కుందేలు ఉపాయం

అది మంచి ఎండాకాలం. ఉదయాన్నే ఆహారసేకరణకు బయలుదేరింది నక్క. దారిలో పొరపాటున ఓ గోతిలో పడింది. అతికష్టమ్మీద ఎలాగోలా బయట పడింది కానీ దాని కాలికి గాయమయింది. కాలి వైపు చూసుకుని ‘బాగా వాచింది. ఎముక చిట్లిందేమో వైద్యం చేయించుకోవాలి’ అనుకుంటూ కాలును ఈడ్చుకుంటూ వెళుతోంది.

Updated : 25 Dec 2021 03:14 IST

ది మంచి ఎండాకాలం. ఉదయాన్నే ఆహారసేకరణకు బయలుదేరింది నక్క. దారిలో పొరపాటున ఓ గోతిలో పడింది. అతికష్టమ్మీద ఎలాగోలా బయట పడింది కానీ దాని కాలికి గాయమయింది. కాలి వైపు చూసుకుని ‘బాగా వాచింది. ఎముక చిట్లిందేమో వైద్యం చేయించుకోవాలి’ అనుకుంటూ కాలును ఈడ్చుకుంటూ వెళుతోంది.

దారిలో నక్కకు ఓ కుందేలు ఎదురైంది. నక్కను పరామర్శించి విషయం తెలుసుకుని జాగ్రత్తలు చెప్పింది. కుందేలు వెళ్లాక.. ‘ఇది కూడా నాకు జాగ్రత్తలు చెబుతోంది. పైగా తను తింటున్న దుంప కొద్దిగైనా పెట్టలేదు. దీని సంగతి చెబుతాను’ అనుకుంటూ.. నేరుగా సింహం దగ్గరకు వెళ్లింది. ‘ఏంటి ఇలా వచ్చావు. కుంటుతూ నడుస్తున్నావేంటి?’ అని అడిగింది సింహం. ‘ఏం చెప్పమంటారు రాజా! అంతా నా ఖర్మ, లేచిన వేళా విశేషం. ఒక పాపిష్టిదాని ముఖం చూశాను. ఇలా అయ్యాను’ అని నీరసంగా చెప్పింది నక్క.

‘ఇటు కూర్చుని ఏం జరిగిందో ప్రశాంతంగా చెప్పు’ అంటూ సింహం ఒక రాయిని చూపించింది. ‘ఉదయాన్నే కుందేలు ముఖం చూశాను. అందుకే ప్రమాదంలో ఇలా కాలు విరగ్గొట్టుకున్నాను’ అంటూ తన కాలుని చూపించింది నక్క. అంతలో సింహంతో మాట్లాడేందుకు తోడేలు వచ్చింది. అది నక్క స్నేహితుడే! కాబట్టి చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పి తోడేలుకు కనుసైగ చేస్తూ ‘తోడేలు అన్నయ్యా.. ఉదయాన్నే కుందేలు ముఖం చూస్తే ఏం జరుగుతుందో నువ్వూ చెప్పు’ అంది. ‘కుందేలు ముఖం ఏ మాత్రం మంచిది కాదు. ఒక్కసారి దాని ముఖం చూసి.. చావు వరకూ వెళ్లి వచ్చాను’ అని నక్క మాటలకు వంత పాడింది తోడేలు. అప్పుడు సింహం ‘ అవునా! సరే.. నేను కుందేలును పిలిచి విచారిస్తానులే. మీరిక వెళ్లిరండి’ అంది. సింహం గంభీరంగా చెప్పడంతో రెండూ అక్కణ్నుంచి వెళ్లిపోయాయి.

మరుసటిరోజు సింహం కుందేలును పిలిచింది. ‘మహారాజా.. దేనికి పిలిపించారు? నాతో ఏదైనా పని ఉందా? కుందేలు వినయంగా అంది. ‘నీ ముఖం చూస్తే అరిష్టమని అడవంతా అనుకుంటోంది..’ అని సింహం అంటున్న సమయంలో నక్క అక్కడికి కాళీడ్చుకుంటూ వచ్చింది. ‘నా కాలి ఎముక విరగడానికి కారణం ఇదే! ఉదయాన్నే దీని ముఖం చూసి కాలు విరగ్గొట్టుకున్నాను’ అని ఏడుపు ముఖంతో చెప్పింది నక్క. ‘అంతా అబద్దం.. అసలు ఆ రోజు నన్ను పలకరించేటప్పటికే నక్క కాలు విరిగి ఉంది’ అని కుందేలు చెప్పింది. అప్పుడే తోడేలు అక్కడికి వచ్చింది. ‘నక్క చెప్పేదే నిజం’ అంటూ మరోసారి నక్కకు మద్దతుగా మాట్లాడింది. ‘నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను. అది వీరికి నచ్చనట్లుంది. అందుకే అకారణంగా నా మీద నింద వేస్తున్నారు’ అని ఏడుపు ముఖంతో చెప్పింది కుందేలు.

సింహం కాసేపు ఆలోచించి.. ‘కుందేలు తప్పు లేదనిపిస్తోంది’ అనుకుంది. నక్క, తోడేలు ఒకే మాటమీద ఉండటం వల్ల సింహం ఏమీ చెప్పలేకపోయింది. కుందేలు కళ్లు మూసుకుని ‘సింహం నాకు ఏదో ఒక శిక్ష విధించడం ఖాయం’ అనుకుంది. ఇంతలో పెద్ద ఎదురుగాలి వచ్చి.. పక్కనే గుట్ట మీద ఉన్న గులకరాళ్లు దొర్లి కిందకు వచ్చాయి. అలా వచ్చే క్రమంలో ఒకదాన్ని మరొకటి రాసుకుని నిప్పు రవ్వలు లేచాయి. అప్పటికే ఆ ప్రాంతమంతా ఈదురుగాలుల వల్ల ఎండుటాకులు పోగుబడ్డాయి. వాటిపై నిప్పు రవ్వలు పడి క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. దాంతో.. సింహం, కుందేలు, నక్క, తోడేలు మంటల మధ్యలో చిక్కుకున్నాయి. గట్టి ప్రయత్నం చేసి.. అతికష్టం మీద తప్పించుకోగలిగాయి.

అప్పుడే కుందేలుకు ఓ ఉపాయం తోచింది. వెంటనే.. ‘రాజా.. ప్రకృతిలో మార్పు వల్ల ఈ ప్రమాదం వచ్చింది. దీనికి మనమెవరమూ కారణం కాదు కదా! అలాగే నక్కకు అనుకోకుండా ప్రమాదం జరిగితే దానికి నేను ఎలా కారణమవుతాను? గోతిని గమనించకుండా అడుగు వేయడం నక్క తప్పే కదా?’ అంది కుందేలు. అది విన్న సింహానికి  కుందేలు చెప్పింది వాస్తవమనిపించింది. నక్కను తోడేలునూ అడవినుంచి తరిమేసింది. అప్పట్నుంచి  మూఢనమ్మకాలకు చోటివ్వకుండా అడవిని ఏలింది సింహం.

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని