలాకాలం క్రితం వరకు శాస్త్రవేత్తలు అసలు జిరాఫీలు కేవలం ‘హమ్‌’ చేస్తాయి. తుమ్మడం, దగ్గడంలాంటి శబ్దాలు మాత్రమే చేస్తాయి. కానీ ఇతర జంతువుల్లా స్పష్టమైన శబ్దాలు చేస్తాయనుకోలేదు. అవి తమ బాడీ లాంగ్వేజ్‌తోనే ఇతర జిరాఫీలతో కమ్యూనికేట్‌ అవుతాయి అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పరిశోధన, జిరాఫీల గుట్టు తేల్చింది. పగలంతా ఎలా ఉన్నా.. రాత్రిపూట మాత్రం జిరాఫీలు లో-ఫ్రీక్వెన్సీలో శబ్దాలు చేస్తాయని తేల్చారు. ఇవి మనం మామూలు చెవులతో స్పష్టంగా వినలేం. కొన్ని ప్రత్యేక పరికరాలు మాత్రమే స్పష్టంగా గుర్తించగలవు. మరి ఇలా రాత్రిపూట ఎందుకు లో-ఫ్రీక్వెన్సీలో శబ్దాలు చేస్తాయంటే... చీకట్లో వాటికి కళ్లు సరిగా కనబడవు. అందుకే అవి తోటి జిరాఫీలతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇలా శబ్దాలు చేస్తాయన్నమాట.

940 గంటలు రికార్డు చేస్తే..

ఈ విషయం కూడా అంత తేలిగ్గా తేలలేదు. ఎనిమిదేళ్ల కాలంలో జిరాఫీలు చేసిన కొన్ని శబ్దాలకు సంబంధించిన 940 గంటల సౌండ్‌ రికార్డులను విశ్లేషించి తేల్చారు. జిరాఫీలు 92హెడ్జ్‌ల ఫ్రీక్వెన్సీలో హమ్‌ చేస్తున్నట్లు లెక్కగట్టారు. ఇవి నిజానికి మనిషి వినగలిగే స్థాయి శబ్దాలే! కానీ స్పష్టత ఉండదు. మెడ పొడవుగా ఉండటం, స్వరపేటిక నిర్మాణం వల్లనే జిరాఫీలు స్పష్టమైన శబ్దాలు చేయలేకపోతుండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ జిరాఫీలు సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉంటాయి. నేస్తాలూ... మొత్తానికి ఇవీ జిరాఫీ మౌనం సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని