Updated : 20 Jan 2022 00:48 IST

సరైన మందు

నంతదుర్గానికి రాజు మహాదేవుడు. రాజ్యాన్ని ఎంతో చక్కగా పాలించేవాడు. ఆ మధ్య రాజు భార్య తేజోవతి మరణించింది. భార్య అంటే రాజుకు ఎంతో ప్రేమ. ఆమె మరణంతో రాజు తల్లడిల్లిపోయాడు. రాజ్యపాలనను మంత్రిపై వదిలేశాడు. భార్యనే తలుచుకుంటూ కుంగిపోసాగాడు. ఈ క్రమంలో చిక్కిశల్యం కాసాగాడు. రోజురోజుకు అతని ఆరోగ్యం క్షీణించసాగింది.

మంత్రి సుబుద్ధి రాజుకు అత్యంత విధేయుడు. రాజుగారి పరిస్థితి చూసి ఎంతో విచారించాడు. వారు ఎన్నో విధాలుగా వైద్యం చేశారు. అయినా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు.

రాజవైద్యులను మంత్రి సుబుద్ధి ఏకాంతంగా కలుసుకున్నాడు. రాజుగారి వ్యాధి గురించి అడిగాడు. ‘మనోవ్యాధికి మందులేదు’ అని చెప్పారు రాజవైద్యులు. రాజు ఆరోగ్యం బాగుచేసిన వారికి పెద్దమొత్తంలో బహుమతి ప్రకటించాడు మంత్రి సుబుద్ధి. ఆ రాజ్యంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండే వివేకుడు అనే వైద్యుడికి ఆ ప్రకటన గురించి తెలిసింది. మంత్రి సుబుద్ధిని కలిసి ‘నేను రాజుగారికి వైద్యం చేస్తాను. అరవై రోజుల్లో ఆయన్ను మామూలు మనిషిని చేస్తాను’ అన్నాడు.
రాజును కలుస్తూనే ‘మీకు ఏ అనారోగ్యమూ లేదు మహారాజా’ అంటూ మొదలుపెట్టాడు వివేకుడు. అతని మాటలు రాజుకు నచ్చాయి. ఇంతలో రాజు చేయి చూసి.. ‘ప్రభూ.. మీకున్న అనారోగ్యం అసలు అనారోగ్యమే కాదు. అసలైన పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. ఈరోజు నుంచి కచ్చితంగా అరవయ్యో రోజు మన రాజ్యంపైకి శత్రురాజ్య కూటమి దండయాత్ర చేస్తుంది. మీరు ఓడిపోతారు. రాజ్యం సర్వనాశనం అవుతుంది. పెద్దసంఖ్యలో ప్రజలు మరణిస్తారు. ఇది తథ్యం’ అన్నాడు వివేకుడు.

రాజుకు పట్టరాని కోపం వచ్చింది. ‘నువ్వు చెప్పినట్లు శత్రురాజ్య కూటమి మన దేశం మీదకు దండయాత్రకు రాకపోతే అరవై ఒకటో రోజు నిన్ను ఉరి తీయిస్తాను’ అన్నాడు రాజు. ఇక ఆరోజు నుంచి.. రాజు,  రాజ్యకార్యకలాపాల్లో పూర్తిగా మునిగిపోయాడు. గూఢచారులతో మాట్లాడటం మొదలు పెట్టాడు. శత్రురాజ్యాల సమాచారాన్ని సేకరించాడు. రాజ్యం చుట్టూ ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించాడు. అలాగే యుద్ధం వస్తే ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనే విషయం మీద సమాలోచనలు, సైన్యాన్ని పటిష్టం చేయడం, ఇటువంటి కార్యక్రమాలతో రోజూ క్షణం తీరిక లేకుండా గడపసాగాడు మహాదేవుడు.

ఇలా అరవై రోజులు గడిచిపోయాయి. ఎటువంటి శత్రుదేశాల కూటమి కూడా దండెత్తిరాలేదు. అరవై ఒకటో రోజున వివేకుడిని పిలిపించాడు రాజు. ‘నీ జ్యోతిష్యం తప్పైంది. తప్పుడు సమాచారం చెప్పి మమ్మల్ని ఆందోళనకు గురి చేశావు. కాబట్టి నీకు మరణశిక్ష విధిస్తున్నా’ అన్నాడు రాజు.

‘నా మరణశిక్ష సంగతి సరే మహారాజా! ఒకసారి మీరు ఎంత ఆరోగ్యంగా తయారయ్యారో, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి’ అన్నాడు వివేకుడు. అద్దంలో తనను తాను చూసుకున్న మహాదేవుడు, ఎంతో ఆశ్చర్యపోయాడు. తను పూర్తి ఆరోగ్యవంతుడిగా మారాడు. దీంతో మరణశిక్ష రద్దు చేస్తున్నా అని ప్రకటించాడు.

‘క్షమించండి మహారాజా.. మరుపు, మనసును మళ్లించడం అనేవి లేకపోతే మనిషి బతకలేడు. మీ భార్య మరణంతో మీరు కుంగిపోయారు. ఆమె జ్ఞాపకాల నుంచి మీ మనసును మళ్లించడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి శత్రురాజ్య కూటమి మన దేశం మీదకు దండెత్తి రాబోతోందని మీకు చెప్పాను. ఇప్పుడు ఇది అబద్ధమే కావొచ్చు. కానీ మీరు అలాగే రాజ్యాన్ని పట్టించుకోకుండా ఉండిపోతే... ఏదో ఒక రోజు నిజమయ్యేది’ అన్నాడు వివేకుడు.

విషయం అర్థం చేసుకున్న మహారాజు వివేకుని తెలివిని ఎంతగానో మెచ్చుకున్నాడు. సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. విలువైన బహుమతులు ఇచ్చాడు. మహాదేవుడు మళ్లీ మామూలు మనిషి అయినందుకు.. మంత్రి సుబుద్ధి ఎంతో ఆనందించాడు.   

- కళ్లేపల్లి తిరుమలరావు


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని