మంత్రదండం

ఒక అడవిలో పిచ్చుక ఒకటి ఉండేది. అక్కడ చెట్లపై వాలే అన్నిరకాల పక్షులు, ఇతర పిచ్చుకలతో స్నేహంగా ఉండేది. ఇది చూసిన ఒక తాబేలుకు ఆ పిచ్చుక మీద అసూయ కలిగింది. ఎలాగైనా సరే దాన్ని అందరి ముందు అవమానించాలనుకుంది. అనుకున్నట్లుగానే ఓ రోజు... ‘ఓయ్‌ పిచ్చుకా! నాతో పందేనికి వస్తావా’ అంటూ పిలిచింది. ‘ఏం పందెమో చెప్పు తాబేలు మామా’ అంది పిచ్చుక.

Updated : 31 Mar 2022 01:33 IST

క అడవిలో పిచ్చుక ఒకటి ఉండేది. అక్కడ చెట్లపై వాలే అన్నిరకాల పక్షులు, ఇతర పిచ్చుకలతో స్నేహంగా ఉండేది. ఇది చూసిన ఒక తాబేలుకు ఆ పిచ్చుక మీద అసూయ కలిగింది. ఎలాగైనా సరే దాన్ని అందరి ముందు అవమానించాలనుకుంది. అనుకున్నట్లుగానే ఓ రోజు... ‘ఓయ్‌ పిచ్చుకా! నాతో పందేనికి వస్తావా’ అంటూ పిలిచింది. ‘ఏం పందెమో చెప్పు తాబేలు మామా’ అంది పిచ్చుక.

‘అదిగో ఆ సముద్రంలో చాలా దూరంలో కనిపిస్తోన్న దీవి ఉంది చూశావూ...! అక్కడికి వెళ్లాలి’ అంది తాబేలు. చెట్టుపై ఉన్న అన్ని రకాల పక్షులు ఒక్క సారిగా కోపంతో ‘ఈ బుజ్జి పిచ్చుక అంతదూరం ఎలా ఎగరగలదు. నీకు బుద్ధుందా.. లేదా?’ అంటూ తాబేలుపై గోలగోలగా అరవసాగాయి.

‘నేనేదో దాన్ని యుద్ధానికి పిలిచినట్లు అందరూ కోప్పడుతున్నారు. పందేనికి వస్తావా రావా? అనికదా అడిగాను. నా వల్ల కాదని ఆ పిచ్చుక చెప్పవచ్చుగా. రేపు ఉదయం చేతనైతే నాతో పోటీలో పాల్గొనమని పిచ్చుకతో చెప్పండి’ అని పొగరుగా సముద్రంలోకి వెళ్లిపోయింది తాబేలు.

‘ఎలాగైనా సరే.. తాబేలు పొగరు అణచాలంటే, ఈ పందెంలో పిచ్చుక గెలవాలి. అది విజయం సాధించాలంటే.. ఏ మంత్రదండమో ఉండాలి. కానీ అది జరిగే పని కాదు’ బాధగా అంది పావురం. ‘నా దగ్గర మంత్రదండం ఉంది. నేను తప్పకుండా ఈ పందెంలో గెలుస్తాను’ అంది పిచ్చుక. ఈ మాటలు విన్న అక్కడి పక్షులన్నీ ఉలిక్కి పడ్డాయి.

‘ఆ తాబేలుకు గర్వం పట్టినట్లు... నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చుకా?’ అని అడిగింది కాకి. పోయిన వారం ఒక చిట్టి పక్షి ఇక్కడకు వచ్చినప్పుడు పలకరించి, కాసేపు మాట్లాడాను. దాని జీవన విధానం తెలుసుకొని ఆశ్చర్యపోయాను’ అంటూ ఆ చిట్టి పక్షి గురించి వివరించి చెప్పింది. మరుసటిరోజు తాబేలు, పిచ్చుక సముద్రం ఒడ్డున పందెం కోసం సిద్ధంగా నిలబడ్డాయి. పిచ్చుక నోటిలోఉన్న చొప్పబెండును చూసి.. ‘అదేమిటి?’  అనడిగింది తాబేలు. ‘నేను గెలవడానికి ఉపయోగపడే మంత్రదండం’ అంది పిచ్చుక. ‘మంత్రాలకు చింతకాయలు రాలేకాలం ఎప్పుడో పోయింది. నువ్వు తప్పకుండా ఓడిపోతావు’ అంటూ నవ్వింది తాబేలు.

కొంగ, చేప న్యాయనిర్ణేతలుగా వ్యవహరించాయి. ‘కావ్‌... కావ్‌... కావ్‌...’ అంటూ కాకి అరవగానే పిచ్చుక ఎగురుకొంటూ వెళ్లింది. ఎలాగూ పిచ్చుక గెలవదు. పైగా అది మధ్యలోనే ఎక్కడో సముద్రంలో పడి చచ్చిపోతుందని తాబేలు చాలా మెల్లిగా ఈదుకుంటూ ద్వీపానికి వెళ్లింది. అక్కడ కొంగ, చేప చేతుల మీదుగా బహుమతిని అందుకుంటున్న పిచ్చుకను చూడగానే.. ముందు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. తర్వాత అవమానంతో తల దించుకొంది తాబేలు.

‘మంత్రదండం ఎలా పనిచేసిందో చెబుతావా పిచ్చుకా!’ అని అడిగింది తాబేలు. నేను ఎగురుకొంటూ వస్తూ అలసి పోయినప్పుడల్లా... నోటిలోని చొప్పబెండును నీటిపై వేశా. తర్వాత కాసేపు దానిపైన కూర్చొని సేద తీరా... మళ్లీ వెంటనే దాన్ని నోట కరుచుకొని ఎగురుతూ వచ్చా. నాలాంటి ఒక చిన్న పక్షి ఇక్కడి నుంచి మనమున్న చోటుకు ఇలా ఎండుపుల్ల సహాయంతోనే అప్పుడప్పుడు వచ్చివెళ్తున్నట్లు చెప్పింది. ఇది నా దృష్టిలో మంత్రదండంలాంటిది’ అంది పిచ్చుక. ‘ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్లే ఇప్పుడు పిచ్చుక చేతిలో నేను ఓడిపోయా’ అని తాబేలు బాధ పడింది. తర్వాత పిచ్చుకకు అభినందనలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

- ఓట్ర ప్రకాష్‌రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని