నాట్యం మరిచిన మయూరి!

ఆరావళీ పర్వతాలకు దక్షిణ దిశలో ఒకప్పుడు చందనవనం అనే అడవి ఉండేది. అందులో ఎన్నో సాధుజంతువులు నివసిస్తుండేవి. సాయంత్రం కాగానే మయూరి అనే నెమలి  పురివిప్పి నాట్యం చేసేది.ఆ నాట్యాన్ని చూడటానికి పక్షులు, జంతువులన్నీ ఎంతో ఉత్సాహపడేవి.

Updated : 14 Feb 2022 07:09 IST

ఆరావళీ పర్వతాలకు దక్షిణ దిశలో ఒకప్పుడు చందనవనం అనే అడవి ఉండేది. అందులో ఎన్నో సాధుజంతువులు నివసిస్తుండేవి. సాయంత్రం కాగానే మయూరి అనే నెమలి  పురివిప్పి నాట్యం చేసేది.

ఆ నాట్యాన్ని చూడటానికి పక్షులు, జంతువులన్నీ ఎంతో ఉత్సాహపడేవి. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న మరో అడవి నుంచి కూడా పక్షులు, జంతువులూ చందనవనానికి వచ్చి చేరేవి.

మయూరి ఉల్లాసంగా, ఉత్సాహంగా రకరకాల భంగిమల్లో తన పింఛాన్ని తిప్పుతూ చీకటి పడేదాకా ఎంతో అందంగా నాట్యం చేసేది. అది చూసిన జంతువులు, పక్షులు చప్పట్లతో అభినందించి, మయూరిని పొగిడి తిరిగి వెళ్లిపోయేవి.

ఇలా కొంతకాలం గడిచేసరికి ఒక రోజు కలహరి అనే గుడ్లగూబ మయూరి దగ్గరకు వచ్చింది. ‘రా కలహరి! నిన్ను చూసి చాలా కాలమైంది. ఇలా వచ్చావేం?’ అని అడిగింది మయూరి. కలహరి ఏమీ మాట్లాడకుండా మయూరి చుట్టూ తిరుగుతూ.. విచిత్రంగా చూస్తూ.. హేళనగా నవ్వింది. ‘నన్ను చూసి ఎందుకలా నవ్వుతున్నావ్‌?’ అని అడిగింది మయూరి.

‘ఏం లేదూ.. అందరూ నిన్ను పొగుడుతుంటే, ఇన్నాళ్లూ నీలో ఏదో ప్రత్యేకత ఉందని నేనూ అనుకున్నాను. దగ్గర్నుంచి చూస్తుంటే నువ్వు నేననుకున్నంత అందంగా లేవనిపిస్తోంది. నీ గొంతు కూడా నా గొంతులానే కఠోరంగానే ఉంది. వీళ్లంతా నిన్నెందుకు పొగుడుతున్నారో నాకర్థం కావడం లేదు. అయినా ఇదంతా నాకెందుకులే. సాయంకాలం కావస్తోంది. నాట్య ప్రదర్శనకు వేళవుతోందిగా.. నువ్వు బయలుదేరు. నేనూ వెళ్లొస్తా’ అని వెళ్లిపోయింది కలహరి.

ఆ సాయంత్రం.. పురివిప్పి నాట్యం చేస్తున్న మయూరికి మధ్యలో కలహరి మాటలు గుర్తొచ్చి అడుగులు తడబడ్డాయి. ఆ రోజు నాట్యం సరిగా చేయలేకపోయింది. నాట్యం చూద్దామని వచ్చిన మిత్రులందరూ నిరుత్సాహపడ్డారు. మర్నాడు కూడా మయూరి తప్పటడుగులు వేసింది. తన మీద తనకు నమ్మకం పోయింది. క్రమంగా నాట్యం చేయడం మానేసింది.

ఎప్పుడూ సందడిగా ఉండే ఆ అడవి క్రమంగా నిశ్శబ్దంగా మారిపోయింది. కొన్నాళ్లకు కొల్లేరుకు వలస వెళ్లిన చారువీరమనే కొంగ, చందనవనానికి తిరిగి వచ్చింది. తను లేనప్పుడు అడవిలో జరిగిన విశేషాలను మిత్రులను అడిగి తెలుసుకుంది.

మయూరి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని పలకరిద్దామని వెళ్లింది. ‘ఏం మయూరీ! ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది. ఎందుకో నువ్వీ మధ్య నృత్యం చేయడం మానేశావని విన్నాను.. కారణమేంటి?’ అని అడిగింది.

కలహరి మాటల వల్ల తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, దేనిమీదా దృష్టి పెట్టలేకపోతున్నానని చెప్పింది మయూరి.

‘నీ కళ సహజ సిద్ధమైంది. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. కలహరి అలా ఎందుకు అందో నేను తెలుసుకుంటాను’ అని చెప్పి చారువీర చందనవనంలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. కలహరితో పాటు అన్ని జీవులూ హాజరయ్యాయి.

‘కలహరీ.. నువ్వు మయూరి ఆత్మవిశ్వాసం తగ్గేలా ఎందుకు మాట్లాడావు. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే మరింత ఉత్సాహంగా ఉంటుంది కదా! నీ మాటల వల్ల మయూరిలో తన మీద తనకు నమ్మకం పోయింది. చివరికి తనకు పుట్టుకతో వచ్చిన నాట్య విద్య ప్రదర్శన కూడా చేయలేకపోతోంది చూడు. నువ్వు అలా చేయొచ్చా?’ అని అడిగింది చారువీర. అక్కడ సమావేశమైన ప్రాణులన్నీ కలహరి చేసిన పనిని తప్పుపట్టాయి.

కలహరి కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘నా మాటల వల్ల ఇంత పని జరుగుతుందని నేననుకోలేదు. నేను మయూరిని చూసి అసూయపడ్డ మాట వాస్తవమే. మయూరి నాట్యమంటే నాకెంతో ఇష్టం కూడా. కానీ ఒకరోజు మయూరి నాట్యానికి మురిసిపోతూ నేనూ చెట్టుమీద కూర్చుని రెక్కలు ఆడిస్తూ, కళ్లు తిప్పుతూ పాట కూడా పాడాను. అది చూసిన మన మిత్రులంతా నవ్వుతూ నన్ను గేలి చేశారు. ‘నీ కనుగుడ్లను చూడలేకపోతున్నాం. నీ పాట వినలేకపోతున్నాం..’ అని నా ఉత్సాహాన్ని పాడు చేశారు. నాకప్పుడు చాలా బాధ కలిగింది. ‘ఆనందించడానికి కూడా నేను పనికిరానా?’ అని ఎంతో దిగులు పడ్డాను. ఆ కోపంతోనే మయూరి దగ్గరకు వెళ్లి అలా మాట్లాడాను. అంతే తప్ప మయూరి మీద నాకే కోపమూ లేదు. నన్ను క్షమించండి’ అని చెప్పి ఏడ్చింది కలహరి.
‘మిత్రులారా! మీరు కలహరిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల జరిగిన అనర్థాన్ని చూశారుగా. ఎవరినైనా హేళన చేయడం తప్పుకదా! మీరంతా కలహరి సంతోషాన్ని అడ్డుకోవడం మూలాన, ఉక్రోషంతో మయూరిని కించపరుస్తూ తన ఆత్మవిశ్వాసం తగ్గేలా చేసింది. ఒకరిని ఇంకొకరితో పోల్చకూడదు. ఎవరి గొప్ప వారిదే. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించడం ఇకనుంచైనా మనం అలవాటు చేసుకుందాం’ అని చెప్పింది చారువీర.

మిత్రులంతా తమ తప్పు తెలుసుకుని ఇంకెప్పుడూ అలా చేయమని తమ ఐకమత్యాన్ని తెలియజేశాయి.

- గొర్తి వాణి శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని