ఏనుగు తిక్క కుదిర్చిన కందిరీగ!

అనగనగా ఒక అడవిలో నివసిస్తున్న ఏనుగుకి.. తానే పెద్దదాన్నీ బలమైనదాన్నీ అనే గర్వం. ఆ పొగరుతో అడవిలోని ఇతర జంతువులను భయపెట్టేది. పగలంతా అడవి మొత్తం తిరుగుతూ ఎదురొచ్చిన జంతువులను బెదిరిస్తుండేది ఏనుగు. ‘నాకే ఎదురొస్తావా? దారి వదలాలని తెలియదా. నేను తలచుకుంటే నిన్ను నా పాదం కింద నలిపేయగలను జాగ్రత్త!’ అంటూ హెచ్చరించేది. ఒక్కోసారి ఏ తప్పూ....

Updated : 19 Feb 2022 05:25 IST

నగనగా ఒక అడవిలో నివసిస్తున్న ఏనుగుకి.. తానే పెద్దదాన్నీ బలమైనదాన్నీ అనే గర్వం. ఆ పొగరుతో అడవిలోని ఇతర జంతువులను భయపెట్టేది.

పగలంతా అడవి మొత్తం తిరుగుతూ ఎదురొచ్చిన జంతువులను బెదిరిస్తుండేది ఏనుగు. ‘నాకే ఎదురొస్తావా? దారి వదలాలని తెలియదా. నేను తలచుకుంటే నిన్ను నా పాదం కింద నలిపేయగలను జాగ్రత్త!’ అంటూ హెచ్చరించేది. ఒక్కోసారి ఏ తప్పూ చేయకపోయినా కొన్నింటికి శిక్ష విధించేది. అవన్నీ చిన్న జీవులు కావడంతో ఏమీ అనలేకపోయేవి. అవి నివసించే ప్రాంతాలను నాశనం చేస్తుంటే, జంతువుల బాధను చూసి ఏనుగు ఆనందించేది.

ఏనుగు ప్రవర్తనతో జంతువులన్నీ విసిగిపోయాయి. ఎలాగైనా దాని మనసు మార్చాలని అనుకున్నాయి. ‘మిత్రమా! నువ్వు వయసులో చాలా పెద్దదానివి. ఇతర జీవులకు ఆదర్శంగా ఉండాల్సినదానివి. నువ్వే ఇలా ప్రవర్తించడం బాగాలేదు. ఇలా గర్వంతో వ్యవహరిస్తే నీ పెద్దరికానికి విలువ ఉండదు. బాగా ఆలోచించు’ అని సాటి జంతువులు ఎంత చెప్పినా.. ఆ ఏనుగులో మార్పురాలేదు.

‘మీ దుర్బుద్ధి నాకు తెలుసు. నేను ఇలా గంభీరంగా ఉండటం, పెద్దమనిషిగా చెలామణీ అవడం మీకు ఇష్టం లేనట్లు ఉంది. నేను ఎవరికీ భయపడను కాబట్టే ఈ అడవిలో క్రూర జంతువుల మధ్య ధైర్యంగా బతకగలుగుతున్నాను. మీలా భయపడి బతకటం నావల్ల కాదు. నేను చేసేదే సరైన పని’ అంటూ ఎదురు సమాధానమిచ్చేది ఏనుగు. ‘పొరపాటు పడుతున్నావు. నీ బలాన్ని నిరూపించుకోవడం కోసం సాటి జీవులను ఇబ్బంది పెట్టడం సరికాదు. దీనివల్ల అందరూ నీకు దూరమవుతారు. మనకంటూ ఎవరూ లేకపోతే ఎంత బలమున్నా ప్రయోజనం శూన్యం’ అని మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేశాయి జంతువులు.

అంత చెప్పినా ఏనుగు ప్రవర్తన ఏమాత్రం మారలేదు. ఇలా అయితే లాభం లేదనుకొని, ఒకరోజు జంతువులన్నీ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ‘ఆ ఏనుగును బంధించడం మనవల్ల కాదు కాబట్టి.. తెలివిగా తప్పించాలి. అవసరమైతే ఈ అడవి నుంచి బయటకు వెళ్లగొట్టాలి. లేదంటే ఇక్కడ మనం బతకలేం. మీలో ఎవరైనా ఏదైనా ఉపాయం ఆలోచించండి’ అంది కుందేలు. ‘మీలో ఎవరైనా సరే ఆ ఏనుగుకు గుణపాఠం చెప్పే సామర్థ్యం ఉంటే బయటకు రండి’ కోరింది తోడేలు. ఏ ఒక్కటీ ముందుకు రాలేదు.

అంతలోనే ‘ఆ ఏనుగుకు గర్వం ఎక్కువ. నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ పక్కనే ఉన్న బండరాయిపై వాలుతూ కోరింది కందిరీగ. ఆ మాటకు జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వేశాయి. ‘కాస్తో కూస్తో తెలివితేటలు, ఆకారం ఉన్న మావల్లే కాలేదు. పట్టుకుంటేనే నలిగిపోయే నీవల్ల ఏమవుతుంది? ఆ ఏనుగును నువ్వేం చేయగలవు?’ అంటూ హేళన చేశాయి. ‘మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. మీవల్ల కాని పనిని నేను చేసి చూపిస్తాను’ సమాధానమిచ్చింది కందిరీగ. అన్నీ ఆలోచించుకొని సరేనని ఒప్పుకొన్నాయి.

తక్షణమే ఆ ఏనుగు ఉన్న ప్రాంతానికి వెళ్లింది కందిరీగ. ‘నన్ను చూస్తేనే పెద్ద పెద్ద జంతువులు భయపడతాయి. నా దగ్గరకు రావాలంటేనే వణికిపోతాయి. అలాంటిది గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే ఈగవి.. నీకెంత ధైర్యం?’ అంటూ బిగ్గరగా ఘీంకరించింది ఏనుగు. ‘నీ దెబ్బకు అడవి మొత్తం భయపడుతుందని విన్నాను. అందుకే, ఎలా ఉంటావో చూద్దామని వచ్చా. శరీరం భారీగా ఉన్నా నాతో పోటీ పడే స్థాయి నీకు లేదు’ అంటూ ఏనుగును రెచ్చగొట్టింది కందిరీగ.

ఆ మాటలకు ఏనుగు ఆవేశంతో ఊగిపోయింది. కందిరీగ వెంటనే దాని తొండంపై వాలి కుట్టడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా ఏనుగు తప్పించుకోలేకపోయింది. ఒకసారి వీపుపైన, మరోసారి చెవులపైన, ఇంకోసారి తోకపైన - ఇలా ఎక్కడబడితే అక్కడా కుట్టసాగింది. నొప్పిని భరించలేక అడవి అంతా అటూఇటూ తిరగసాగింది ఏనుగు. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. పక్కనేఉన్న నదిలోకి దిగి తల వరకూ మునిగింది. ఏనుగు బయటకు వస్తే కుడదామని ఎదురుచూడసాగింది కందిరీగ.
అలా ఒకటీ రెండ్రోజులు గడిచాయి. ఏనుగుకు ఆకలి కావడం ప్రారంభమైంది. కానీ, బయటకు వస్తే కందిరీగ కుట్టి చంపేస్తుందేమోనని భయపడుతోంది. ఇక ఏం చేయాలో దిక్కుతోచక ‘నన్ను వదిలిపెట్టు. నీకు దండం పెడతాను. ఆకలిగా ఉంది. తినకపోతే చచ్చిపోతాను’ అంటూ కాళ్లబేరానికి వచ్చింది ఏనుగు.

‘ఇకనైనా బుద్ధి వచ్చిందా? ప్రాణం విలువ, ఆకలి విలువ తెలిసొచ్చిందా? నీ అహంకారమే ఈ పరిస్థితికి కారణం. నీకు భయపడి ఎన్ని జంతువులు కనీసం నీళ్లు కూడా లేకుండా  బిక్కుబిక్కుమంటూ బతికాయో తెలుసా? ఆ బాధ నీ వరకూ వస్తే కానీ తెలియలేదు. నువ్వు సహాయం చేయకపోయినా ఫర్వాలేదు. ఇతరులకు హాని చేయకపోతే చాలు. జంతువులన్నింటికీ క్షమాపణ చెప్పి మంచిగా ఉండు. లేదంటే మళ్లీ నీకు ఈ శిక్ష తప్పదు’ అంటూ హితబోధ చేసింది కందిరీగ. తాను చేసిన పొరపాట్లకు బాధపడింది ఏనుగు.

అప్పటినుంచి ఏనుగు ఇతర జంతువులతో కలుపుగోలుగా మెలగసాగింది. దానిలో వచ్చిన మార్పును చూసి, హేళన చేసిన జంతువులే కందిరీగను అభినందించాయి.

- నరెద్దుల రాజారెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని