ఎవరి గొప్ప వారిదే!

పిచ్చుక, గిజిగాడు పిట్ట కలిసి చిట్టడవిలోని ఓ చెట్టుపై నివాసం ఉండేవి. ఒకరోజు జోరుగా వర్షం పడుతుండగా.. ‘ఎన్నాళ్లిలా గాలికి, వానకు తడుస్తూ ఉంటాం. చెరొక గూడూ కట్టుకుందాం’ అంది గిజిగాడు. ‘అవును. నాకూ అదే అనిపిస్తోంది’ అంటూ తడిసిన మరుసటి రోజే గడ్డిపోచలు, ఎండు పుల్లలతో ఓ భారీ వృక్షం చిటారు కొమ్మన గిజిగాడు.. కొమ్మలు, ఆకుల మధ్యలో పిచ్చుక గూడు కట్టేశాయి. ఈ విషయం మిగతా పక్షులకు తెలిసింది....

Updated : 11 Feb 2022 06:30 IST

పిచ్చుక, గిజిగాడు పిట్ట కలిసి చిట్టడవిలోని ఓ చెట్టుపై నివాసం ఉండేవి. ఒకరోజు జోరుగా వర్షం పడుతుండగా.. ‘ఎన్నాళ్లిలా గాలికి, వానకు తడుస్తూ ఉంటాం. చెరొక గూడూ కట్టుకుందాం’ అంది గిజిగాడు. ‘అవును. నాకూ అదే అనిపిస్తోంది’ అంటూ తడిసిన రెక్కల్ని విదిలిస్తూ అంది పిచ్చుక.

మరుసటి రోజే గడ్డిపోచలు, ఎండు పుల్లలతో ఓ భారీ వృక్షం చిటారు కొమ్మన గిజిగాడు.. కొమ్మలు, ఆకుల మధ్యలో పిచ్చుక గూడు కట్టేశాయి. ఈ విషయం మిగతా పక్షులకు తెలిసింది. ‘మనమందరం వెళ్లి అవి గూళ్లు ఎలా కట్టుకున్నాయో చూసొద్దాం పదండి’ అంది వడ్రంగి పిట్ట. సరేనంటూ మిగతావీ దానివెంటే తుర్రుమని ఎగిరాయి.

చెట్టు దగ్గరకు వచ్చిన పక్షులకు గిజిగాడు కట్టుకున్న గూడు తెగ నచ్చేసింది. చిటారు కొమ్మన వేలాడుతూ అబ్బురపరిచేలా ఉందా గూడు. ఆశ్చర్యంగా చూస్తూ... పక్షులన్నీ దాని చుట్టే తిరగసాగాయి. తన గూడు దగ్గరకు ఒక్కటీ రాకపోవడంతో ‘ఇవి నా కష్టాన్ని గుర్తించడం లేదు’ అంటూ మనసులోనే బాధపడింది పిచ్చుక.

ఇంతలో వడ్రంగి పిట్ట, పిచ్చుక గూడు దగ్గరకు వచ్చి ‘అబ్బో.. దీన్ని కూడా గూడు అంటారా? గిజిగాడు కట్టింది చూడు ఎలా ఉందో! పనితనమంటే అది.. చేతకాకపోతే నోరు మూసుకొని ఉండాలి కానీ ఇలా చెత్తను పేర్చి గూడు అని చెప్పుకోకూడదు’ అంటూ ఎగతాళిగా మాట్లాడింది.

పిచ్చుక ఆ అవమానాన్ని భరించలేకపోయింది. ఇక అక్కడ ఉండకూడదని నిర్ణయించుకొని దగ్గరలోని గ్రామం వైపు బయలుదేరింది. ఊరి పొలిమేరల్లో దానికొక రైతు కనిపించాడు. పిచ్చుక జరిగిన విషయాన్ని అతడికి చెప్పి ‘ఇకనుంచి నేను మీ ఊరిలోనే ఉందామనుకుంటున్నాను. ఎవరైనా వద్దంటారా?’ అని దిగాలుగా అడిగింది. ‘భలేదానివే.. పల్లెల్లో పక్షుల సంఖ్య తగ్గిపోవడంతో ఎంతో బాధపడుతున్నాం. చేలల్లో కీటకాలు, పురుగులు తినే మీలాంటి పిచ్చుకల వల్ల రైతులకు ఎంతో మేలు కదా.. ఇక మాతోనే ఉండు’ అంటూ రైతు దానిని ఇంటికి తీసుకెళ్లాడు.

అప్పటి నుంచి అది రైతు ఇంట్లోనే ఉంది. గడ్డిపరకలు తెచ్చుకొని చూరులో గూడు కట్టుకుంది కూడా. రోజూ రైతు కుటుంబం పెట్టే ఆహారం, నీటితో పిచ్చుక జీవితం ఆనందంగా గడిచిపోతోంది. తన మిత్రులను సైతం ఊరిలోకి పిలుచుకొచ్చింది. చేలల్లోని పురుగులు, కీటకాలను తింటూ రైతులకు మేలు చేసేవి అవన్నీ. దాంతో ఆ ఊరిలో పంట దిగుబడులూ పెరిగాయి. ఒకరోజు మిత్రులతో కలిసి పిచ్చుక పొలాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని అడవి పక్షులు కనిపించాయి. ‘వడ్రంగి పిట్ట తన ప్రవర్తనకు ఎంతో బాధపడింది. ఆ అవమానాన్ని మరిచిపోయి, నువ్వు తిరిగి అడవిలోకి రావచ్చు కదా’ అని పిచ్చుకను అడిగాయి. అయితే, ‘మా వల్ల ఇక్కడ ఎంతోమంది రైతులకు లాభం కలుగుతోంది. ఇక్కడే ఉంటాం’ అని పిచ్చుక వాటికి సమాధానమిచ్చింది.  
అక్కడే పనిచేసుకుంటూ ఈ మాటలన్నీ వింటున్న రైతు, పక్షుల దగ్గరకు వచ్చి.. ‘అందరికీ అన్నీ రావాలని ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది. పిచ్చుకకు గూడు కట్టడం రాకపోవచ్చు కానీ పంటలకు మేలు చేయడం తెలుసు. అలాగే, గిజిగాడు పిట్టకు గూడు కట్టడం రావచ్చు కానీ పిచ్చుక చేసే పనులు అది చేయలేదు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు’ అంటూ పిచ్చుకను తన భుజాలపై ఎక్కించుకొని ఇంటికి వెళ్లిపోయాడు రైతు.

- శాఖమూరి శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని