రుచి ఎరుగని ఆకలి!

చందన దేశాన్ని ధర్మతేజుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలు అతని పాలనలో సుఖంగా ఉండేవారు. సువర్ణుడు అతని మంత్రి. రాజుకు తగ్గవాడు. అన్ని పనుల్లో రాజుకు సరైన సలహాలు ఇస్తుంటే రాజ్య పాలన సాఫీగా సాగిపోయేది. ప్రతిరోజూ, సభలో ఏదో ఒక విషయం మీద చర్చ జరిగేది. దానికి సభలో ఉన్న అధికారుల నుంచి, ప్రజల నుంచి కూడా సలహాలు తీసుకుని.. ఆఖరున ఆ చర్చ ముగించేవాడు రాజు. ధర్మతేజుడు భోజన ప్రియుడు కూడా. వంటవాళ్లతో రకరకాల వంటలు చేయించుకుని తింటూ ఆనందించేవాడు.

Updated : 07 Dec 2021 00:23 IST

చందన దేశాన్ని ధర్మతేజుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలు అతని పాలనలో సుఖంగా ఉండేవారు. సువర్ణుడు అతని మంత్రి. రాజుకు తగ్గవాడు. అన్ని పనుల్లో రాజుకు సరైన సలహాలు ఇస్తుంటే రాజ్య పాలన సాఫీగా సాగిపోయేది. ప్రతిరోజూ, సభలో ఏదో ఒక విషయం మీద చర్చ జరిగేది. దానికి సభలో ఉన్న అధికారుల నుంచి, ప్రజల నుంచి కూడా సలహాలు తీసుకుని.. ఆఖరున ఆ చర్చ ముగించేవాడు రాజు. ధర్మతేజుడు భోజన ప్రియుడు కూడా. వంటవాళ్లతో రకరకాల వంటలు చేయించుకుని తింటూ ఆనందించేవాడు.

ఒకరోజు ద్రావిడ దేశం నుంచి వచ్చిన ఓ వ్యాపారి, రాజుకు తియ్యని కోవా తీసుకువచ్చి ‘మహారాజా..! ఇంత రుచి గల కోవా మీరింత వరకు తిని ఉండరు’ అన్నాడు. రాజు ఆ కోవా రుచి చూసి ‘ఆహా..! ఏమి రుచి.. నిజంగానే ఇంత రుచి గల తియ్యని పదార్థం నేనింత వరకు తినలేదు’ అన్నాడు. అలా చర్చ రుచుల మీదకు మళ్లింది. ‘అన్నిటి కంటే రుచిగల పదార్థం ఏది?’ అన్నాడు రాజు. ‘ఇంకేది... ఇప్పుడే అన్నారుగా, ఈ వ్యాపారి తెచ్చిన తియ్యని కోవా’ అని అన్నాడు సైన్యాధిపతి. ‘రాజా..! లేత మాంసం, నువ్వుల నూనెతో వండిన వంటలు చాలా రుచిగా ఉంటాయి’ అన్నాడు కోశాధికారి. ఇలా ఎవరికి తోచింది వాళ్లు చెప్పారు.

‘ఏం.. మహామంత్రీ.. మీరు ఏమీ చెప్పలేదు?’ అన్నాడు రాజు. ‘మహారాజా..! అన్నింటికీ ఏదో రుచి ఉండడం సహజమే.. కానీ ఆకలిగా ఉన్నప్పుడు అన్నీ రుచిగానే ఉంటాయి. అదే కడుపు నిండితే.. పెద్దగా రుచి అనిపించదు’ అన్నాడు మంత్రి. ‘మీరెప్పుడూ అంతే.. ఏది కూడా సరిగా చెప్పరు. ఆకలి రుచి ఎరుగదు అన్నది నిరూపించాలి.. లేకుంటే మీకు దండన తప్పదు’ అన్నాడు రాజు. ‘మహారాజా..! అందుకు నాకు 15 రోజులు గడువు కావాలి’ అన్నాడు మంత్రి. ‘సరే.. ఈ 15 రోజుల్లో చెప్పాలి. లేదంటే తరువాత శిక్ష తెలుసు కదా!’ అన్నాడు రాజు. అలా ఆ రోజు సభ ముగిసింది.

‘మహారాజా..! ఈ వారంలో మనం వేటకు వెళ్లాలని అనుకున్నాం’ అన్నాడు మంత్రి. ‘అవును.. జంతువులు ఊరిలోకి వస్తున్నాయని ప్రజలన్నారు కదా! వెంటనే వేటకు ఏర్పాట్లు చెయ్యండి’ అన్నాడు రాజు. వేట ఏర్పాట్లలో మునిగిపోయారంతా! వంటవాళ్లు, సైనికులు, గుడారాలు ఇలా అన్నింటితో వేటకు బయలు దేరాడు రాజు. ముందుగా ఒక ప్రదేశంలో గుడారాలు వేసి అక్కడి నుంచి వేట సాగించాలని, సాయంవేళకు తిరిగి అక్కడికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారంతా! ‘మంత్రి, కొంత మంది సైనికులతో రాజు వేటకు బయలుదేరాడు. సరిగ్గా మధ్యాహ్నానికి తెలివిగా మంత్రి.. రాజును దారి తప్పించాడు. చాలా సేపటికి గానీ రాజుకు దారి తప్పానని తెలియలేదు. అప్పటికి రాజుకు ఆకలి, దాహం మొదలైంది. ‘మహారాజా..! ఎంత ఆకలి వేసినా అడవిలో పండ్లు తినకండి, వాటిల్లో విషముంటుంది, ప్రాణానికి ప్రమాదం’ అన్న మంత్రి మాటలు గుర్తుకు వచ్చాయి. అందుకే కనిపించిన పండ్లను కూడా తాకను కూడా తాకలేదు రాజు.

అలా కొంత దూరం వెళ్లేసరికి అక్కడొక గుడిసె కనిపించింది. ‘హమ్మయ్య!’ అనుకుంటూ రాజు అక్కడికి చేరాడు. అక్కడొక  అవ్వ ఉంది. ‘ఈ అడవిలో ఎలా ఉంటున్నావు?’ అడిగాడు రాజు. ‘మీరెవరో గొప్పింటి బిడ్డలా ఉన్నారు.. ఇలా వచ్చారేంటి?’ అంది అవ్వ. ‘అవన్నీ తరువాత, ముందు ఏమైనా ఉంటే తినడానికి పెట్టు.. నేనీ దేశపు మహారాజును’ అన్నాడు రాజు. ‘మహారాజా...! మీరు తినదగ్గవి మా దగ్గర ఏముంటాయి?’ అంది అవ్వ. ‘ఏదో ఒకటి ఇవ్వు.. కడుపు కాలి పోతోంది’ అన్నాడు రాజు. మహారాజుకు ముంతతో నీరందించింది అవ్వ. అవి తాగాక ఒక అరటి ఆకులో కొద్దిగా వెదురు బియ్యంతో చేసిన అన్నం, బలుసాకు పచ్చడి వేసి అందించింది. ఆకలి మీద ఉన్న మహారాజు, దాన్ని ఆబగా తిన్నాడు. మరి కొంత వడ్డించింది అవ్వ. అది కూడా తిని ‘ఇంత రుచిగల భోజనం నేనింత వరకు తినలేదు’ అంటూ అవ్వకు తన దగ్గర ఉన్న హారం బహుమతిగా ఇచ్చాడు. ‘మహారాజా..! నేను మీకు వడ్డించింది గొప్ప పదార్థాలేమీ కావు’ అంది అవ్వ. ఈ లోపుగా మంత్రి, సైనికులను తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. ‘మహారాజా! మీరు దారి తప్పడంతో చాలా ఆందోళన పడ్డాం. దొరికారు సంతోషం రండి’ అన్నాడు. రాజు అవ్వకు కృతజ్ఞతలు చెప్పి బయలు దేరాడు.

ఆ రోజంతా రాజుకు అవ్వ చేసిన బలుసాకు పచ్చడే జ్ఞాపకం వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే ఫలహారాలు అయ్యాక, కొందరు సైనికులను పిలిచి, ఆ అవ్వను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వారు అవ్వను సాదరంగా తీసుకు రాగా ‘మహారాణీ..! ఆ అవ్వ చేసిన పచ్చడి రుచి నేనింత వరకు మరెక్కడా చూడలేదు’ అంటూ ఆమెతో మళ్లీ ఆ పచ్చడి చేయించాడు రాజు. అందరికీ వడ్డించగా.. ‘ఛీ ఛీ.. ఇదేం పచ్చడి? గడ్డిలా ఉంది’ అంది మహారాణి. ‘అవును.. నిన్న చేసిన దానిలా లేదే’ అన్నాడు రాజు కూడా.
వెంటనే మంత్రి కలగచేసుకుని ‘మహారాజా..! అవ్వ నిన్న చేసిన పచ్చడి, ఈ రోజు చేసిన పచ్చడి ఒకటే. అయితే నిన్న మీరు మహా ఆకలి మీద ఉన్నారు. అందువల్ల మీకు అది చాలా రుచిగా అనిపించింది. కానీ ఈ రోజు.. ఫలహారాలు తిని ఏ పనీ చేయకుండా కూర్చున్నాం. అందువల్ల పెద్దగా ఆకలి లేదు. దానివల్ల ఆ పచ్చడి రుచిగా లేదు. అంతేగానీ అవ్వ చేతిలో గానీ, ఆమె చేసిన పచ్చడిలో గానీ ఏమార్పూ లేదు’ అన్నాడు.

అప్పుడు రాజుకు వారం రోజుల క్రితం మంత్రి.. ‘ఆకలి రుచి ఎరుగదు’ అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘మంత్రివర్యా! మీరన్న మాట నిజమే! నిన్న నేను చాలా అలసి పోయి, మంచి ఆకలి మీద ఉన్నాను. అందువల్ల అవ్వ చేసిన ఆ పచ్చడి, అన్నం ఎంతో రుచిగా అనిపించాయి. ఇందులో అవ్వ చేసిన తప్పేమీ లేదు’ అంటూ ఆమెకు సరిపడా సరకులు ఇచ్చి పంపాడు రాజు. ప్రతి విషయాన్ని పరిశీలించి మాట్లాడే మంత్రిని మరోసారి అభినందించాడు రాజు. అయితే ఈ విషయం అనుభవపూర్వకంగా తెలియచెప్పడానికే అడవిలో తెలివిగా దారి తప్పించింది మంత్రే అనే విషయం మాత్రం రాజుకు తెలియనే లేదు.

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని