లౌక్యం

ఇంట్లో కరెంట్‌ ఇస్త్రీ పెట్టె కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో స్కూల్‌ యూనిఫాం వంటి వాటిని ఇస్త్రీ చేయడానికి అని కొన్నది అది. అందుకే బాధపడుతోంది అమ్మాజీ. ఇరుగుపొరుగు వారెవరో అడిగితే ఇచ్చినట్లు గుర్తు. కానీ ఎవరికి ఇచ్చిందో ఆమెకు జ్ఞాపకం లేదు. ఎవరూ తిరిగి ఇవ్వనూలేదు. అప్పటికీ కొందరిని అడిగింది కూడా! వాళ్లెవరూ తమకు ఇవ్వలేదు అనే చెప్పారు. ఆ విషయం తెలిసి ఆమె భర్త ‘అందుకే.. అడగ్గానే ఎవరికి బడితే వాళ్లకు ఇవ్వొద్దు అనేది’

Published : 23 Jan 2022 04:17 IST

ఇంట్లో కరెంట్‌ ఇస్త్రీ పెట్టె కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో స్కూల్‌ యూనిఫాం వంటి వాటిని ఇస్త్రీ చేయడానికి అని కొన్నది అది. అందుకే బాధపడుతోంది అమ్మాజీ.

ఇరుగుపొరుగు వారెవరో అడిగితే ఇచ్చినట్లు గుర్తు. కానీ ఎవరికి ఇచ్చిందో ఆమెకు జ్ఞాపకం లేదు. ఎవరూ తిరిగి ఇవ్వనూలేదు. అప్పటికీ కొందరిని అడిగింది కూడా! వాళ్లెవరూ తమకు ఇవ్వలేదు అనే చెప్పారు. ఆ విషయం తెలిసి ఆమె భర్త ‘అందుకే.. అడగ్గానే ఎవరికి బడితే వాళ్లకు ఇవ్వొద్దు అనేది’ అని అమ్మాజీ మీద చిరాకు పడసాగాడు.

ఆ మాటలు విన్న వాళ్ల అబ్బాయి సురేష్‌ ‘నాన్నగారూ! మీరే కదా ఇతరులకు అవసరాల్లో ఆదుకోవాలి’ అని చెబుతూ ఉంటారు. ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? అదీగాక ఎదుటి వారికి చెప్పడమే కాదు.. మనం ఆచరించినప్పుడే వాటి విలువ పెరిగేది’ అని కూడా మీరే చెబుతుంటారు. ఇప్పుడు అలా చేసినందుకు అమ్మను మందలిస్తున్నారెందుకు?’ అని ప్రశ్నించాడు. ఆ మాటకు ఆయన జవాబివ్వలేదు.

సురేష్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు. వాస్తవ దృక్పథం, సూక్ష్మపరిశీలన ఉన్నవాడు. ఏదైనా సమస్య వస్తే సతమతం అవడానికి బదులు.. సూక్ష్మబుద్ధితో ఆలోచించి పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా వాళ్ల నాన్న ఇచ్చిన తర్ఫీదే! సమయం చిక్కినప్పుడల్లా జీవన గమనానికి అవసరమైన మంచి విషయాలు చెబుతూ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే గతంలో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి సురేష్‌కు. అవేంటంటే.. కొందరు తమకు అవసరమై తీసుకు వెళ్లిన వస్తువును అవసరం తీరిపోయాక తిరిగి ఇవ్వరు. దానికి రెండు కారణాలు.. అవసరం తీరిపోయిన తర్వాత దానిమీద అంతగా శ్రద్ధ లేకపోవడం మొదటిది. ఇక రెండోది.. ఆ వస్తువు కాస్త విలువైనది, తమకు తరచూ ఉపయోగపడేది అయితే ఇవ్వడం ఆలస్యం చేస్తారు. అప్పుడు ఇచ్చిన వాళ్లు ఆ వస్తువు సంగతి మరిచిపోతారు కదా ఉంచేసుకోవచ్చని ఆలోచించేవారూ ఉంటారు. అందుకే తన కొడుకు సురేష్‌కు ఎప్పుడూ.. ‘ఇలాంటి విషయాల్లో మనం క్రమశిక్షణతో ఉండాలి. ఎవరి వస్తువైనా అవసరమై తెస్తే వెంటనే ఇచ్చేయాలి అని చెబుతూ’ ఉంటాడు.

‘అమ్మా! నువ్వేమీ కంగారు పడకు. గంటలో మన ఇస్త్రీ పెట్టె మన ఇంట్లో ఉంటుంది’ అంటూ బయటకు వెళ్లాడు సురేష్‌. అతడు అన్నట్టుగానే గంటలో ఇస్త్రీ పెట్టెతో తిరిగి వచ్చాడు.

తల్లీ తండ్రి ఆశ్చర్యపోయి.. ఎలా వచ్చింది? ఎవరి దగ్గరుంది? లాంటి ప్రశ్నలు వేశారు. ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా ‘అమ్మా! నువ్వు అందరినీ ఏమని అడిగావు’ అని ప్రశ్నించాడు. ఆ మాటకు అమ్మాజీ ‘మా ఇస్త్రీ పెట్టెగానీ ఏమైనా తెచ్చారా?’ అని అడిగాను అని జవాబిచ్చింది. ఇప్పుడు వాళ్ల నాన్న వైపు తిరిగి ‘నాన్నగారూ! ఆ మధ్య ‘లౌక్యం అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగాను. జ్ఞాపకం ఉందా?’ అని అడిగాడు. ‘ఔను. ఇతరులను నొప్పించకుండా మనకు అనుకూలంగా పనులు జరిపించుకోవడమే లౌక్యం. దీని అసలు రూపం ‘లౌకికం’. అంటే లోకంలో నడుచుకునేందుకు మనం అవలంభించే సులభమైన పద్ధతి. క్రమంగా లౌకికమే లౌక్యంగా మారిపోయింది’ అన్నాడు వాళ్ల నాన్న.

‘ఇప్పుడు నేను చేసింది కూడా అదే అన్నాడు’ సురేష్‌. ‘అంటే..’ అని తల్లితండ్రులిద్దరూ ప్రశ్నించారు. ‘లౌక్యం ప్రదర్శించాను’ సురేష్‌ జవాబు. ‘ఎలా?’ అని అడిగాడు తండ్రి. నేను వెళ్లిన ఇళ్ల వాళ్లను అమ్మ అడిగిన విధంగా అడగలేదు. అలా అడిగితే మనకు జ్ఞాపకం లేదని గ్రహించి.. లేదని జవాబు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే అలా కాకుండా ‘మొన్న మా ఇస్త్రీ పెట్టె మీరు తీసుకుని వచ్చారు కదా? దాని పని అయిపోతే ఇవ్వగలరా?’ అని అడిగాను. ఆ మాటలు విని నిజంగా తీసుకు వెళ్లని వాళ్లు.. ‘మేం తీసుకుని రాలేదే’ అని బదులిచ్చారు. వారు జవాబు చెప్పిన తీరులో నిజాయతీని కనిపెట్టాను. కానీ కాంతమ్మ ఆంటీ మాత్రం.. మొదట తీసుకురాలేదే అన్నారు. ఆమె ముఖంలో తడబాటును గుర్తించాను. అందుకే మరో చీకటి బాణం వేశాను. ‘సారీ ఆంటీ.. ఆ రోజు మా అమ్మ ఇస్త్రీ పెట్టె ఇస్తున్నప్పుడు నేను స్కూలుకు తయారవుతూ ఆ పక్క గదిలోనే ఉన్నాను. మీ మాటల్లానే వినిపించాయి. అందుకే మీరే అనుకుని అడిగాను. ఇలా అడిగానని ఏమీ అనుకోకండేం’ అన్నాను. ఆ మాటతో ఏమనుకున్నారో ఏమో.. ‘ఉండు.. ఇంట్లో ఉందేమో చూస్తాను’ అని లోపలికి వెళ్లి ఇస్త్రీ పెట్టెతో తిరిగి వచ్చారు. దీన్ని ఇస్తూ.. ‘ఇచ్చేశానని అనుకున్నాను. ఇలా జరిగినందుకు మీ అమ్మను ఏమనుకోవద్దని చెప్పు’ అన్నారు.. అంటూ చెప్పుకొచ్చాడు.

‘ఓరి భడవా! నువ్వు లౌక్యం బాగానే ఒంట బట్టించుకున్నావే’ అని నవ్వుకున్నారంతా

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని