ఎంచక్కా ఎడారికి వెళ్లాలని ఉంది!

ఒక పెద్ద పట్నానికి వెళ్లే రహదారికి రెండువైపులా కొబ్బరి బొండాలు అమ్మే బండ్లు ఉన్నాయి. పట్నం చేరేందుకూ ఇంకొంత దూరం ఉండటంతో.. ఎండలో వెళ్లే వాహనదారులంతా అక్కడ ఆగి లేత కొబ్బరి బొండాం నీళ్లు తాగి సేదదీరి వెళ్తుంటారు.

Updated : 22 Mar 2022 03:09 IST

ఒక పెద్ద పట్నానికి వెళ్లే రహదారికి రెండువైపులా కొబ్బరి బొండాలు అమ్మే బండ్లు ఉన్నాయి. పట్నం చేరేందుకూ ఇంకొంత దూరం ఉండటంతో.. ఎండలో వెళ్లే వాహనదారులంతా అక్కడ ఆగి లేత కొబ్బరి బొండాం నీళ్లు తాగి సేదదీరి వెళ్తుంటారు. పైగా చుట్టుపక్కల అనేక గ్రామాలకు అది కూడలి కావడంతో ఆ బొండాలకు మంచి గిరాకీ ఉంటుంది. దాంతో ఎప్పుడూ ఆ ప్రదేశం రద్దీగా కళకళలాడుతుంటుంది.

ఒకరోజు ఓ వ్యక్తి పట్నం నుంచి పల్లెకు వెళ్తూ ఒక బండి ముందు ఆగి రెండు బొండాలు కొట్టమన్నాడు. తీరా ధర అడిగి ఆశ్చర్యపోయాడు. ‘ఒకటి, పదిహేను రూపాయలేనా?’ నేనుండే నగరంలో అయితే నలభైకంటే తక్కువకు ఇవ్వడం లేదు. ఈ పట్నంలో పాతిక అంటేనే తక్కువనుకున్నా’ అన్నాడాయన. ఆ మాట విని.. బండి మీద పల్లె నుంచి పట్నం వెళ్తున్న ఒక పెద్దాయన ‘మా ఊరిలో అయితే పది రూపాయలే బాబు!’ అన్నాడు.

అతని వెనక సీట్లో కూర్చున్న స్నేహితుడు.. ‘కొబ్బరి తోటల గట్టున నుంచుంటే బొండాన్ని ఊరకనే తాగిస్తారు రైతులు. విరివిగా దొరికేచోట వెల తక్కువ ఉండడం సహజమే కదా!’ అని అన్నాడు నవ్వుతూ. ‘ఆ లెక్కన ఎడారి ప్రాంతాల్లో ఎంత డబ్బిచ్చినా.. ఇంత తాజా బొండాలు దొరకవేమో కదా!’ అన్నాడు నగరవాసి. ఇలా మాట్లాడుకుంటూ వాళ్లు లేత కొబ్బరి నీరు తాగి, కత్తితో బొండాన్ని రెండు చెక్కలు చేయించుకుని, లేత కొబ్బరిని ఇష్టంగా తిని ఎవరి మార్గంలో వారు బయలుదేరారు.

ఈ మాటలన్నీ ఎంతో కుతూహలంగా విన్నది ఒక కొబ్బరి బొండాం. అప్పటినుంచీ.. దాని మనసులో రకరకాల ఆలోచనలు సాగాయి. ‘ఇక్కడ చాలా కొబ్బరి బొండాలు దొరుకుతున్నాయి. అదీ పదిహేను రూపాయలకే. ఏ ప్రత్యేకతా లేకుండా అనేక కాయల మధ్య నేనూ ఒకటిగా ఉండటం కన్నా.. ఎడారి ప్రాంతానికి వెళ్లి ఏ వందో అయిదొందలో ధర పలికితే ఎంత దర్జా! ఎక్కువ విలువ పొంది.. అక్కడి వారి దాహం తీర్చగలిగితే ఎంత బాగుంటుందీ!’ అని మనసులోనే అనుకుంది. కానీ, ఎడారికి ఎలా వెళ్లాలో దానికి తెలియలేదు. ఈ ఆలోచన వచ్చాక అది అన్ని కాయలతో పాటుగా గుంపులో కుదురుగా ఉండలేకపోయింది. ఆకాశంలోని పక్షులను చూసి.. ‘వాటి మాదిరి ఎగిరిపోతే ఎంత బావుంటుంది?’ అనుకుంటూ.. ప్రార్థించసాగింది. రెక్కలు వస్తే ఎడారికి చేరి తన విలువ పెంచుకుందామని ఆశ పడసాగింది.

అప్పటిదాకా ‘ఒక బాటసారి దాహం తీర్చగలుగుతున్నాను’ అనే ఉత్సాహం, తృప్తి స్థానంలో ఒక్కసారిగా ఆందోళన నిండింది. ఏ వ్యక్తి బండి దగ్గర ఆగినా ఉలిక్కిపడసాగింది. అలా క్రమక్రమంగా తన ప్రశాంతతను కోల్పోయింది. ఇది గమనించిన పక్క బొండాం దాన్ని మందలించింది. ‘పిచ్చిదానా! ఈ డబ్బు అనేది మనుషులు ఏర్పరచుకున్నది. ప్రాంతాన్ని బట్టి నీ విలువ మారుతుందని ఆందోళన చెందడం సరికాదు. ఎడారికి వెళ్లి, యజమానికి ఎన్ని వందలు సంపాదించి పెట్టినా.. నువ్వు తీర్చగలిగేది ఒకరి దాహాన్నే. అదే మన విధి. అంతవరకే ఆలోచించు’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.

ఇంతలో జ్వరంతో బాధపడుతున్న పదేళ్ల పాపను పట్నంలో పెద్దాసుపత్రికి తీసుకువెళుతూ.. కొబ్బరి బొండాల బండి దగ్గర ఆగాడు ఓ తండ్రి. ఎండ, వడగాలులకు ఆరిపోతున్న పెదవులను తడుపుకుంటూ ఆశగా చూస్తున్న ఆ పాపను గమనించిన కొబ్బరి బొండాం ‘మిత్రుడు చెప్పింది నిజమే కదా!’ అనుకుంది. సరిగ్గా తననే యజమాని పైకి లాగడంతో సంతోషంగా తోటి బొండాలకు వీడ్కోలు పలికింది.

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని