చదువుల బాబు

అరుణ్‌ మూడో తరగతి చదువుతున్నాడు. తన తమ్ముడు సందీప్‌కి రెండేళ్లు. కొద్దిరోజుల కిందటే వాళ్ల నాన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చనిపోయాడు. అమ్మ కూలి పని చేసి దాచుకున్న కొంత డబ్బు.. ఆసుపత్రి ఖర్చులకు సరిపోకపోతే, అప్పులూ చేయాల్సి వచ్చింది. దాంతో అవి తీర్చేందుకు గత్యంతరం లేక వారి ఇంటినీ అమ్మేశారు. ఇప్పుడు వారు ఉండడానికి ఏ నీడా లేకపోవడంతో, పాఠశాల వెనకాల ప్రహరీ గోడను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు.

Updated : 15 Mar 2022 00:29 IST

రుణ్‌ మూడో తరగతి చదువుతున్నాడు. తన తమ్ముడు సందీప్‌కి రెండేళ్లు. కొద్దిరోజుల కిందటే వాళ్ల నాన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చనిపోయాడు. అమ్మ కూలి పని చేసి దాచుకున్న కొంత డబ్బు.. ఆసుపత్రి ఖర్చులకు సరిపోకపోతే, అప్పులూ చేయాల్సి వచ్చింది. దాంతో అవి తీర్చేందుకు గత్యంతరం లేక వారి ఇంటినీ అమ్మేశారు. ఇప్పుడు వారు ఉండడానికి ఏ నీడా లేకపోవడంతో, పాఠశాల వెనకాల ప్రహరీ గోడను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు.

ఒకరోజు అరుణ్‌తో ‘రేపటి నుంచి నేను పనికి వెళ్తున్నాను. నువ్వు స్కూల్‌కి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ తమ్ముడిని చూసుకోవాలి’ అని చెప్పింది అమ్మ. అందుకు ‘లేదమ్మా.. నేను బడికి వెళ్తాను’ అంటూ బతిమాలాడు అరుణ్‌. ‘నేను పనికి వెళ్లకుంటే మనం ఎలా బతుకుతాం.. ఇప్పటికే ఇల్లు అమ్మి అప్పులు తీర్చాం. కూలీకి వెళ్తేనే మన కడుపు నిండుతుంది’ అంది అమ్మ బుజ్జగింపుగా. కానీ, ‘మరి నా చదువు?’ దీనంగా అడిగాడు అరుణ్‌. ‘పరీక్షలప్పుడు వెళ్లి రాసిరా.. లేదూ అంటే చదువు మానేసి తమ్ముడిని చూసుకో’ చెప్పేసి పనికి వెళ్లిపోయింది అమ్మ.

ఆ ఊరిలో అంగన్‌వాడీ బడి లేకపోవడంతో అరుణ్‌ తన తమ్ముడిని ఆడిస్తూ.. ఇంటిపట్టునే ఉండిపోయాడు. అయినా అతని మనసంతా పాఠశాలపైనే ఉంది. ఇంతలోనే గణగణమంటూ బడిగంట మోగింది. ఆ శబ్దం వినగానే అరుణ్‌లో ఏదో తెలియని బాధ కలిగింది. పాఠశాలలో విద్యార్థులందరూ ప్రార్థన ప్రారంభించారు. అది వీళ్లింట్లోకి స్పష్టంగా వినిపిస్తోంది. అంతే! అప్పటివరకూ తమ్ముడిని ఆడించిన అరుణ్‌.. హుషారుగా లేచి ప్రార్థన చేశాడు. సందీప్‌ కూడా వచ్చీరాని మాటలతో అన్నను అనుకరించాడు.

ఆరోజు మొదటి పీరియడ్‌ తెలుగు. వెంకటేశం మాస్టారు, హాజరు తీసుకుని పాఠం చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడే అరుణ్‌ మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. వెంటనే తన బ్యాగు తీసుకొని పుస్తకం తెరిచి మాస్టారు చెప్పే పాఠం శ్రద్ధగా విన్నాడు. అలా ప్రతిరోజూ అన్ని పాఠాలు వింటూ వాళ్లమ్మ పని నుంచి వచ్చేసరికి హోంవర్క్‌ కూడా పూర్తి చేసేవాడు. అంతేకాకుండా.. తమ్ముడికి వర్ణమాల కూడా నేర్పించేవాడు. ఇప్పుడు వాళ్ల ఇల్లే అతనికి పాఠశాల అయ్యిందన్నమాట.

ఆరోజు ఆదివారం. ‘అమ్మా! రేపటి నుంచి పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నాలుగు రోజులు నువ్వు పనికి వెళ్లకుండా తమ్ముడిని చూసుకుంటే నేను స్కూల్‌కి వెళ్లి రాసి వస్తాను’ అన్నాడు అరుణ్‌. అందుకు వాళ్లమ్మ సరేనంది. తెల్లవారుజామునే హుషారుగా నిద్రలేచి ఆనందంగా స్కూల్‌కి వెళ్లాడు. ‘ఇన్నిరోజులూ డుమ్మా కొట్టి ఇప్పుడొస్తున్నాడు’ అంటూ పిల్లలందరూ అరుణ్‌ని ఆటపట్టించారు. ‘ఇన్నిరోజులూ పాఠశాలకు రాలేదు కానీ ఈ రోజు పరీక్షలని వచ్చావా?’ కాస్త కోపంగా అన్నారు వెంకటేశం మాస్టారు. ‘పద.. హెడ్మాస్టర్‌ గారి దగ్గరికి వెళ్దాం’ అంటూ తీసుకెళ్లాడు. హెడ్మాస్టర్‌ సదానందం.. ‘నీ హాజరు చాలా తక్కువగా ఉంది. పరీక్షలు ఎలా రాస్తావు?’ అని ప్రశ్నించాడాయన. తన పరిస్థితిని అరుణ్‌ వివరించగా.. పరీక్షలు రాసేందుకు అంగీకరించారు హెడ్మాస్టర్‌.

అన్ని పరీక్షల్లో అరుణ్‌కు 80 శాతం పైగా మార్కులు రావడంతో తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులూ ఆశ్చర్యపోయారు. విషయం కనుక్కుందామని ఆఫీసుకు పిలిపించాలని చూస్తే.. ఆరోజు కూడా బడికి రాలేదు అరుణ్‌. ‘సార్‌.. అరుణ్‌ వాళ్లు మన స్కూల్‌ వెనకాలే ఉంటారు’ అని పిల్లలు చెప్పడంతో ఇద్దరిని పంపి తీసుకురమ్మన్నారు. వారు అరుణ్‌ వాళ్ల ఇంటికెళ్లి, హెడ్మాస్టర్‌ సార్‌ పిలుచుకురమ్మన్నారని చెప్పడంతో.. అరుణ్‌ తన బ్యాగ్‌ తీసుకొని తమ్ముడితో సహా స్కూల్‌కి వచ్చాడు. ‘ఇన్ని రోజులు స్కూల్‌కి రాకున్నా నీకు ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి? ఎవరి పేపర్‌లోనైనా చూసి రాశావా?’ అని అడగడంతో.. ఇన్ని రోజులు తాను ఎలా చదువుకుందీ చెప్పి, హోంవర్క్‌ కూడా పూర్తి చేశానని చెప్పి తన కాపీలు చూపించాడు అరుణ్‌. చదువుపైన అరుణ్‌కి ఉన్న శ్రద్ధ, ఆసక్తిని ప్రశంసిస్తూ.. ‘చదువుల బాబు’ అంటూ కీర్తించారందరూ. అంతేకాదు.. మరుసటి రోజు నుంచి వాళ్ల తమ్ముడితో కలిసి పాఠశాలకు రావొచ్చని హెడ్మాస్టర్‌ చెప్పడంతో అరుణ్‌ ఆనందానికి అవధుల్లేవు. 

- గంగాపురం శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని