కావ్‌..కావ్‌.. కాకి!

తన ఇంటి ముందున్న వేప చెట్టుపై కాకి అదే పనిగా అరవడం ఆసక్తిగా గమనించాడు చిన్నారి హరిణయ్‌. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే పక్షుల కదలికలను దగ్గరగా ఉండి చూస్తుంటాడు. వాటిని అనుకరిస్తూ, వాటితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు కాకి అదేపనిగా అరుస్తుండటంతో, కాకికి ఏదో కష్టం వచ్చిందని హరిణయ్‌కు అర్థమైంది. దాని కష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు.

Updated : 03 Jan 2022 06:20 IST

న ఇంటి ముందున్న వేప చెట్టుపై కాకి అదే పనిగా అరవడం ఆసక్తిగా గమనించాడు చిన్నారి హరిణయ్‌. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే పక్షుల కదలికలను దగ్గరగా ఉండి చూస్తుంటాడు. వాటిని అనుకరిస్తూ, వాటితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు కాకి అదేపనిగా అరుస్తుండటంతో, కాకికి ఏదో కష్టం వచ్చిందని హరిణయ్‌కు అర్థమైంది. దాని కష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు.

చెట్టుకు మరికాస్త దగ్గరకు వెళ్లి పరిసరాలను పరిశీలించాడు. చెట్టు కొమ్మలపై ఒక పాము ఉండటాన్ని చూశాడు హరిణయ్‌. కాకి గూట్లో ఉన్న గుడ్లను తినడానికి ఓ పాము ప్రయత్నం చేస్తోంది. దాని ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం కాకి అరుస్తోంది. కానీ కాకి అరుపులకు పాము భయపడటం లేదు. జరజర పాకుతూ గూడును అందుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.

ఇంకా ఎక్కువసేపు ఉంటే కాకి గుడ్లు పాముకు ఆహారం అవడం ఖాయం. అందుకు ఓ పొడవైన కర్రతో పామును బెదరగొట్టబోయాడు హరిణయ్‌. ఇంట్లో అమ్మానాన్నలను కూడా రమ్మని గట్టిగా కేకలు వేశాడు. వారు కూడా పామును వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి పాము బెదిరిపోయింది. అది తన గమ్యాన్ని మార్చుకుని చెట్టు నుంచి కిందకు దిగి బయట ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. కాకికి ఆందోళన తగ్గి, హరిణయ్‌ వైపు కృతజ్ఞతగా చూసింది. దాంతో హరిణయ్‌కు సంతోషంగా అనిపించింది.

కొన్ని రోజులు గడిచాయి. హరిణయ్‌కు ఇంటి ముందు వరండాలో హోమ్‌వర్క్‌ చేసుకోవడం అలవాటు. ఎప్పట్లాగే బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్‌వర్క్‌ చేసుకుంటున్నాడు. ఇంతలో కాకి గుడ్ల కోసం వచ్చే పాము అక్కడక్కడే తిరుగుతూ హరిణయ్‌ బ్యాగ్‌లోకి దూరింది. ఇది గమనించని హరిణయ్‌, హోమ్‌వర్క్‌ అవగానే బ్యాగును ఇంట్లోకి తీసుకు వెళ్లాడు. ఇదంతా కాకి గమనించింది. అది అరుస్తూ హెచ్చరిక చేస్తున్నా... ఎవరూ దాని అరుపులను పట్టించుకోలేదు. ఆరోజు రాత్రి బ్యాగులో నుంచి పాము బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ బ్యాగు మూసి ఉండటం వల్ల రాలేకపోయింది.

తెల్లవారింది. హరిణయ్‌ స్కూలుకు వెళ్లొస్తానని అమ్మకు చెప్పి, బ్యాగు తగిలించుకుని బయలుదేరాడు. హరిణయ్‌ను చూసిన కాకి మళ్లీ అరవడం మొదలు పెట్టింది. కాకి ఎందుకు అరుస్తుందో హరిణయ్‌కు అర్థం కాలేదు. కానీ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుందని మాత్రం అర్థమైంది. స్కూలుకు ఆలస్యం అవడంతో సరే తర్వాత చూద్దాం అనుకుని నడక సాగించాడు.

కాకి తన ప్రయత్నాన్ని మానుకోలేదు. సహచర కాకులను వెంటేసుకుని హరిణయ్‌ను అనుసరించింది. ఒక్కసారిగా కాకుల గుంపు తనను వెంబడించడం చూసి ఆశ్చర్యపోయాడు హరిణయ్‌. కాకుల గుంపు పెద్దగా అరుస్తూ స్కూలు బ్యాగును పొడుస్తూ ఉన్నాయి. అక్కడున్న వారందరూ ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. కాకుల అరుపునకు రకరకాల కారణాలు చెప్పుకొంటున్నారు. అక్కడే ఉన్న ఓ పెద్దాయన ‘బాబూ..! ఆ బ్యాగులో ఏదో ఉంది అన్న విషయాన్ని అవి చెప్పాలనుకుంటున్నాయి’ అన్నాడు. హరిణయ్‌ వెంటనే బ్యాగును కింద పడేశాడు. కిందకు వేయడం వల్ల బ్యాగు గుండీలు ఊడిపోయి పుస్తకాలన్నీ చెల్లాచెదురు అయ్యాయి. అప్పటిదాకా బ్యాగులో నక్కిన పాము జరజరా పాకుతూ బయటకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు.

హరిణయ్‌ భయపడ్డాడు. అందరూ పాము.. పాము.. అంటూ అరిచారు. అది బెదిరిపోయింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటిదాకా అక్కడే ఉన్న కాకుల గుంపు వెళ్లిపోయింది. తన ఇంటి చెట్టుపై నివాసం ఉంటున్న కాకి మాత్రం అక్కడే ఉంది. దాని కళ్లలో ప్రశాంతత కనిపించింది హరిణయ్‌కు. కాకి వైపు కృతజ్ఞతగా చూశాడు. ‘ఏ పాము నుంచి అయితే నీ పిల్లలను కాపాడానో.. అదే పాము నుంచి నన్ను కాపాడావు. ధన్యవాదాలు’ అంటూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పాడు హరిణయ్‌. కాకి తన గూటికి తిరిగి వెళ్లిపోయింది. హరిణయ్‌ సంచీ సర్దుకుని స్కూలుకు వెళ్లి, ఇంటికి తిరిగి రాగానే జరిగిన విషయం అమ్మానాన్నలకు చెప్పాడు. వాళ్లు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాకి చేసిన సాయం వల్ల తమ కుమారుడి ప్రాణాలు దక్కాయి అని సంతోషించారు. ఆ తర్వాత కాకితో హరిణయ్‌ స్నేహం మరింత బలపడింది.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని