Published : 05 Feb 2023 15:57 IST

ఒక మున్నీ.. బోలెడు చిన్నిచీమలు!

కానొక అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది. దానిలో ఓ తాబేలు పిల్ల తన తల్లితోపాటు నివసించేది. దాని పేరు మున్నీ. తల్లి తాబేలు మున్నీని ఎంతో గారంగా, ముద్దుగా చూసుకుంటూ ఉండేది. మున్నీ కూడా అమ్మ వెనకే నీటిలో ఈదుతూ, అడవిలో నడుస్తూ.. అక్కడ దొరికే ఆకులు, పండ్లు, కూరగాయలు తింటూ సంతోషంగా గడిపేది.

ఒకరోజు తల్లి తాబేలు.. ‘మున్నీ, మా పెద్దమ్మకు ఆరోగ్యం బాగాలేదట. ఇందాకే, కాకమ్మ కబురు మోసుకొచ్చింది. పాపం, పెద్దది కదా! నన్ను చూడాలనుకుంటోందట. నేను వెళ్లి, పలకరించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు. నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు చెరువులో నుంచి బయటకు రాకు’ అని హెచ్చరికగా చెప్పింది.

‘నేను కూడా నీతో వస్తానమ్మా’ అని మారాం చేసింది మున్నీ. ‘మున్నీ.. నువ్వు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నావు. అంతదూరం నడిస్తే నీ కాళ్లు నొప్పి పెడతాయి. అలాగని నిన్ను ఎత్తుకుని వెళ్లి, తిరిగి తీసుకువచ్చే శక్తి నాకు లేదు. నువ్వు బంగారం కదూ. నా మాట విను’ అని ఎలాగో బుజ్జగించి, ఒప్పించి బయలుదేరింది తల్లి తాబేలు.

చెరువులో ఈత కొడుతున్న మున్నీ, ఆకాశంలో ఎగురుతున్న ఓ రంగురంగుల సీతాకోకచిలుకను చూసింది. అది ఎంతో అందంగా, ముద్దుగా కనబడింది. అంతే, తల్లి చెప్పిన మాట మరిచిపోయి, ఒడ్డుకు వచ్చి ఎగురుతున్న సీతాకోకచిలుక వైపే మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లసాగింది.

ఆ సీతాకోక చిలుక అటూ ఇటూ ఎగురుతూ అడవిలోపలికి వెళ్లసాగింది. దాని వెంటే మున్నీ కూడా నడక సాగించింది. ఇంతలో ఆ సీతాకోకచిలుక కనబడకుండా మాయమైపోయింది. చుట్టూ చూసిన మున్నీ ఉలిక్కిపడింది. తను ఎక్కడ ఉందో దానికి అర్థం కాలేదు. ఎటు పోవాలో దిక్కు తోచలేదు. చాలా భయం వేసింది. ఏడుపు తన్నుకు వచ్చింది.

అంతలో మున్నీకి అటుగా వెళుతున్న లేడి కనిపించింది. ‘లేడి మామా లేడి మామా.. అనుకోకుండా నడుచుకుంటూ నడుచుకుంటూ నేను ఇక్కడి వరకూ వచ్చేశాను. ఇప్పుడు తిరిగి మా ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. నువ్వు మా చెరువు పక్క మైదానంలోనే కదా ఉంటావు. నిన్ను నేను చాలా సార్లు చూశాను. నన్ను నీతోపాటు తీసుకెళ్లవూ’ అని అడిగింది బెరుకుగా.

‘అమ్మో, అంత మెల్లగా నీతో నడుచుకుంటూ రావడం నా వల్ల కాదు బాబూ. అసలే అడవిలో ఆహారం కోసం తిరిగి తిరిగి అలసిపోయా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి, విశ్రాంతి తీసుకుందామా అని ఉంది’ అంటూ వేగంగా పరుగుతీస్తూ వెళ్లిపోయింది ఆ లేడి.

మళ్లీ మున్నీ గుండెల్లో భయం మొదలైంది. ఇంతలో చెరువు పక్కనే, మర్రి చెట్టు మీద నివసించే ఓ పిట్ట కనబడింది దానికి. ‘ఓ పిట్ట పిన్నీ, పిట్ట పిన్నీ.. మన చెరువు దోవ మరిచిపోయాను. త్వరగా ఇంటికి వెళ్లాలి. నీ వెంట నన్నూ తీసుకువెళ్లవూ’ అని అడిగింది ఆశగా మున్నీ. ‘నాతోపాటు నిన్ను తీసుకెళ్లాలనే ఉంది మున్నీ. కానీ నీతో కలిసి నడుస్తూ వెళితే చీకటి పడిపోతుంది. చీకట్లో నా పిల్లలు భయపడిపోతారు. అందుకే నేను తొందరగా గూడు చేరుకోవాలి’ అంటూ పిట్ట తుర్రున ఎగిరిపోయింది.

కాస్తదూరంలో తనకు తెలిసిన తెల్లపిల్లి కనబడింది. సంగతి అంతా చెప్పి, సాయం చేయమని కోరింది మున్నీ దీనంగా.

‘ఇప్పుడు చీకటి పడుతోంది. ఇది నేను ఆహారం కోసం వేటకు వెళ్లే సమయం. నేను నీకు ఏ విధంగానూ సాయం చేయలేను’ అని చెప్పి ఓ కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను తరుముతూ వేగంగా పరుగుతీస్తూ వెళ్లిపోయింది పిల్లి.

మున్నీకి కూడా ఆకలి వెయ్యడం మొదలైంది. చీకటి పడబోతోంది. తినడానికి ఏమీ దొరకక నీరసం ముంచుకు రాసాగింది. ఆకలి, భయం అన్నీ కలిసి సత్తువ కోల్పోయిన మున్నీ, అలా చెట్టుకు చేరబడిపోయింది. ఇంతలో దాని పక్క నుంచి ఓ చిన్ని చీమ చరచరా పాకుతూ వెడుతోంది.

అందరినీ అడిగి అలిసిపోయిన మున్నీ, దాని వంక అనాసక్తిగా చూసింది. కానీ ఆ చిన్ని చీమ, నీరసంగా ఉన్న మున్నీ దగ్గరగా వచ్చి ‘ఎందుకు అంత అలసటగా ఉన్నావు? ఏమైంది’ అని ఆప్యాయంగా అడిగింది.

‘ఆకలిగా ఉంది. మాట్లాలేకపోతున్నాను’ అని చెప్పింది మున్నీ. ఆ చిన్ని చీమ గబుక్కున వెళ్లిపోయి చటుక్కున వచ్చింది. దాని వెనుకే చీమలు గుంపులుగా వచ్చి ఆగాయి. అవి తమతోపాటు మోసుకు వచ్చిన రకరకాల చిన్న చిన్న పండ్ల ముక్కలను మున్నీ ముందు కుప్పపోశాయి. మున్నీ వాటిని ఆత్రంగా ఆరగించి తన ఆకలి తీర్చుకుంది. అంతలో పెద్దమ్మను పలకరించి వస్తున్న తల్లి తాబేలు మున్నీని, అక్కడ ఉన్న చీమలను చూసి ‘ఏం జరిగిందో’ అని ఆందోళన పడుతూ ఆగిపోయింది. తల్లిని చూసి ఒక్కసారిగా బావురుమంది మున్నీ.

తల్లి తాబేలు, ‘మున్నీ ఏమైంది?’ అని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తేరుకున్న మున్నీ, జరిగిందంతా చెప్పింది. అది విన్న తల్లి తాబేలుకు కళ్లు చెమర్చాయి. తన బిడ్డకు సమయానికి ఆహారం అందించిన ఆ చిన్ని చీమలకు కృతజ్ఞతలు చెప్పింది. 

తర్వాత మున్నీని వీపుపైన ఎక్కించుకుని చెరువుకేసి బయలుదేరింది తల్లి తాబేలు. ఇకపై ఎప్పుడూ ‘అమ్మ చెప్పింది’ జవదాటకూడదని నిర్ణయించుకుంది మున్నీ.

- సి.యమున


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు