శిష్యా.. నదికి పోలేదేం?

పూర్వం ఒక గురువు తన ఆశ్రమంలో శిష్యులకు పలు రకాల పరీక్షలు పెట్టి వారిని మెరికలుగా తీర్చిదిద్దేవాడు. ఒకసారి గురువు.. ‘శిష్యులారా! ఇక్కడకు దగ్గర్లోనే ఉన్న నదిలో నా పంచె ఒకటి గంటక్రితం కొట్టుకొనిపోయింది. మీలో ఎవరైనా ఆ పంచెను నాకు తెచ్చి ఇస్తే, ఆ శిష్యుణ్ని తెలివైన వాడిగా ప్రకటిస్తా’ అన్నాడు.

Published : 18 Jan 2022 01:32 IST

పూర్వం ఒక గురువు తన ఆశ్రమంలో శిష్యులకు పలు రకాల పరీక్షలు పెట్టి వారిని మెరికలుగా తీర్చిదిద్దేవాడు. ఒకసారి గురువు.. ‘శిష్యులారా! ఇక్కడకు దగ్గర్లోనే ఉన్న నదిలో నా పంచె ఒకటి గంటక్రితం కొట్టుకొనిపోయింది. మీలో ఎవరైనా ఆ పంచెను నాకు తెచ్చి ఇస్తే, ఆ శిష్యుణ్ని తెలివైన వాడిగా ప్రకటిస్తా’ అన్నాడు. వెంటనే శిష్యులు ఒకరి వెంట మరొకరు నదీ తీరానికి పరిగెత్తారు.

కశ్యపుడు అనే శిష్యుడు మాత్రం నదికి పోకుండా అక్కడే ఆగిపోయాడు. గురువుగారు అతడిని ‘నువ్వెందుకు వెళ్లలేదు’ అని ప్రశ్నించాడు. ‘గురువుగారూ! ప్రవహించే నదిలో గంట క్రితం మీ పంచె కొట్టుకొని పోయిన తర్వాత ఎలా దొరుకుతుందండీ! ఇది అసాధ్యం. మీరు గంటసేపు ఆ పంచెకోసం ఆగిన తర్వాత కూడా అది ఎవరికీ దొరకలేదంటే.. ఇక అది దొరకదని అర్థం. అందుకే నేను పోలేదు’ అన్నాడు.

కొద్దిసేపు అయిన తర్వాత శిష్యులు వచ్చి ‘గురువుగారూ! ఎంత వెతికినా ఆ పంచె దొరకలేదండి. చీకటి పడుతోందని ఇప్పుడు వచ్చాం. రేపు ఉదయాన్నే మళ్లీ వెళ్లి వెతుకుతాం’ అని అన్నారు. అప్పుడు గురువుగారు ‘నేను చెప్పిన మాటలు విని మీరు ఏమీ ఆలోచించకుండా ఒకరి వెనుక మరొకరు వెంటనే పరిగెత్తారు. నదీ ప్రవాహంలో గంటక్రితం కొట్టుకొనిపోయిన పంచె ఎలా దొరుకుతుంది! ఏది పడితే అది గుడ్డిగా నమ్మకూడదు. ఇదిగో! ఈ కశ్యపుని చూడండి. అది దొరకదని ఆ నదీ ఛాయలకే పోలేదు. అందుకే ప్రశ్నను సరిగా అర్థం చేసుకోవాలి’ అన్నాడు. శిష్యులు సరే అన్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు గురువుగారు.. ‘శిష్యులారా! మన ఊరి పొలిమేరల్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకున్న పండ్లను చేతితో తెంపకుండా, కర్ర, రాయితో కొట్టకుండా, భూమిపైన ఆ పండ్లు పడకుండా, ఇతరుల సాయం లేకుండా నాకు తెచ్చి ఇవ్వాలి’ అని అన్నాడు. శిష్యులు ఆ పరీక్ష విని ముక్కు మీద వేలు వేసుకున్నారు. ‘గురువర్యా! ఇది అసాధ్యం’ అని అంటూ అక్కణ్నే ఉండి పోయారు. కానీ కశ్యపుడు లేచి ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్లాడు.

అతడు ఆ పండ్లను ఎలా తెస్తాడో చూద్దామని శిష్యులందరూ.. అతని వెంటే ఒకరి వెనక మరొకరు ఆత్రుతగా వెళ్లారు. కశ్యపుడు ఆ మామిడిచెట్టు కింద ఆ పండ్లు పడే ప్రాంతంలో ఒక విశాలమైన వస్త్రాన్ని పరిచి ఆ చెట్టు ఎక్కి కొమ్మను ఊపాడు. కొన్ని పండ్లు రాలి వస్త్రం మీద పడ్డాయి. వెంటనే కశ్యపుడు చెట్టు దిగి ఆ వస్త్రాన్ని నలువైపులా మడిచి తన చేత పట్టుకుని వాటిని గురువుగారికి సమర్పించాడు.

గురువు అతని తెలివితేటలకు ఎంతో సంతోషించాడు. కశ్యపుని ఉత్తమ శిష్యుడిగా ప్రకటించాడు. ‘మీరు కూడా కశ్యపునిలా తార్కికంగా, తెలివిగా ఆలోచించాలి. గురువుగారు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవాలి. ఎక్కడికీ పోకుండా ఇక్కడే ఉండి నా ప్రశ్నే తప్పు అని కూడా అనుకోకూడదు’ అని గురువు మిగతా శిష్యులకు వివరించి చెప్పాడు. ఆ మాటలకు మిగతా శిష్యులందరూ ‘సరే గురువుగారూ!’ అని తలలూపారు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని