మధురానగరం.. శిష్యులందరికీ పాఠం!

పూర్వం మధురానగరం ఊరి బయట ఆత్మానందుని ఆశ్రమం ఒకటి ఉండేది. అరవిందుడు, ఆనందుడు, రవీంద్రుడు అనే ముగ్గురు శిష్యులు అన్నింట్లోనూ ప్రతిభ చూపేవారు. విద్యాభ్యాసం ముగియడంతో వారు ఆశ్రమాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది.

Published : 25 Feb 2022 00:56 IST

పూర్వం మధురానగరం ఊరి బయట ఆత్మానందుని ఆశ్రమం ఒకటి ఉండేది. అరవిందుడు, ఆనందుడు, రవీంద్రుడు అనే ముగ్గురు శిష్యులు అన్నింట్లోనూ ప్రతిభ చూపేవారు. విద్యాభ్యాసం ముగియడంతో వారు ఆశ్రమాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది.

ఒకరోజు ఆత్మానందుని ఆశ్రమానికి, పక్క ఊరి జమీందారు వచ్చాడు. గురువు వద్దంటున్నా వినకుండా ఆశ్రమ నిర్వహణ నిమిత్తం మూడు వందల బంగారు నాణేలను విరాళంగా ఇచ్చి వెళ్లాడు. ఆత్మానందుడు వెంటనే అరవిందుడు, ఆనందుడు, రవీంద్రుడిని పిలిచి.. ఒక్కొక్కరికి వంద నాణేలు ఇచ్చాడు. ‘మధురానగరానికి వెళ్లి అక్కడ మీకు కనిపించిన మంచి వాళ్లకు ఈ బంగారు నాణేలు ఇవ్వండి. ముగ్గురూ విడివిడిగా ఈ పని పూర్తి చేసి, పది రోజుల్లోగా తిరిగిరండి’ అన్నాడు.

మరుసటి రోజే ముగ్గురు శిష్యులూ మధురానగరానికి వెళ్లారు. సత్రంలో ఉంటూ.. గురువు చెప్పిన పని చేయసాగారు.

అయిదు రోజులకే ఆశ్రమానికి తిరిగొచ్చాడు అరవిందుడు. ‘నాకు కనిపించిన వాళ్లందరూ చెడ్డవాళ్లే.. అందుకే బంగారు నాణేలనూ ఎవరికీ ఇవ్వలేదు. మీరు ఇచ్చినవి ఇవిగోండి’ అంటూ వంద నాణేలను ఆత్మానందుడికి అందించాడు.
ఏడు రోజులకు ఆశ్రమానికి తిరిగొచ్చాడు ఆనందుడు. ‘గురువు గారూ.. నగరంలో నాకు అందరూ మంచివాళ్లే కనిపించారు. నా దగ్గరున్న మొత్తం బంగారు నాణేలను వారికి పంచేశాను’ అన్నాడు.

పదో రోజు ఆశ్రమానికి తిరిగొచ్చాడు రవీంద్రుడు. ‘నాకు కనిపించిన వారిలో కొందరు మంచివాళ్లు, మరికొందరు చెడ్డవాళ్లు ఉన్నారు. మీరు చెప్పినట్టే మంచివాళ్లకు బంగారు నాణేలు ఇచ్చాను. వాటిలో సగం ఇంకా నా వద్ద మిగిలాయి’ అంటూ వాటిని గురువుకు తిరిగిచ్చేశాడు.

ఆరు నెలలు గడిచాయి. ఒకరోజు ఆత్మానందుడు ముగ్గురు శిష్యులను పిలిచి ‘మీరు మధురానగరానికి వెళ్లి అక్కడి ప్రజల నుంచి మన ఆశ్రమ నిర్వహణకు విరాళాలు తీసుకురండి. ఎవరినీ బలవంతపెట్టొద్దు. విడివిడిగా తిరుగుతూ నిధులు సేకరించాలి. అందరూ పదో రోజున ఆశ్రమానికి తిరిగిరావాలి’ అని ఆదేశించాడు.

వెంటనే మధురానగరానికి వెళ్లారు శిష్యులు. గురువు సూచన మేరకు సత్రంలో ఉంటూ.. విరాళాల కోసం నగరంలో తిరిగారు. పదో రోజు ముగ్గురూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు.

అరవిందుడు నలభై బంగారు నాణేలను, ఆనందుడు అరవై బంగారు నాణేలను సేకరించారు. వాటిని గురువుకు అందించారు. రవీంద్రుడు మాత్రం రెండు వందల బంగారు నాణేలు తీసుకురాగా.. మిగతా ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

మరుసటి రోజు ముగ్గురు శిష్యులనూ పిలిచి ‘విద్యాభ్యాసం ముగిసిన తర్వాత మీరు సమాజంలోకి వెళ్లి జీవించాలి. అందుకే, మీకు ప్రజలూ, పరిస్థితులపై అవగాహన కల్పించాలనుకున్నా. ఆరు నెలల క్రితం మిమ్మల్ని బంగారు నాణేలు పంచమనడమూ, ఇప్పుడు విరాళాలు సేకరించమనడమూ.. ఆ ప్రయత్నంలో భాగమే’ అన్నాడు ఆత్మానందుడు.

ఆ మాటకు శిష్యులు ఆశ్చర్యంగా గురువు వైపు చూశారు.

‘అరవిందుడి దృష్టిలో లోకంలో అందరూ చెడ్డవాళ్లు. కానీ, అతడికి విరాళంగా వచ్చిన నలభై నాణేలను బట్టి, తాను చెడ్డవాళ్లు అనుకున్నవారిలో అందరూ చెడ్డవాళ్లు కాదని తెలుస్తుంది. అలాగే ఆనందుడి దృష్టిలో లోకంలో అందరూ మంచివాళ్లు. కానీ, అతడికి రవీంద్రుడి కంటే తక్కువగా బంగారు నాణేలు విరాళంగా వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే, అందరూ మంచివాళ్లు కాదని తెలుస్తుంది’ చెప్పాడు ఆత్మానందుడు.

‘అదే.. రవీంద్రుడి దృష్టిలో.. లోకంలో కొంతమంది మంచివారు, మరికొందరు చెడ్డవారు. అతడికి విరాళంగా రెండు వందల బంగారు నాణేలు లభించాయి. ఆరు నెలల క్రితం నేను ఇచ్చిన నాణేలను తాను మంచివాళ్లు అనుకున్న వారిలో అవసరం ఉన్నవారికి మాత్రమే ఇచ్చాడు రవీంద్రుడు. ఇప్పుడు అతడు ఆశ్రమం కోసం విరాళాలు సేకరిస్తున్నాడని తెలుసుకొని.. గతంలో అతడి నుంచి సహాయం పొందిన వాళ్లలో కొందరు స్వచ్ఛందంగా సాయం అందించారు. లోకం విషయంలో రవీంద్రుడి దృష్టి, ఆలోచనా విధానం చక్కగా ఉన్నాయి. మీరు కూడా వాటిని అలవరచుకోవాలి’ వివరించాడు ఆత్మానందుడు.

‘లోకంలో మంచివాళ్లతోపాటు చెడ్డవాళ్లూ ఉంటారు. నిజంగా అవసరం ఉన్నవారికి మాత్రమే దానం చేయాలి’ అంటూ ముగించాడు గురువు.

- కళ్ళేపల్లి తిరుమలరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని